అప్పుచేసి ‘మధ్యాహ్నం’
మూన్నెళ్లుగా అందని బిల్లులు
* ఏజెన్సీ నిర్వాహకుల ఆందోళన
* వంట కార్మికులకూ వేతనాలు కరువు
నాగిరెడ్డిపేట : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ‘మధ్యాహ్న భోజన’పథకానికి సంబంధించిన బిల్లు లు మూడునెలలుగా పేరుకుపోయాయి.దీంతో పథకాన్ని అమలు పర్చేందుకు ఏజెన్సీ నిర్వాహకులు నానా అవస్థలు పడుతున్నారు. అప్పుచేసి పథకాన్ని అమలు పర్చక తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల కోసం వారు నిత్యం మండల కేంద్రాల్లోని విద్యావనరుల కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా సుమారు రూ.11కోట్ల వరకు బకాయి పడినట్లు ఏజెన్సీ నిర్వాహకులు తెలుపుతున్నారు. జిల్లాలోని 2,303 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలవుతోంది.
వంటకార్మికులకు వెతలు
పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం వండిపెడుతున్న కార్మికులకు సైతం మూడునెలలుగా వేతనాలు అందడంలేదు. 1నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు మధ్యాహ్నభోజనం తింటే ఒక్కొక్కరికి రూ.4.35 పైసలు, 6 నుండి10వ తరగతి వరకు చదివే విద్యార్థులలో ఒక్కొక్కరికి రూ.6 చొప్పున వేతనాలు ఇస్తారు. దీంతోపాటు 100 మందిలోపు విద్యార్థులు మధ్యాహ్నభోజనం చేసే పాఠశాలల్లో వంటచేసే వారికి నెలకు రూ.వెయ్యి, 100-200 మంది విద్యార్థులు భోజనంచేసే పాటశాలల్లోని నెలకు రూ.2వేలు, 200-300మంది విద్యార్థులు భోజనంచేసే పాఠశాలల్లో నెలకు రూ.3 వేల చొప్పున వేతనాలు చెల్లిస్తారు.
ఏజెన్సీ నిర్వాహకులకు, వంటచేసే కార్మికులకు సకాలంలో బిల్లులు, వేతనాలు అందకపోవడంతో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టలేకపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలల విద్యార్థులు సైతం నాణ్యమైన భోజనం పెట్టించేందుకు ఏజెన్సీలపై ఒత్తిడి చేయలేకపోతున్నారు.