సిద్దిపేట..ఉద్యమకోట
సిద్దిపేట జోన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన తొలి, మలి ఉద్యమాల్లో సిద్దిపేట పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగిందని, ఉద్యమ చరిత్ర పుటల్లో సిద్దిపేట స్థానం సుస్థిరంగా నిలుస్తుందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. స్థానిక పాతబస్టాండ్ వద్ద ఉద్యమ సమయంలో చేపట్టిన 1,531 రోజుల రిలే దీక్షలకు చిహ్నంగా పైలాన్ నిర్మాణం కోసం గురువారం మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమష్టి కృషితో చారిత్రాత్మకంగా సిద్దిపేటలో ఉద్యమ దీక్షలను విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. సిద్దిపేట దీక్షలు తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచాయన్నారు.
సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన ఉద్యోగ గర్జన, రంగధాంపల్లిలో కేసీఆర్ దీక్ష, సిద్దిపేట జేఏసీ చారిత్రాత్మక దీక్షలు తెలంగాణ ఉద్యమంలో ఎప్పటికి నిలిచి ఉంటాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో చోటు చేసుకున్న ప్రధాన ఘట్టాలను సిద్దిపేటలోని భారీ పైలాన్ చట్రంలో చెక్కిస్తామన్నారు. భావితరాలకు ఉద్యమ చరిత్రను తెలిపే విధంగా పైలాన్ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.
ఉద్యమ స్ఫూర్తిని బంగారు తెలంగాణ పునర్నిర్మాణానికి కూడా కొనసాగించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సిద్దిపేటకు దాహార్తిని తీర్చిన గ్రామీణ నీటి పథకం నేడు తెలంగాణ వాటర్ గ్రిడ్‌కు ఆదర్శంగా నిలిచిందన్నారు. సిద్దిపేట రింగ్ రోడ్డు నేడు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
కేసీఆర్ మాట తప్పరు
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో కేసీఆర్ చేసే వ్యాఖ్యలను చూస్తే భయమేసేదని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలో దీక్షకు పిలుపిచ్చిన కేసీఆర్ ఒక దశలో కేసీఆర్ శవయాత్ర, లేదంటే తెలంగాణ జైత్రయాత్ర ఏదో ఒకటి జరగాలంటూ బహిరంగ ప్రకటన ఇవ్వడం నాయకుల్లో కొంత భయాన్ని కలిగించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కూడా కేసీఆర్ ఇటీవలే నిండు శాసన సభలో పది జిల్లాల ప్రజలకు వాటర్ గ్రిడ్ ద్వారా నీటిని అందిస్తామని లేదంటే భవిష్యత్తులో ప్రజలను ఓట్లు అడగబోమని చెప్పడం మరోసారి భయమేసిందన్నారు. ఆ ధైర్యం, స్ఫూర్తి కేసీఆర్‌కు ఉన్నాయన్నారు.
ఆ ధైర్యంతోనే రాష్ట్రాన్ని సాధించామని, నేడు వాటర్ గ్రిడ్‌ను కూడా సాధించి తీరుతామన్నారు. సిద్దిపేటలో ఏర్పాటు చేయనున్న పైలాన్ తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అదే విధంగా రంగధాంపల్లి శివారులో తెలంగాణ అమరవీరుల స్థూపం రాష్ట్రంలోనే అతిపెద్ద స్థూపంగా చరిత్రలో నిలిచిందన్నారు. కేసీఆర్ దీక్ష స్థలిలో భారీ స్థూప నిర్మాణాన్ని చర్యలు చేపడుతామన్నారు. అంతకుముందు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, చివరి వరకు యుద్ధంలో నిలిచేవారికే విజయం సిద్ధిస్తుందన్నారు. సిద్దిపేట ప్రాంతానికి గొప్ప ఉద్యమ చరిత్ర ఉందన్నారు. 1,531 రోజుల పాటు రిలే నిరాహార దీక్షల విజయవంతం వెనుక మంత్రి హరీష్‌రావు విశేష కృషి ఉందని కొనియాడారు.
కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, నంది అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి, విద్యామండలి సభ్యులు పాపయ్య, ప్రెస్ అకాడమీ సభ్యులు అంజయ్య, హైదరాబాద్ జేఏసీ అధ్యక్షులు శ్రీధర్‌తో పాటు జేఏసీ నాయకులు వంగ గాల్‌రెడ్డి, అహ్మద్, మూర్తి అశోక్‌రెడ్డి, గుండు శ్రీనివాస్‌తో పాటు టీఆర్‌ఎస్ నాయకులు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, చిన్న, మోహన్‌లాల్, శేషుకుమార్, శర్మ, మాణిక్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైలాన్ రూపశిల్పి రమణారెడ్డిని మంత్రి సన్మానించారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుల త్యాగంపై ప్రముఖ గాయకుడు బీమసేన పాడిన పాట అందరిని ఆకట్టుకుంది.
ఏ పదవిలో ఉన్నా సిద్దిపేట అభివృద్ధిని మరువను
‘‘సిద్దిపేట నాకు రాజకీయ జన్మనిచ్చిన ప్రాంతం. ఉద్యమ సమయంలో, ప్రస్తుతం మంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రమంతా తిరగాల్సి వస్తుంది. ఎక్కడ ఉన్నా, మదిలో మాత్రం సిద్దిపేట నియోజకవర్గ ప్రజలే మెదులుతుంటారు. సిద్దిపేట గౌరవాన్ని కాపాడేందుకే అహర్నిశలు పాటుపడుతాను’’ అని నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం సిద్దిపేట పట్టణంలోని మిలాత్ ఏ ఇస్లామియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో అవార్డుల ప్రదానోత్సవంలో, మదీన ఫంక్షన్‌హాల్‌లో జరిగిన మైనార్టీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం పేద వధువుల వివాహం కోసం షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
ఈ పథకం అమలులో కొన్ని మార్పులు చేయాలని మైనార్టీలు కోరారనీ, ఆ మార్పుల విషయంపై త్వరలో సీఎంతో చర్చింస్తానన్నారు. సిద్దిపేట నియోజకవర్గ ముస్లిం సమస్యల పరిష్కారం కోసం జిల్లాకు చెందిన మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని ప్రతి వారంలో ఒక రోజు సిద్దిపేటలో ఉండేలా ఆదేశాలు జారీ చేస్తానన్నారు. త్వరలో సిద్దిపేటలో జిల్లా కావడం ఖాయమని, భవిష్యత్‌లో జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం సిద్దిపేటలోనే ఏర్పాటు కానుందన్నారు. తడకపల్లి శివారులో రూ. 5 వేల కోట్లతో భారీ రిజర్వాయర్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
విద్యా, విద్యుత్, వైద్యం రంగాల్లో సిద్దిపేట ఎంతో ప్రగతి సాధించిందన్నారు. ఉపాధి కోసం పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. అంతకుముందు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్‌లు మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో వివిధ రంగాల్లో సేవలు చేసిన వారిని ముస్లిం వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో మంత్రి సన్మానించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.