old bus stand
-
సిరిసిల్ల బస్టాండ్‌లో కాకుల హల్చల్
సిరిసిల్ల టౌన్: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో శనివారం రెండు కాకులు హల్చల్ చేశాయి. పాతబస్టాండులోని వేపచెట్టుపై ఉండే కాకులు మధ్యాహ్నం సమయంలో అటువైపు వస్తున్న పురుషులపై మాత్రమే దాడి చేశాయి. నాలుగైదు గంటల పాటు కేవలం మగవారి తలలపై తన్నుతూ దాడి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చివరికి స్థానికులు ఈ తతంగాన్ని పరీక్షించగా చెట్టుపై గూడులో కాకి పిల్లల్ని పెట్టినట్లు తెలిసింది. శత్రువులు రాకుండా చూడటంలో భాగంగానే ఇలా చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. అయితే ఈ విషయం స్థానికంగా చర్చకు దారితీసింది. -
ఖాకీ కాంప్లెక్స్‌కు ‘కుచ్చుటోపీ’..!
సాక్షి, కడప అర్బన్ : సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోంది. అలాంటి పోలీసు శాఖ పర్యవేక్షణలో ఉన్న పోలీసు కాంప్లెక్స్ దుకాణాల నిర్వాహకులు కొందరు ఆ శాఖ ఆదాయానికి గండిపడేలా ప్రవర్తించి ఏకంగా వారికే ‘కుచ్చుటోపీ’ పెడుతున్నారు. ఈ వ్యవహారంపై విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. జిల్లా పోలీసు యంత్రాంగం సంక్షేమం కోసం కడప నగరం నడిబొడ్డున పాతబస్టాండ్ సమీపంలో 14 సెంట్ల స్థలంలో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ దుకాణాల ద్వారా వచ్చే ఆదాయంతో అక్కడే ఉన్న పోలీస్ గెస్ట్‌హౌస్ నిర్వహణ, ఇతర ఖర్చులు, సంక్షేమం కోసం అప్పట్లో కడప ఒన్‌టౌన్ సీఐ పర్యవేక్షణలో వినియోగించేవారు. 2002కు ముందు ఈ దుకాణాల అద్దె నామమాత్రంగా ఉండేది. తర్వాత 2003లో 22 దుకాణాలకు గానూ టెండర్లను ఆహ్వానించి అద్దెలను దుకాణం విస్తరణ స్థలాన్ని బట్టి నిర్ణయించారు. తర్వాత ఇప్పటి వరకు టెండర్ల ఆహ్వానం లేకుండా అద్దెలను చెల్లిస్తూనే కాలం వెళ్లదీస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఇదే స్థలంలో ఓ మూలన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను నిర్మించారు. ప్రస్తుతం ఈ గదుల నుంచి పోలీస్‌శాఖకు రూ.1.87 లక్షలు మాత్రమే నెలసరి ఆదాయం వస్తోంది. పేరుకే 22 దుకాణాలు.. ఉన్నవి ఇంకెన్నో.. పోలీసుశాఖ పాతబస్టాండ్‌లోని తమ కాంప్లెక్స్‌కు కేవలం 22 దుకాణాలను కేటాయించి, తద్వారా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నామమాత్రపు అద్దెకు ఇచ్చారు. కానీ ఇక్కడ అంతా సవ్యంగా జరుగుతోందనుకుంటే పొరపాటే.. పోలీసు శాఖ నిర్ణయించిన అద్దెను చెల్లిస్తూనే మరికొంతమందికి అనధికారికంగా తమ దుకాణాల ముందు ప్రజలకు ఇబ్బందికరంగా మరికొంత స్థలాన్ని ఆక్రమించారు. మరికొంతమంది ఇది పోలీసు కాంప్లెక్స్ అనే ధీమాతో ఇష్టానుసారంగా తాము ఉంటున్న దుకాణానికి ముందు స్థలాన్ని అక్రమిస్తున్నట్లు, ఈ వ్యవహారాన్ని కూడా కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పోలీస్ కాంప్లెక్స్ దుకాణాల అద్దెల గడువు ఈనెలాఖరుకు ముగియనుంది. ఈ క్రమంలో పోలీసు కాంప్లెక్స్ అద్దె నిర్ణయ కమిటీ దుకాణాల కొలతలు చేపట్టారని, అయితే ఇదే దుకాణాల్లో పూల వ్యాపారం చేస్తున్న ఓ ప్రముఖుడు తాను అధికార పార్టీ నేతలతో మాట్లాడి టెండర్లు లేకుండానే చూస్తాననీ ధీమాగా ఇతరులకు చెబుతున్నట్లు బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.పోలీసు అధికారులచేత కేవలం అద్దె పెంచేలా చూస్తామనీ ఆయన చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఒక్కో దుకాణదారుడి నుంచి రూ.వేలల్లో వసూలు కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు దుకాణాల్లో అద్దెలకుంటున్న కొందరు అద్దెను చెల్లిస్తూనే, విద్యుత్ మీటర్లను తమ పేర్లతో తీసుకుని బిల్లులను కడుతున్నట్లు కూడా సమాచారం. 