
కొండెక్కిన కోడిగుడ్డు
గుంటూరు ఎడ్యుకేషన్ వంట గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు గతంలోనే పెరిగిపోగా.. తాజాగా కోడిగుడ్డు ధర కొండెక్కటంతో మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్
వంట గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు గతంలోనే పెరిగిపోగా.. తాజాగా కోడిగుడ్డు ధర కొండెక్కటంతో మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సొమ్ముతో మెనూ సరిగా పాటించలేక, విద్యార్థుల కడుపు పూర్తిగా నింపలేక సతమతమవుతున్నారు. జిల్లాలోని 3,600 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి రోజు 2.50 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఆరగిస్తున్నారు.
బియ్యాన్ని ప్రభుత్వమే సరఫరా చేస్తుండగా కూరగాయలు, పప్పు, నూనె ఇతర నిత్యావసరాలను ఏజెన్సీ నిర్వాహకులే సమకూర్చుకుంటున్నారు. ఇందుకుగాను ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రోజుకు రూ.4, ఉన్నత పాఠశాల విద్యార్థికి రూ.6 చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. వీరందరికీ వారంలో రెండు రోజులు కోడిగుడ్డు అందించాలని మెనూలో స్పష్టం చేసింది.
ప్రస్తుతం కోడిగుడ్డు ధర నాలుగు రూపాయలకు చేరింది. దీంతో విద్యార్థికి కేటారుుస్తున్న సొమ్ము గుడ్డు కొనుగోలుకే సరిపోతోందని, మిగిలిన వస్తువుల కోనుగోలుకు చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోందని ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు. మరోవైపు వంట గ్యాస్‌కు సబ్సిడీ ధర వర్తించకపోవటం భారంగా పరిణమించింది.
ఈ నేపథ్యంలో విద్యార్థికి రూ.10 చొప్పున ఇవ్వాలని వంట ఏజెన్సీల నిర్వాహకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అప్పులు చేయాల్సి వస్తోంది..
మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం ఇస్తున్న నిధులు చాలడం లేదు. ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వమిచ్చే 6 రూపాయల్లో కోడిగుడ్డుకే రూ.4 సరిపోతోంది. ఇక నూనె, కందిపప్పు, కూరగాయలు కొనుగోలు చేయటానికి అప్పులు చేయూల్సి వస్తోంది. బడ్జెట్ పెంచితేనే అందరి కష్టాలు తీరతారుు.
-వై.మహేశ్వరి, వంట ఏజెన్సీ నిర్వాహకురాలు, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, గుంటూరు