డీఎస్‌ఓ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్
సూపర్‌బజార్(కొత్తగూడెం) : యువజనులకు, క్రీడాకారులకు సేవలందించాల్సిన జిల్లా యువజన, క్రీడల శాఖా కార్యాలయం సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. రెండు శాఖలను ఒకే శాఖ పరిధిలోకి తీసుకువచ్చినా పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించలేదు. దీంతో ఉన్నవారిపై పనిభారం పెరిగింది. ఈ రెండింటిలో ఒక శాఖకు ఒక్కరు కూడా సిబ్బంది లేకపోవడం గమనార్హం. చివరకు జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పోస్టు సైతం ఇన్‌చార్జి పాలనలోనే సాగుతోంది.
జిల్లాల పునర్విభజన తర్వాత పూర్తిస్థాయిలో జిల్లా యువజన, క్రీడల అధికారి (డీఎస్‌ఓ)గా వెంకటరంగయ్య నియమితులయ్యారు. 2017 సెప్టెంబర్ మాసంలో ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీపై వెళ్లారు. దీంతో జిల్లాలో పరిశ్రమల శాఖాధికారిగా విధులు నిర్వహిస్తున్న కె.అజయ్ కుమార్‌కు డీఎస్‌ఓగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆయన కూడా ఇటీవల బదిలీ కావడంతో సిరిసిల్ల జిల్లా నుంచి జిల్లా పరిశ్రమల శాఖాధికారిగా బదిలీపై వచ్చిన జె.రాజారాంకు డీఎస్‌ఓ అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత
జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో జిల్లా అధికారితోపాటు సూపరింటెండెంట్, అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్‌లతోపాటు మరో ఆరుగురు వివిధ క్రీడలకు సంబంధించిన కోచ్‌లు కలిపి మొత్తం 13 మంది సిబ్బంది నిబంధనల ప్రకారం ఉండాలి. కానీ ప్రస్తుతం ఈ శాఖలో ఇన్‌చార్జి డీఎస్‌ఓతోపాటు సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.
అటెండర్ గతంలో ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన బదిలీలలో ఖమ్మానికి బదిలీ కాగా, ఇక్కడి కార్యాలయానికి మాత్రం ఎవరినీ నియమించలేదు. ఇన్‌చార్జి డీఎస్‌ఓగా ఉన్న పరిశ్రమల శాఖాధికారికి ఆ శాఖలో ఉండే పని ఒత్తిడి కారణంగా ఈ శాఖపై పూర్తిస్థాయి దృష్టి సారించలేకపోతున్నారనే విమర్శలున్నాయి. జిల్లా ఏర్పాటు కాకముందు యువజన, క్రీడలు వేరువేరు శాఖలు ఉండగా, జిల్లా ఏర్పాటు అనంతరం వీటిని విలీనం చేశారు. అప్పటి యువజన శాఖలో పనిచేసిన సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్‌లే ప్రస్తుతం రెండు శాఖలకు కలిపి పని చేస్తుండటం గమనార్హం.
క్రీడాపోటీల నిర్వహణ అంతంతమాత్రమే
యువజన, క్రీడల శాఖలో సిబ్బంది కొరత కారణంగా జిల్లాలో క్రీడాపోటీల నిర్వహణతోపాటు ఇతర పలు శాఖాపరమైన కార్యక్రమాల నిర్వహణ పూర్తిస్థాయిలో కొనసాగడంలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించి యువజనులకు, క్రీడాకారులకు అవసరమైన కార్యక్రమాలకు రూపకల్పన చేసి నిర్వహించాలని పలువురు క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు పంపించాం
జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. ఖాళీ పోస్టులను గుర్తించి, వాటికి సంబంధించిన ప్రతిపాదనలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి, స్పోర్ట్స్ అథారిటీకి పంపించాం.
–జె.రాజారాం, ఇన్‌చార్జి డీఎస్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment