కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్‌ఏ)లో ఇన్‌చార్జి డీఎస్‌డీఓ పోస్టు కోసం ఆట మొదలైంది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ శాప్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అధికారిగా పనిచేస్తున్న బాషామోహిద్దీన్ ఈనెల 23 నుంచి 55 రోజుల పాటు వ్యక్తిగత శెలవుపై హజ్‌యాత్రకు వెళ్తున్నారు. ఈయన ఇటు డీఎస్‌డీఓగా అటు సైనిక సంక్షేమ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సైనిక సంక్షేమ అధికారి ఇన్‌చార్జి బాధ్యతలను వికలాంగ శాఖ ఏడీ భాస్కర్‌రెడ్డికి అప్పగించారు. అలాగే డీఎస్‌డీఓ ఇన్‌చార్జి బాధ్యతలను వైఎస్‌ఆర్ స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేకాధికారి ఎం. రామచంద్రారెడ్డికి కేటాయిస్తూ ఈనెల 13న శాప్ ఎండీ నుంచి ఉత్తర్వులు అందాయి. ఈమేరకు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈనెల 23న బాధ్యతలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇంతలో సీన్ మారిపోయింది. డీఎస్‌ఏకు చెందిన కొందరు అసోసియేషన్ నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి వారం రోజులు తిరక్కముందే శాప్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన హాకీ సీనియర్ కోచ్ రమేష్‌బాబును ఇన్‌చార్జి డీఎస్‌డీఓగా నియమిస్తూ ఉత్తర్వులు తీసుకువచ్చారు. దీంతో ఇద్దరిలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలో అర్థంకాక డీఎస్‌డీఓ బాషామొహిద్దీన్ నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్‌కే వదిలేసినట్లు తెలుస్తోంది.
జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
సజావుగా సాగేనా..
జిల్లాలో ఈ నెలలో నిర్వహించాల్సిన జాతీయస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా వాయిదా పడ్డాయి. గతంలో కలెక్టర్ స్టేడియాన్ని సందర్శించి నిర్వహణా లోపాలపై అధికారులను మందలించిన విషయం తెలిసిందే. సమైక్య ఉద్యమం సద్దుమణిగిన వెంటనే జాతీయస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించే అవకాశం ఉంది. స్టేడియంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు చాలానే ఉన్నాయి.
ఈ తరుణంలో రెగ్యులర్ డీఎస్‌డీఓ లేకపోవడం లోటే అయిన్పటికీ సమర్థుడైన అధికారిని నియమిస్తే తప్ప పోటీలు సజావుగా సాగేలా కన్పించడం లేదు. దీనికి తోడు ఇండోర్ స్టేడియం నిర్వహణలో పలు లోపాలతో పాటు ఫీజు వసూలులో సైతం అవకతవకలు ఉన్నాయన్న ఉద్దేశంతో క్రీడాకారులు చెల్లించే ఫీజును సైతం మీ సేవ ద్వారా చెల్లించేలా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించాడు. మరింత లోతైన విచారణ జరిగితే స్టేడియంలోని అవకతవకలు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉంది. బయటి అధికారి వస్తే ఇబ్బందని భావిస్తున్న కొందరు స్టేడియంలో పనిచేసే కోచ్‌నే ఇన్‌చార్జి డీఎస్‌డీఓగా నియమించేందుకు తమశక్తియుక్తులు ప్రదర్శిస్తున్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పోస్టు ఇవ్వడం తప్పేమీ కాదంటూ శాప్ నిబంధనల ప్రకారం కొన్ని జిల్లాల్లో ఇస్తున్నారంటూ మరో వాదన తీసుకువస్తున్నారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పోస్టును ఓ కాంట్రాక్ట్ ఉద్యోగికి ఎలా ఇస్తారంటూ మరో వాదనా మొదలైంది. దీంతో వ్యవహారం కలెక్టర్ వద్దకు చేరింది. స్వతహాగా క్రీడాకారుడైన జిల్లా కలెక్టర్ కోన శశిధర్ క్రీడల అభివృద్ధి కోసం మంచి నిర్ణయం తీసుకుని సమర్థుడైన క్రీడాధికారిని నియమించాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.
‘ఆట’ మొదలైంది
Published Mon, Sep 23 2013 3:10 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement
Advertisement