2003 నుంచి ప్రతి మూడేళ్లకోసారి టెండర్ల ద్వారా ఆశావహులను పిలిపించి అద్దెలను నిర్ణయిస్తే.. ఇప్పటికి నెలసరి అద్దె రూ.10–12 లక్షలు అవవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి ఆదాయ వనరుకు చక్కటి ఉదాహరణగా కడప నగరంలోని ఉమేష్‌చంద్ర కల్యాణ మండపానికి సంబంధించి అద్దెను పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు వివాహాది ఫంక్షన్ల కోసం నామమాత్రంగా కేటాయించారు. అయితే ఇదే కల్యాణ మండపానికి ఇతరులు శుభకార్యాల సమయంలో డెకరేషన్‌కు సంబంధించి కాంట్రాక్ట్‌ను గతంలో రూ.2 లక్షలు ఏడాదికి కేటాయించారు. ఇదే కాంట్రాక్ట్‌ను ఈ ఏడాది 2018 జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు ఏడాదికి డెకరేషన్ కాంట్రాక్ట్‌ను రూ.30 లక్షలుగా నిర్ణయించారు. -
జనం మధ్యలో వ్యక్తి దారుణ హత్య
శ్రీకాకుళం: ఎక్కడి నుంచి వచ్చాడో ఓ దుండగుడు అందరూ చూస్తుండగా రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కత్తితో అతి దారుణంగా పొడిచాడు. సినిమాను తలపించేలా జరిగిన ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో సోమవారం రాత్రి పాత బస్టాండ్ వద్ద చోటుచేసుకుంది. జనం మధ్యలోకి మాస్క్ వేసుకుని వచ్చి కత్తితో దాడి చేశాడు. దుండగుడి దాడిలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సినిమాలో సన్నివేశాన్ని చూస్తున్న ప్రేక్షకుల్లా అక్కడి జనం నిలబడిపోయారు. బాధితుడు తీవ్రగాయాలతోనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయి మృతిచెందాడు. మృతుడిది శ్రీకాకుళం పట్టణంలోని ఓ స్వీట్ షాప్ ఓనర్‌గా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సిద్దిపేట..ఉద్యమకోట
సిద్దిపేట జోన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన తొలి, మలి ఉద్యమాల్లో సిద్దిపేట పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగిందని, ఉద్యమ చరిత్ర పుటల్లో సిద్దిపేట స్థానం సుస్థిరంగా నిలుస్తుందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. స్థానిక పాతబస్టాండ్ వద్ద ఉద్యమ సమయంలో చేపట్టిన 1,531 రోజుల రిలే దీక్షలకు చిహ్నంగా పైలాన్ నిర్మాణం కోసం గురువారం మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమష్టి కృషితో చారిత్రాత్మకంగా సిద్దిపేటలో ఉద్యమ దీక్షలను విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. సిద్దిపేట దీక్షలు తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచాయన్నారు. సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన ఉద్యోగ గర్జన, రంగధాంపల్లిలో కేసీఆర్ దీక్ష, సిద్దిపేట జేఏసీ చారిత్రాత్మక దీక్షలు తెలంగాణ ఉద్యమంలో ఎప్పటికి నిలిచి ఉంటాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో చోటు చేసుకున్న ప్రధాన ఘట్టాలను సిద్దిపేటలోని భారీ పైలాన్ చట్రంలో చెక్కిస్తామన్నారు. భావితరాలకు ఉద్యమ చరిత్రను తెలిపే విధంగా పైలాన్ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఉద్యమ స్ఫూర్తిని బంగారు తెలంగాణ పునర్నిర్మాణానికి కూడా కొనసాగించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సిద్దిపేటకు దాహార్తిని తీర్చిన గ్రామీణ నీటి పథకం నేడు తెలంగాణ వాటర్ గ్రిడ్‌కు ఆదర్శంగా నిలిచిందన్నారు. సిద్దిపేట రింగ్ రోడ్డు నేడు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కేసీఆర్ మాట తప్పరు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో కేసీఆర్ చేసే వ్యాఖ్యలను చూస్తే భయమేసేదని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలో దీక్షకు పిలుపిచ్చిన కేసీఆర్ ఒక దశలో కేసీఆర్ శవయాత్ర, లేదంటే తెలంగాణ జైత్రయాత్ర ఏదో ఒకటి జరగాలంటూ బహిరంగ ప్రకటన ఇవ్వడం నాయకుల్లో కొంత భయాన్ని కలిగించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కూడా