పెద్దకడబూరు : పచ్చని పల్లెల్లో పచ్చ నాయకులు మంటలను ఎగదోస్తున్నారు. అధికారం చాటున తెలుగుదేశం నాయకులు ఆగడాలకు తెరతీస్తున్నారు. గ్రామాల్లో కొత్త వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. సాఫీగా సాగుతున్న మధ్యాహ్న భోజనం పథకంలో జోక్యం చేసుకుంటూ,, అధికారులకు తలనొప్పిగా మారుతున్నారు. దేవాలయాల్లాంటి బడుల్లో రాజకీయాలు నెరుపుతున్నారు. పెద్దకడబూరు మండలం ముచ్చగిరి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పదేళ్లుగా పొదుపు గ్రూపు మహిళ వంట ఏజెన్సీ నిర్వహిస్తోంది.
ఎలాంటి ఆరోపణలు లేకున్నా ఆ ఏజెన్సీని మార్చాలని తెలుగు తమ్ముళ్లు ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓలపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే వారు ససేమిరా అంటున్నారు. అనుమతి ఉన్న ఏజెన్సీకే రేషన్, బిల్లులు ఇస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని టీడీపీ నాయకులకు సూచిస్తున్నారు. వీరి మాటలను లెక్కచేయకుండా మరో మహిళను రెచ్చగొట్టి, మధ్యాహ్న భోజనం వండించి, పిల్లలకు వడ్డిస్తున్నారు.
విద్యార్థులు ఎవరి వద్దకు వెళ్లి అన్నం పెట్టించుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. అనుమతి లేకుండా వంట చేయవద్దని ఆ మహిళకు ప్రధానోపాధ్యాయుడు రామ్మోహన్ సూచిస్తే.. ‘మా నాయకులు చెప్పారని, వారు చెప్పినట్లు చేస్తున్నానని’ ఆమె ఎదురు సమాధానం చెబుతోంది. రేషన్ దుకాణంలోకి వెళ్లి దౌర్జన్యంగా రేషన్ కూడా తెచ్చుకున్నట్లు సమాచారం.
ఈ వివాదాన్ని హెచ్‌ఎం బుధవారం సర్పంచ్, గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ అనుమతి ఉన్న ఏజెన్సీ మహిళే వంట చేయడం సమంజసమని వారు స్పష్టం చేశారు. కాగా.. ముచ్చగిరిలో కాక దొడ్డిమేకల పాఠశాలలోనూ ఇలాంటి వివాదమే తలెత్తినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎంఈఓ జగదీశ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి వచ్చే వరకు ఆగమని చెప్పినా వారు పట్టించుకోవడం లేదన్నారు. అయితే ఇప్పటిదాకా ప్రభుత్వ అనుమతి ఉన్న ఏజెన్సీకే బిల్లులు మంజూరు చేస్తామన్నారు.
పచ్చని పల్లెల్లో పచ్చ మంటలు
Published Thu, Jul 17 2014 2:19 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement