district sports authority
-
ఇద్దరే ఉద్యోగులు
సూపర్‌బజార్(కొత్తగూడెం) : యువజనులకు, క్రీడాకారులకు సేవలందించాల్సిన జిల్లా యువజన, క్రీడల శాఖా కార్యాలయం సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. రెండు శాఖలను ఒకే శాఖ పరిధిలోకి తీసుకువచ్చినా పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించలేదు. దీంతో ఉన్నవారిపై పనిభారం పెరిగింది. ఈ రెండింటిలో ఒక శాఖకు ఒక్కరు కూడా సిబ్బంది లేకపోవడం గమనార్హం. చివరకు జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పోస్టు సైతం ఇన్చార్జి పాలనలోనే సాగుతోంది. జిల్లాల పునర్విభజన తర్వాత పూర్తిస్థాయిలో జిల్లా యువజన, క్రీడల అధికారి (డీఎస్ఓ)గా వెంకటరంగయ్య నియమితులయ్యారు. 2017 సెప్టెంబర్ మాసంలో ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీపై వెళ్లారు. దీంతో జిల్లాలో పరిశ్రమల శాఖాధికారిగా విధులు నిర్వహిస్తున్న కె.అజయ్ కుమార్‌కు డీఎస్‌ఓగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆయన కూడా ఇటీవల బదిలీ కావడంతో సిరిసిల్ల జిల్లా నుంచి జిల్లా పరిశ్రమల శాఖాధికారిగా బదిలీపై వచ్చిన జె.రాజారాంకు డీఎస్ఓ అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో జిల్లా అధికారితోపాటు సూపరింటెండెంట్, అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్లతోపాటు మరో ఆరుగురు వివిధ క్రీడలకు సంబంధించిన కోచ్‌లు కలిపి మొత్తం 13 మంది సిబ్బంది నిబంధనల ప్రకారం ఉండాలి. కానీ ప్రస్తుతం ఈ శాఖలో ఇన్చార్జి డీఎస్‌ఓతోపాటు సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. అటెండర్ గతంలో ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన బదిలీలలో ఖమ్మానికి బదిలీ కాగా, ఇక్కడి కార్యాలయానికి మాత్రం ఎవరినీ నియమించలేదు. ఇన్చార్జి డీఎస్‌ఓగా ఉన్న పరిశ్రమల శాఖాధికారికి ఆ శాఖలో ఉండే పని ఒత్తిడి కారణంగా ఈ శాఖపై పూర్తిస్థాయి దృష్టి సారించలేకపోతున్నారనే విమర్శలున్నాయి. జిల్లా ఏర్పాటు కాకముందు యువజన, క్రీడలు వేరువేరు శాఖలు ఉండగా, జిల్లా ఏర్పాటు అనంతరం వీటిని విలీనం చేశారు. అప్పటి యువజన శాఖలో పనిచేసిన సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లే ప్రస్తుతం రెండు శాఖలకు కలిపి పని చేస్తుండటం గమనార్హం. క్రీడాపోటీల నిర్వహణ అంతంతమాత్రమే యువజన, క్రీడల శాఖలో సిబ్బంది కొరత కారణంగా జిల్లాలో క్రీడాపోటీల నిర్వహణతోపాటు ఇతర పలు శాఖాపరమైన కార్యక్రమాల నిర్వహణ పూర్తిస్థాయిలో కొనసాగడంలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించి యువజనులకు, క్రీడాకారులకు అవసరమైన కార్యక్రమాలకు రూపకల్పన చేసి నిర్వహించాలని పలువురు క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు పంపించాం జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. ఖాళీ పోస్టులను గుర్తించి, వాటికి సంబంధించిన ప్రతిపాదనలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి, స్పోర్ట్స్ అథారిటీకి పంపించాం. –జె.రాజారాం, ఇన్చార్జి డీఎస్ఓ -
ఆటలెలా..?
వివాదాలకు కేరాఫ్ జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ నిలిచిపోయిన వేసవి శిక్షణ శిబిరాలు ఏడాది నుంచి ఇన్చార్జి అధికారే దిక్కు మహబూబ్‌నగర్ క్రీడలు : జిల్లాలో క్రీడల నిర్వహణ, క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్ఏ)ను ఏర్పాటు చేసింది. డీఎస్ఏ ద్వారా జిల్లాలో స్టేడియాల నిర్వహణ తదితర అంశాలను పర్యవేక్షిస్తారు.. కానీ, గత ఏడాది నుంచి డీఎస్ఏ వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. 2014 జనవరి మొదటివారంలో పైకా గ్రామీణ జాతీయ క్రీడలు జరిగినప్పటి నుంచి డీఎస్ఏకు అన్నీ ఆటంకాలే ఎదరవుతున్నాయి. గత ఏడాది జనవరిలో నిర్వహించిన పైకా రాష్ట్రస్థాయి క్రీడల నాటి నుంచి డీఎస్ఏ కార్యకలాపాలకు గ్రహణం పట్టింది. డీఎస్డీఓ నిర్వహించిన పైకా క్రీడల రికార్డులు సక్రమంగా లేవని, వాటి తీరును పరిశీలించాలని జిల్లా అదనపు జేసీ రాజారాంను అప్పటి కలెక్టర్ ఆదేశించారు. దీంతో అందుకు సంబంధించిన ఫైళ్లు సీజ్ చేశారు. దీనికి తోడు సార్వత్రిక ఎన్నికల సమయంలో విధులు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించారన్న కారణంగా ఏప్రిల్‌లో డీఎస్డీఓ శ్రీధర్‌రావును జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ చేశారు. ఆయన స్థానంలో సెట్మా సీఈఓ సోమశేఖర్‌రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు. శ్రీధర్‌రావు తమకు సమాచారం ఇచ్చి సెలవుపై వెళ్లినట్లు (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ) శాట్ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్‌కు