
‘మిథ్యా’హ్న భోజనం
కర్నూలు(విద్య) : అధికారుల నిర్లక్ష్యం, వంట ఏజెన్సీల అవినీతితో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అభాసుపాలవుతోంది. బడిలో పిల్లల సంఖ్యకు.. భోజనం వడ్డిస్తున్న విద్యార్థుల సంఖ్యకు పొంతన కుదరని పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున ప్రజాధనం వృథా అవుతున్నా పర్యవేక్షణ కొరవడింది. కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు కలసి వంట ఏజెన్సీలతో కుమ్మక్కై నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో 2,909 ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలలు, మదర్సాలు, ఎన్‌సీఎల్‌పీ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. అధికారుల లెక్కల ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు జిల్లాలో 4 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉండగా.. 3.70 లక్షల మంది ఈ పథకం కింద భోజనం చేస్తున్నారు. ఇందుకు గత యేడాది రూ.6,66,70,000 విడుదల చేశారు. 9, 10వ తరగతులకు మరో రూ.56లక్షలు నిధులు పంపిణీ చేశారు. గత ఏప్రిల్‌లో 16 రోజుల బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి.
సాధారణంగా డైస్ లెక్కల ప్రకారం ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఈ పథకం అమలుకు బిల్లులు మంజూరు చేస్తారు. ఆయా పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులున్నారనే విషయాన్ని హెచ్‌ఎంలు, ఎంఈవోలు ఆర్‌వీఎంకు నివేదిక అందజేస్తారు. దీని ఆధారంగా డైస్ లెక్కలను తయారు చేస్తారు. ఆ మేరకు పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తారు. అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపి నిధులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు కాపాడుకునేందుకు విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపుతున్నారని, జిల్లా మొత్తంగా 30 శాతం పైగాా నిధులు స్వాహా చేస్తున్నట్లు సమాచారం.
నాసిరకం భోజనంతో అనారోగ్యం
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఒకటి నుంచి 5వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి రూ.4.35లతో పాటు 100 గ్రాముల బియ్యం ఇస్తారు. 6 నుంచి 10వ తరగతి వరకు రూ.6లతో పాటు 150 గ్రాముల బియ్యం కేటాయిస్తారు. ప్రతిరోజూ విద్యార్థులకు అన్నంతో పాటు సాంబార్, పప్పు వండి పెట్టాలి. వారానికి రెండుసార్లు కోడిగుడ్లు అందజేయాలి. ఏజెన్సీల కక్కుర్తితో నాసిరకం కూరగాయలతో నీళ్లచారును వడ్డిస్తున్నారు. దీనికి తోడు వారంలో రెండుసార్లు కాకుండా ఒకసారి మాత్రమే గుడ్లను అందిస్తున్నారు.
కొన్ని చోట్ల గుడ్లకు బదులు అరటి పండ్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. లావుపాటి బియ్యంతో చేసిన అన్నాన్ని తినలేక అధికశాతం పిల్లలు సగం తిని పారేస్తున్నారు. ఆహారం సహించలేని పిల్లలకు కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నారు. దీంతో అధికశాతం పాఠశాలల్లో 60 శాతం కూడా భోజనం చేయడం లేదు. అయినా పాఠశాలల్లో దాదాపు 90 శాతం పిల్లలు భోజనం చేశారని నిధులు డ్రా చేస్తున్నారు. ఈ పథకాన్ని ఎంఈవోలు తనిఖీ చేసి జిల్లా అధికారులకు నివేదిక పంపాల్సి ఉన్నా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. తనిఖీలకు వెళ్లినా ఏజెన్సీలు ప్రజాప్రతినిదులచే ఒత్తిడి చేయించి వారి నోరు మూయిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వం మారడంతో ప్రస్తుత ఏజెన్సీలను రద్దు చేసి, టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టాలని ప్రజాప్రతినిదుల నుంచి అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది.
నత్తనడక వంటగదుల నిర్మాణం
మధ్యాహ్న భోజన పథకంలో ప్రధాన సమస్య అయిన వంటగదుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఈ పథకం కింద 2011-12లో మొదటి ఫేస్‌లో 2308 మంజూరు కాగా.. అందులో 1,732 నిర్మాణం చేయాలని నిర్ణయించారు. వీటిలో 356 మాత్రమే పూర్తి కాగా.. 895 వివిధ దశల్లో ఉన్నాయి. ఒక్కో వంట గదిని 132 చదరపు మీటర్లలో రూ.75 వేలతో నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 21 శాతం నిధులు రూ.3.63కోట్లు విడుదల చేశారు.
ఒక్క గది నిర్మాణానికి రూ.75 వేలు చాలా తక్కువని, ఈ మొత్తంతో నిర్మించలేమని పంచాయతీరాజ్ శాఖ తేల్చి చెప్పేసింది. దీంతో ప్రభుత్వం హౌసింగ్ విభాగానికి ఈ పనులను అప్పజెప్పింది. రాజకీయ జోక్యం, ఎన్నికల కోడ్ తదితర కారణాలతో వంట గదుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 2012-13లో సెకండ్ ఫేస్ కింద 1572 వంట గదులు మంజూరు కాగా వాటికి రూ.9.62 కోట్లు విడుదలయ్యాయి. ఒక్కోదానిని 301.4 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.1.50 లక్షలతో నిర్మించాలని నిర్ణయించారు. ఈ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి దాకా డిజైన్ రాకపోవడంతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు.