ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
పాతబస్టాండ్: కలెక్టరేట్ సోమవారం ఉదయం ధర్నాలతో దద్దరిల్లింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పలు సంఘాలు ఉద్యమించాయి. జీతాలు, భోజనం తయారీ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, ‘ఉపాధి’ ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారి సంఘ సభ్యులు, జ్యూట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారి సంఘాలు ధర్నాలు నిర్వహించాయి. దీంతో మధ్యాహ్నం వరకూ వారి నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం మారుమోగింది.
వంట కార్మికులకు రూ.2 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలి
వంట ఏజెన్సీలకు రూ.2 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని వారి ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.నాగమణి డిమాండ్ చేశారు. వంట నిర్వాహకులు చేసిన ధర్నానుద్దేశించి ఆమె మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు నింగినంటాయని, కంటింజెన్సీ నిధులు రెట్టింపు చేయాలన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వంట చేస్తున్న వారిపై రాజకీయ వేధింపులు ఎక్కువవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వంట చేయడానికి గ్యాస్ సరఫరా చేయాలని, గుడ్డు, స్వీటు పెట్టిన రోజు అదనపు బడ్జెట్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సంఘ ప్రధాన కార్యదర్శి మహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జూట్ లాకౌట్ ఎత్తివేయాలి
పైడిభీమవరంలోని స్వర్ణాంధ్ర, జి.సిగడాం మండలం చీడివలస వద్దనున్న శ్రీకాకుళం జూట్ కర్మాగారం లాకౌట్లను ఎత్తివేయాలని ఆ కర్మాగారాల యూనియన్ ప్రతినిధులు ఎ.శ్రీనివాస్, జి.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నానుద్దేశించి వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యాలు కుమ్మక్కై కార్మికులను రోడ్డుపైకి నెట్టారని విమర్శించారు. ముందస్తునోటీసు ఇవ్వకుండా లాకౌట్ ప్రకటించడం దారుణమన్నారు. ఏళ్ల తరబడి వేతన సమస్యలు తీర్చకుండా కాలంగడుపుతూ వస్తోందని, పలుసార్లు యాజమాన్యాలకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయిందన్నారు. న్యాయమైన కోర్కెలు పరిష్కరిస్తూ లాకౌట్ ఎత్తివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.తిరుపతిరావు, డి.బలరాం తదితరులు పాల్గొన్నారు.
క్షేత్ర సహాయకులను కొనసాగించాలి
ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలను విరమించుకోవాలని వారి సంఘ నాయకుడు కె.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ యోచనకు వ్యతిరేకంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ క్షేత్ర సహాయకుల రిలే నిరాహారదీక్షలను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.తిరుపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు, తిరుపతిరావు మాట్లాడుతూ ఉపాధి వ్యవస్థను బలీయం చేసి సహకరించాల్సిన తరుణంలో ఈ వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అడ్డగోలుగా విడుదల చేసిన జీవో 2614, 1090లను నిలుపుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా 4,500 మందిని తొలగించేందుకు చేసే ప్రయత్నాన్ని నిలుపుదల చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్.సూరిబాబు, డి.గోవిందరావు, పంచాది పాపారావు, టి.తిరుపతిరావు, బి.సూరయ్య, డి.గణేశ్ ప్రసంగించారు. తొలిరోజు దీక్షలో కె.లక్ష్మణరావు, ఎన్.రామకృష్ణ, కె.చంద్రశేఖర్, కె.లచ్చుము, నారాయణరావు, కిశోర్‌కుమార్, రామారావు, శ్యామలరావు, గోవిందమ్మ, రామకృష ఉన్నారు.