లేఖ పంపడంతో మళ్లీ ఆయనను ఈ నెల 16న డీఎస్డీఓగావిధుల్లోకి తీసుకున్నారు, కానీ, మళ్లీ శ్రీధర్‌రావును శాట్‌కు సరేండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పైకా క్రీడల నిధులపై విజిలెన్స్‌కు ఫిర్యాదు... పైకా జాతీయ క్రీడల నిర్వహణకు వసూలు చేసిన నిధుల తాలూకు లెక్కలపై తెలంగాణ నవనిర్మాణ సేన రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ను ఆశ్రయించింది. ఈ మేరకు సోమవారం విజిలెన్స్ అధికారులు దీనిపై విచారణ జరిపినట్లు సమాచారం. జిల్లా యంత్రాంగం నుంచి పూర్తిస్థాయిలో నివేదికను తెప్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిలిచిపోయిన వేసవి శిబిరాలు డీఎస్ఏ ఆధ్వర్యంలో మే 1 నుంచి నెల రోజులపాటు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 20 అంశాల్లో వేసవి శిబిరాలు నిర్వహించాలి. కానీ, గత ఏడాది నుంచి శి బిరాలను నిర్వహించడం లేదు. ఈసారి ఇప్పటివరకు ఆయా క్రీడా సంఘాలతో డీఎస్ఏ అధికారులు సమావేశం నిర్వహించలేదు. దీంతో వేసవి శిబిరాలు వెనక్కివెళ్లినట్లు పలువురు క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. -
‘ఆట’ మొదలైంది
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్ఏ)లో ఇన్చార్జి డీఎస్డీఓ పోస్టు కోసం ఆట మొదలైంది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ శాప్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తున్న బాషామోహిద్దీన్ ఈనెల 23 నుంచి 55 రోజుల పాటు వ్యక్తిగత శెలవుపై హజ్‌యాత్రకు వెళ్తున్నారు. ఈయన ఇటు డీఎస్‌డీఓగా అటు సైనిక సంక్షేమ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సైనిక సంక్షేమ అధికారి ఇన్చార్జి బాధ్యతలను వికలాంగ శాఖ ఏడీ భాస్కర్‌రెడ్డికి అప్పగించారు. అలాగే డీఎస్డీఓ ఇన్చార్జి బాధ్యతలను వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేకాధికారి ఎం. రామచంద్రారెడ్డికి కేటాయిస్తూ ఈనెల 13న శాప్ ఎండీ నుంచి ఉత్తర్వులు అందాయి. ఈమేరకు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈనెల 23న బాధ్యతలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంతలో సీన్ మారిపోయింది. డీఎస్ఏకు చెందిన కొందరు అసోసియేషన్ నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి వారం రోజులు తిరక్కముందే శాప్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన హాకీ సీనియర్ కోచ్ రమేష్‌బాబును ఇన్చార్జి డీఎస్‌డీఓగా నియమిస్తూ ఉత్తర్వులు తీసుకువచ్చారు. దీంతో ఇద్దరిలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలో అర్థంకాక డీఎస్డీఓ బాషామొహిద్దీన్ నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్‌కే వదిలేసినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు సజావుగా సాగేనా.. జిల్లాలో ఈ నెలలో నిర్వహించాల్సిన జాతీయస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా వాయిదా పడ్డాయి. గతంలో కలెక్టర్ స్టేడియాన్ని సందర్శించి నిర్వహణా లోపాలపై అధికారులను మందలించిన విషయం తెలిసిందే. సమైక్య ఉద్యమం సద్దుమణిగిన వెంటనే జాతీయస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించే అవకాశం ఉంది. స్టేడియంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు చాలానే ఉన్నాయి. ఈ తరుణంలో రెగ్యులర్ డీఎస్డీఓ లేకపోవడం లోటే అయిన్పటికీ సమర్థుడైన అధికారిని నియమిస్తే తప్ప పోటీలు సజావుగా సాగేలా కన్పించడం లేదు. దీనికి తోడు ఇండోర్ స్టేడియం నిర్వహణలో పలు లోపాలతో పాటు ఫీజు వసూలులో సైతం అవకతవకలు ఉన్నాయన్న ఉద్దేశంతో క్రీడాకారులు చెల్లించే ఫీజును సైతం మీ సేవ ద్వారా చెల్లించేలా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించాడు. మరింత లోతైన విచారణ జరిగితే స్టేడియంలోని అవకతవకలు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉంది. బయటి అధికారి వస్తే ఇబ్బందని భావిస్తున్న కొందరు స్టేడియంలో పనిచేసే కోచ్‌నే ఇన్చార్జి డీఎస్‌డీఓగా నియమించేందుకు తమశక్తియుక్తులు ప్రదర్శిస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పోస్టు ఇవ్వడం తప్పేమీ కాదంటూ శాప్ నిబంధనల ప్రకారం కొన్ని జిల్లాల్లో ఇస్తున్నారంటూ మరో వాదన తీసుకువస్తున్నారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పోస్టును ఓ కాంట్రాక్ట్ ఉద్యోగికి ఎలా ఇస్తారంటూ మరో వాదనా మొదలైంది. దీంతో వ్యవహారం కలెక్టర్ వద్దకు చేరింది. స్వతహాగా క్రీడాకారుడైన జిల్లా కలెక్టర్ కోన శశిధర్ క్రీడల అభివృద్ధి కోసం మంచి నిర్ణయం తీసుకుని సమర్థుడైన క్రీడాధికారిని నియమించాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.