కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ప్యాకేజీల కోసం పాకులాడుతూ రాష్ట్రాన్ని విభజించేందుకు యత్నిస్తున్న సమైక్య ద్రోహులను సాంఘికంగా బహిష్కరించాలని వక్తలు పిలుపునిచ్చారు. విశాలాంధ్ర మహాసభ, జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కర్నూలు పాతబస్టాండ్ వద్ద సమైక్య సత్యాగ్రహం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా అస్సాం గణపరిషత్ అధ్యక్షుడు, ఎంపీ జోసఫ్ టోపో, సమతాపార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వి.వి. కృష్ణారావు, విశాలాంధ్ర మహాసభ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లబోతుల చక్రవర్తి ప్రసంగించారు. రాష్ట్ర విభజన కోరుకుంటున్న వారికి ఎవరూ సహకారాన్ని అందించవద్దని సూచించారు.
డిసెంబర్‌లో 371డిని సవరించే ప్రసక్తే లేదని, గట్టిగా పోరాటం చేస్తే విభజన ఆగిపోతుందని పేర్కొన్నారు. జోసఫ్ టోపో మాట్లాడుతూ.. విదేశీయులు అస్సాంపై దండయాత్ర చేసినప్పుడు విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి ఎదుర్కొన్నారని, సీమాంధ్ర ఉద్యమం సైతం తనకు అలాగే కనిపిస్తోందన్నారు. భాష, జాతి ఐక్యతను కాపాడుకోవడం కోసం ఉద్యమాలు చేసి విజయం సాధించామని పేర్కొన్నారు. బ్రిటీష్ వారు స్వాతంత్య్రం ఇచ్చి వెళ్తూ విభజించు పాలించు అనే సూత్రాన్ని కాంగ్రెస్ నేతలకు నేర్పిపోయారని ఎద్దేవా చేశారు. ఈశాన్యరాష్ట్రాలన్నీ కలుపుకుని హక్కుల కోసం పోరాటం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామనిచెప్పారు. సీమాంధ్రలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా చేసే ఈ ఉద్యమం ఫలిస్తుందన్నారు. ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ఆశయానికి చంద్రబాబు తూట్లు తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన నందమూరి తారక రామారావు ఆశయానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తూట్లు పొడుస్తున్నారని సమతాపార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వి.వి. కృష్ణారావు ఆరోపించారు.
కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఒక్కో ప్రాంతం వారు ఒక్కో విధంగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారన్నారు. ఈ తరుణంలో విభజన చేయడం సరికాదని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు మైనార్టీలో ఉన్నాయని, వాటినికి రాష్ట్రాన్ని విభజించే అధికారం లేదన్నారు. సీడబ్ల్యుసీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైనార్టీలు, ఆదివాసీల హక్కుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడే అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని అంబేద్కర్ చెప్పారన్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాంతం వారు మైనార్టీలో తేల్చి అప్పుడు రాష్ట్రాన్ని విభజించాలని కోరారు.కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి రవితేజ, నాయకులు రామజోగయ్య, శ్రీనివాసరెడ్డి, జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు జి. పుల్లయ్య, వి. జనార్దన్‌రెడ్డి, కె. చెన్నయ్య, శ్రీనివాసరెడ్డి, పిబివి సుబ్బయ్య, వాసుదేవయ్య, ఇతర శాఖల జేఏసీ నాయకులు ప్రసంగించారు.
సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జిల్లా చైర్మన్ చిన్న వెంకటస్వామి, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ కొణిదేల శివనాగిరెడ్డి, జిల్లా విద్యార్థి జేఏసీ చైర్మన్ బాలకిరణ్ పాల్గొన్నారు. కళాకారుల గీతాలు ఉద్యమ స్ఫూర్తిని నింపాయి. ఈ కార్యక్రమానికి నగరంలోని విద్యార్థులు, ప్రజలు వేల సంఖ్యలో హాజరయ్యారు. సమైక్యాంధ్ర నినాదాలతో సభాప్రాంగణం దద్దరిల్లింది. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలర్పించిన అమర వీరు స్థూపం నమూనా ఆకట్టుకుంది.
సాంఘిక బహిష్కరణ
Published Fri, Nov 22 2013 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
Advertisement
Advertisement