మెదక్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సర్కారు బడుల్లో సమస్యలు తీరనున్నాయి. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. జిల్లాలోని 897 యూనిట్లలో టాయిలెట్ల ఏర్పాటు, 889 చోట్ల మరమ్మతులు చేపట్టేందుకు రూ.7కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 15లోగా పనులను పూర్తిచేయడంతోపాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్‌షెడ్ల ఏర్పాటు, ప్రహరీల నిర్మాణం, తాగునీటి వసతులు కల్పించేందుకు సర్వశిక్షా అభియాన్ సన్నద్ధమైంది.
సుప్తావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు.. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) వల్ల పునరుజ్జీవనం సాధ్యమైంది. 2014-15 విద్యా సంవత్సరంలో టెన్త్ ఫలితాల్లో సర్కారు బడులు మెరుగైన ఫలితాలు సాధించి సత్తా చాటాయి. ఇదే క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ప్రతి పాఠశాలలో టాయిలెట్లు, కిచెన్‌షెడ్లు, ప్రహరీ, తాగునీరు సౌకర్యాలు విధిగా కల్పించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో 897 పాఠశాలలకు రూ.1.25 లక్షల చొప్పున టాయిలెట్స్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ప్రతి టాయిలెట్‌లో కనీసం నాలుగు యూరినల్స్, ఒక డబ్ల్యూసీ (టాయిలెట్) ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అలాగే 889 పాఠశాలల్లో ఉన్న టాయిలెట్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేశారు. పాఠశాలల్లో బాలికలకు, బాలురకు వేర్వేరుగా టాయిలెట్లు నిర్మించనున్నారు. ప్రతి పాఠశాలలో కిచెన్‌షెడ్లు సైతం నిర్మించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు ఒక్కో కిచెన్‌షెడ్డుకు కేవలం రూ.75 వేలు మాత్రమే మంజూరుచేయడంతో దాదాపు 90 శాతం షెడ్లు నిర్మాణానికే నోచుకోలేదు. దీంతో పెరిగిన నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కో కిచెన్‌షెడ్డుకు రూ.1.50లక్షల చొప్పున మంజూరు చేశారు. అలాగే ప్రతి పాఠశాలలో రూ.1.25లక్షలతో ఒక టాయిలెట్ బ్లాక్‌ను నిర్మించాలని నిర్ణయించారు.
ఒక్కో బ్లాక్‌లో నాలుగు యూరినాల్స్, ఒక డబ్ల్యుసీతో పాటు నీటి వసతి, బయట నల్లా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు జూన్ 15లోగా ప్రతి పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం పూర్తి కావాలని కలెక్టర్ రాహుల్‌బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. దీంతో దాదాపు అన్ని పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం ప్రారంభమైంది. కాగా పాఠశాలలకు ప్రహరీలు, టాయిలెట్లు, కిచెన్‌షెడ్ల నిర్మాణానికి వచ్చే నెల 2లోగా సంబంధిత ప్రధానోపాధ్యాయులు ప్రతిపాదనలు పంపాలని డీఈఓ రాజేశ్వర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఆవిర్బావ దినోత్సవాలు నిర్వహించాలి
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని డీఈఓ రాజేశ్వర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 1 రాత్రి 11.50 గంటల నుంచి జూన్ 2 రాత్రి 12.10గంటల వరకు ఆవిర్భావ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చాలని ఆదేశించారు. 2న ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ గావించాలని, 3న పాఠశాలల్లో చిత్రలేఖన పోటీలు, పాటల పోటీలు, తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
సమస్యలు హుష్‌కాకి!
Published Tue, May 26 2015 12:03 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement