ప్రభుత్వం మొద్దు నిద్ర
కవాడిగూడ, న్యూస్‌లైన్: ప్రభుత్వం హామీ ఇచ్చి 10 నెలలు గడుస్తున్నా నేటికీ మధ్యాహ్న భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించలేదని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. రమ ధ్వజమెత్తారు. హత్యలు, అత్యాచారాలు చేసి జైల్లో ఉన్న ఖైదీలకు రోజుకి రూ. 30 నుంచి రూ. 40 వెచ్చిస్తున్న ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి కేవలం రూ. 4.25 లే కేటాయించడం ఏమి సబబన్నారు.
ఎమ్మెల్యే, మంత్రులకు కార్లు, తిరగడానికి పెట్రోల్ వంటి సదుపాయాలను ఉచితంగా పొందుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 72 వేల 829 పాఠశాలలో 67 శాతం పాఠశాలలో వంట గదులు లేవు, 22 శాతం నీటి వసతి లేదు, 84 శాతం గ్యాస్ కనెక్షన్ లేదని స్వయంగా కాగ్ నివేదిక వెల్లడించినా ఘనత వహించిన నాయకులకు పట్టడం లేదని విమర్శించారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రమాద బీమా, పెండింగ్ బిల్లుల తక్షణ చెల్లింపు తదితర తమ ప్రధాన డిమాండ్లన్నింటిని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
చలో సెక్రటేరియట్‌కు వేల మంది మధ్యాహ్న భోజన కార్మికులు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబా, ఉపాధ్యక్షులు పుణ్యవతి, కార్యదర్శులు పాలడగు భాస్కర్, వంగూరు రాములు, ఏపీ నాగేశ్వర రావులు హాజరై మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు మద్దతు తెలిపారు.