కేసీఆర్ ఇటీవలే నిండు శాసన సభలో పది జిల్లాల ప్రజలకు వాటర్ గ్రిడ్ ద్వారా నీటిని అందిస్తామని లేదంటే భవిష్యత్తులో ప్రజలను ఓట్లు అడగబోమని చెప్పడం మరోసారి భయమేసిందన్నారు. ఆ ధైర్యం, స్ఫూర్తి కేసీఆర్‌కు ఉన్నాయన్నారు. ఆ ధైర్యంతోనే రాష్ట్రాన్ని సాధించామని, నేడు వాటర్ గ్రిడ్‌ను కూడా సాధించి తీరుతామన్నారు. సిద్దిపేటలో ఏర్పాటు చేయనున్న పైలాన్ తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అదే విధంగా రంగధాంపల్లి శివారులో తెలంగాణ అమరవీరుల స్థూపం రాష్ట్రంలోనే అతిపెద్ద స్థూపంగా చరిత్రలో నిలిచిందన్నారు. కేసీఆర్ దీక్ష స్థలిలో భారీ స్థూప నిర్మాణాన్ని చర్యలు చేపడుతామన్నారు. అంతకుముందు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, చివరి వరకు యుద్ధంలో నిలిచేవారికే విజయం సిద్ధిస్తుందన్నారు. సిద్దిపేట ప్రాంతానికి గొప్ప ఉద్యమ చరిత్ర ఉందన్నారు. 1,531 రోజుల పాటు రిలే నిరాహార దీక్షల విజయవంతం వెనుక మంత్రి హరీష్‌రావు విశేష కృషి ఉందని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, నంది అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి, విద్యామండలి సభ్యులు పాపయ్య, ప్రెస్ అకాడమీ సభ్యులు అంజయ్య, హైదరాబాద్ జేఏసీ అధ్యక్షులు శ్రీధర్‌తో పాటు జేఏసీ నాయకులు వంగ గాల్‌రెడ్డి, అహ్మద్, మూర్తి అశోక్‌రెడ్డి, గుండు శ్రీనివాస్‌తో పాటు టీఆర్ఎస్ నాయకులు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, చిన్న, మోహన్‌లాల్, శేషుకుమార్, శర్మ, మాణిక్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైలాన్ రూపశిల్పి రమణారెడ్డిని మంత్రి సన్మానించారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుల త్యాగంపై ప్రముఖ గాయకుడు బీమసేన పాడిన పాట అందరిని ఆకట్టుకుంది. ఏ పదవిలో ఉన్నా సిద్దిపేట అభివృద్ధిని మరువను ‘‘సిద్దిపేట నాకు రాజకీయ జన్మనిచ్చిన ప్రాంతం. ఉద్యమ సమయంలో, ప్రస్తుతం మంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రమంతా తిరగాల్సి వస్తుంది. ఎక్కడ ఉన్నా, మదిలో మాత్రం సిద్దిపేట నియోజకవర్గ ప్రజలే మెదులుతుంటారు. సిద్దిపేట గౌరవాన్ని కాపాడేందుకే అహర్నిశలు పాటుపడుతాను’’ అని నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం సిద్దిపేట పట్టణంలోని మిలాత్ ఏ ఇస్లామియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో అవార్డుల ప్రదానోత్సవంలో, మదీన ఫంక్షన్హాల్లో జరిగిన మైనార్టీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం పేద వధువుల వివాహం కోసం షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం అమలులో కొన్ని మార్పులు చేయాలని మైనార్టీలు కోరారనీ, ఆ మార్పుల విషయంపై త్వరలో సీఎంతో చర్చింస్తానన్నారు. సిద్దిపేట నియోజకవర్గ ముస్లిం సమస్యల పరిష్కారం కోసం జిల్లాకు చెందిన మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని ప్రతి వారంలో ఒక రోజు సిద్దిపేటలో ఉండేలా ఆదేశాలు జారీ చేస్తానన్నారు. త్వరలో సిద్దిపేటలో జిల్లా కావడం ఖాయమని, భవిష్యత్‌లో జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం సిద్దిపేటలోనే ఏర్పాటు కానుందన్నారు. తడకపల్లి శివారులో రూ. 5 వేల కోట్లతో భారీ రిజర్వాయర్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. విద్యా, విద్యుత్, వైద్యం రంగాల్లో సిద్దిపేట ఎంతో ప్రగతి సాధించిందన్నారు. ఉపాధి కోసం పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. అంతకుముందు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్హుస్సేన్లు మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో వివిధ రంగాల్లో సేవలు చేసిన వారిని ముస్లిం వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో మంత్రి సన్మానించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
