
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
జిల్లాలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని, బకాయిలను చెల్లించాలిని కోరుతూ ఆ కార్మికులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని, బకాయిలను చెల్లించాలిని కోరుతూ ఆ కార్మికులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఉదయాన్నే సీఐటీయూ ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులు కలెక్టరేట్‌కు చేరుకుని నినాదాలు చేశారు. ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. కలెక్టరేట్‌లోకి ఎవరూ వెళ్ల్లేందుకు అవకాశం లేకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని వారిని విరమింపజేసే ప్రయత్నం చేశారు.
ఉద్యమకారులు విరమించకుండా నినాదాలు చేసి బైఠాయించడంతో సీఐ తాతారావు ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి మహిళలను అరెస్టు చేసి శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ సంఘటనలో 653 మంది వంట కార్మికులను అరెస్టు చేసి, అనంతరం పూచీ కత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం పథకం సంఘ అధ్యక్షురాలు కె. నాగమణి, సీఐటీయూ కార్యరద్శి డి.గోవిందరావు తదితరులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యు.తిరుపతిరావు, ఉపాధ్యక్షురాలు పి.అరుణ, వృత్తిదారుల సంఘం నాయకులు టి.తిరుపతిరావుపాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని జూడాల ధర్నా
రిమ్స్‌క్యాంపస్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ జూనియర్ డాక్టర్లు (జూడాలు) సోమవారం ధర్నా చేశారు. రిమ్స్ ఆవరణలోని రాజీవ్‌గాంధీ విగ్రహం ఎదుట జూనియర్ డాక్టర్లంతా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా రిమ్స్ జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు ద్వారకానాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కేవలం రోగులకు ఇంజక్షన్లు ఇవ్వడం, కట్లు కట్టడానికే వాడుతున్నారని వాపోయారు. మార్చి 29 నుంచి రోగులకు సేవచేస్తూ వస్తున్నామన్నారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ సేవలు అందిస్తున్నామని తెలిపారు. అయితే అప్పటి నుంచి నేటి వరకు స్కాలర్‌షిప్‌లు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 91 మంది జూనియర్ డాక్టర్లకు ఒక్క నెల మాత్రమే స్టైఫండ్ విడుదల చేశారని మిగిలిన నెలలు విడుదల చేయలేదన్నారు. తక్షణమే స్టైఫండ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పున్నం చందర్, అశ్విని పాల్గొన్నారు.