వెచ్చాల్లేకుండా వండిపెట్టేదెలా?
* మధ్యాహ్న భోజన పథకంపై సర్కారు నిర్లక్ష్యం
* రెండు నెలలుగా విడుదల కాని నిధులు
* అప్పులతో నెట్టుకొస్తున్న ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు
అమలాపురం : బియ్యం, నీళ్లు ఇవ్వకుండా వట్టి కుండ, కట్టెలు ఇచ్చి, అన్నం వండమన్నట్టుంది సర్కారు తీరు. మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకు రెండు, మూడు నెలులగా నిధులు విడుదల కాక, మూడు నెలలుగా సిబ్బందికి జీతాలందక పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు అక్టోబరు, నవంబరు నెలల్లో మధ్యాహ్న భోజన పథకానికి రావాల్సిన సొమ్ములు అందలేదు. కొన్ని పాఠశాలలకైతే సెప్టెంబరులో రావాల్సిన సొమ్ములు కూడా చేతికందలేదు.
మధ్యాహ్న భోజనానికి పౌరసరపరాల శాఖ ద్వారా బియ్యం అందుతుండగా, వారికి అన్నంతోపాటు అందించే పప్పు, కాయగూరలు, ఇతర నిత్యావసర వస్తువులకుగాను ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకు నిధులు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు రూ.3.78 కోట్ల వరకు అందించాల్సి ఉంది. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగిన నేపథ్యంలో తమకు గిట్టుబాటు కావడం లేదని ఏజెన్సీలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. వారానికి రెండుసార్లు అందించాల్సిన కోడిగుడ్డు ధర కూడా మండిపడడం వారికి మరీ భారమవుతోంది. ఈ పథకానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. చాలా ఏజెన్సీలు అప్పులు చేసి విద్యార్థులకు భోజనం అందించాల్సి వస్తోంది.