పాతబస్టాండ్: కలెక్టరేట్ సోమవారం ఉదయం ధర్నాలతో దద్దరిల్లింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పలు సంఘాలు ఉద్యమించాయి. జీతాలు, భోజనం తయారీ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, ‘ఉపాధి’ ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారి సంఘ సభ్యులు, జ్యూట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారి సంఘాలు ధర్నాలు నిర్వహించాయి. దీంతో మధ్యాహ్నం వరకూ వారి నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం మారుమోగింది. వంట కార్మికులకు రూ.2 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలి వంట ఏజెన్సీలకు రూ.2 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని వారి ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.నాగమణి డిమాండ్ చేశారు. వంట నిర్వాహకులు చేసిన ధర్నానుద్దేశించి ఆమె మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు నింగినంటాయని, కంటింజెన్సీ నిధులు రెట్టింపు చేయాలన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వంట చేస్తున్న వారిపై రాజకీయ వేధింపులు ఎక్కువవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వంట చేయడానికి గ్యాస్ సరఫరా చేయాలని, గుడ్డు, స్వీటు పెట్టిన రోజు అదనపు బడ్జెట్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సంఘ ప్రధాన కార్యదర్శి మహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జూట్ లాకౌట్ ఎత్తివేయాలి పైడిభీమవరంలోని స్వర్ణాంధ్ర, జి.సిగడాం మండలం చీడివలస వద్దనున్న శ్రీకాకుళం జూట్ కర్మాగారం లాకౌట్లను ఎత్తివేయాలని ఆ కర్మాగారాల యూనియన్ ప్రతినిధులు ఎ.శ్రీనివాస్, జి.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నానుద్దేశించి వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యాలు కుమ్మక్కై కార్మికులను రోడ్డుపైకి నెట్టారని విమర్శించారు. ముందస్తునోటీసు ఇవ్వకుండా లాకౌట్ ప్రకటించడం దారుణమన్నారు. ఏళ్ల తరబడి వేతన సమస్యలు తీర్చకుండా కాలంగడుపుతూ వస్తోందని, పలుసార్లు యాజమాన్యాలకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయిందన్నారు. న్యాయమైన కోర్కెలు పరిష్కరిస్తూ లాకౌట్ ఎత్తివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.తిరుపతిరావు, డి.బలరాం తదితరులు పాల్గొన్నారు. క్షేత్ర సహాయకులను కొనసాగించాలి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలను విరమించుకోవాలని వారి సంఘ నాయకుడు కె.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ యోచనకు వ్యతిరేకంగా ఎన్ఆర్ఈజీఎస్ క్షేత్ర సహాయకుల రిలే నిరాహారదీక్షలను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.తిరుపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు, తిరుపతిరావు మాట్లాడుతూ ఉపాధి వ్యవస్థను బలీయం చేసి సహకరించాల్సిన తరుణంలో ఈ వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అడ్డగోలుగా విడుదల చేసిన జీవో 2614, 1090లను నిలుపుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా 4,500 మందిని తొలగించేందుకు చేసే ప్రయత్నాన్ని నిలుపుదల చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్.సూరిబాబు, డి.గోవిందరావు, పంచాది పాపారావు, టి.తిరుపతిరావు, బి.సూరయ్య, డి.గణేశ్ ప్రసంగించారు. తొలిరోజు దీక్షలో కె.లక్ష్మణరావు, ఎన్.రామకృష్ణ, కె.చంద్రశేఖర్, కె.లచ్చుము, నారాయణరావు, కిశోర్‌కుమార్, రామారావు, శ్యామలరావు, గోవిందమ్మ, రామకృష ఉన్నారు. -
సాంఘిక బహిష్కరణ
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ప్యాకేజీల కోసం పాకులాడుతూ రాష్ట్రాన్ని విభజించేందుకు యత్నిస్తున్న సమైక్య ద్రోహులను సాంఘికంగా బహిష్కరించాలని వక్తలు పిలుపునిచ్చారు. విశాలాంధ్ర మహాసభ, జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కర్నూలు పాతబస్టాండ్ వద్ద సమైక్య సత్యాగ్రహం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అస్సాం గణపరిషత్ అధ్యక్షుడు, ఎంపీ జోసఫ్ టోపో, సమతాపార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వి.వి. కృష్ణారావు, విశాలాంధ్ర మహాసభ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లబోతుల చక్రవర్తి ప్రసంగించారు. రాష్ట్ర విభజన కోరుకుంటున్న వారికి ఎవరూ సహకారాన్ని అందించవద్దని సూచించారు. డిసెంబర్లో 371డిని సవరించే ప్రసక్తే లేదని, గట్టిగా పోరాటం చేస్తే విభజన ఆగిపోతుందని పేర్కొన్నారు. జోసఫ్ టోపో మాట్లాడుతూ.. విదేశీయులు అస్సాంపై దండయాత్ర చేసినప్పుడు విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి ఎదుర్కొన్నారని, సీమాంధ్ర ఉద్యమం సైతం తనకు అలాగే కనిపిస్తోందన్నారు. భాష, జాతి ఐక్యతను కాపాడుకోవడం కోసం ఉద్యమాలు చేసి విజయం సాధించామని పేర్కొన్నారు. బ్రిటీష్ వారు స్వాతంత్య్రం ఇచ్చి వెళ్తూ విభజించు పాలించు అనే సూత్రాన్ని కాంగ్రెస్ నేతలకు నేర్పిపోయారని ఎద్దేవా చేశారు. ఈశాన్యరాష్ట్రాలన్నీ కలుపుకుని హక్కుల కోసం పోరాటం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామనిచెప్పారు. సీమాంధ్రలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా చేసే ఈ ఉద్యమం ఫలిస్తుందన్నారు. ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయానికి చంద్రబాబు తూట్లు తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన నందమూరి తారక రామారావు ఆశయానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తూట్లు పొడుస్తున్నారని సమతాపార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వి.వి. కృష్ణారావు ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఒక్కో ప్రాంతం వారు ఒక్కో విధంగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారన్నారు. ఈ తరుణంలో విభజన చేయడం సరికాదని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు మైనార్టీలో ఉన్నాయని, వాటినికి రాష్ట్రాన్ని విభజించే అధికారం లేదన్నారు. సీడబ్ల్యుసీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైనార్టీలు, ఆదివాసీల హక్కుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడే అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని అంబేద్కర్ చెప్పారన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాంతం వారు మైనార్టీలో తేల్చి అప్పుడు రాష్ట్రాన్ని విభజించాలని కోరారు.కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి రవితేజ, నాయకులు రామజోగయ్య, శ్రీనివాసరెడ్డి, జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు జి. పుల్లయ్య, వి. జనార్దన్‌రెడ్డి, కె. చెన్నయ్య, శ్రీనివాసరెడ్డి, పిబివి సుబ్బయ్య, వాసుదేవయ్య, ఇతర శాఖల జేఏసీ నాయకులు ప్రసంగించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జిల్లా చైర్మన్ చిన్న వెంకటస్వామి, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ కొణిదేల శివనాగిరెడ్డి, జిల్లా విద్యార్థి జేఏసీ చైర్మన్ బాలకిరణ్ పాల్గొన్నారు. కళాకారుల గీతాలు ఉద్యమ స్ఫూర్తిని నింపాయి. ఈ కార్యక్రమానికి నగరంలోని విద్యార్థులు, ప్రజలు వేల సంఖ్యలో హాజరయ్యారు. సమైక్యాంధ్ర నినాదాలతో సభాప్రాంగణం దద్దరిల్లింది. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలర్పించిన అమర వీరు స్థూపం నమూనా ఆకట్టుకుంది.