‘అప్పు’ చేసి.. పప్పు కూడు
మధ్యాహ్న భోజన పథకం మెనూ ఇలా..
సోమ, గురువారం : అన్నం + కూరగాయలతో కూడిన సాంబారు
మంగళవారం, శుక్రవారం : ఏదైనా ఒక కూర+ రసం
బుధవారం, శనివారం : పప్పు, ఆకు కూర పప్పు
వీటితో పాటు వారానికిరెండు రోజులు కోడిగుడ్డును అందించాలి.
ధర్మవరం : మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకు ఐదు నెలలుగా బిల్లులు మంజూరు కాలేదు. దీంతో ఏజెన్సీలను నడిపేందుకు నిర్వాహకులు పడరాని పాట్లు పడుతున్నారు. అప్పో సప్పో చేసి అన్నం పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించలేక పోతున్నామని వారు వాపోతున్నారు.జిల్లా వ్యాప్తంగా 3,742 ప్రాథమిక, 596 ప్రాథమికోన్నత, 603 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,90,782 మంది చదువుతున్నారు. 4,491 ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వం 1 నుంచి 8వ తరగతి పిల్లలకు ఒక్కొక్కరికి రూ.4.60 పైసలు, 9,10 తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6.30 చొప్పున చెల్లిస్తోంది.
రూ. లక్షల్లో బకాయిలు
మధ్యాహ్న భోజన నిర్వాహకులకు వేతనాలు, బిల్లుల రూపంలో రూ.లక్షల్లో బకాయిలున్నాయి. సగటున వంద మంది విద్యార్థులకు భోజనం అందిస్తున్న ఏజెన్సీకి నెలకు రూ.20 వేల దాకా బిల్లు అందాల్సివుంది. అంటే ఐదు నెలలకు కలిపి రూ.లక్ష దాకా బకాయి ఉంది. ప్రాథమిక పాఠశాలలకు 2015 నవంబర్ నుంచి.. ఉన్నత పాఠశాలలకు అక్టోబర్ నుంచి బిల్లులు చెల్లించాల్సివుంది.