ఆటలెలా..?
వివాదాలకు కేరాఫ్ జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ
నిలిచిపోయిన వేసవి శిక్షణ శిబిరాలు
ఏడాది నుంచి ఇన్‌చార్జి అధికారే దిక్కు
మహబూబ్‌నగర్ క్రీడలు : జిల్లాలో క్రీడల నిర్వహణ, క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్‌ఏ)ను ఏర్పాటు చేసింది. డీఎస్‌ఏ ద్వారా జిల్లాలో స్టేడియాల నిర్వహణ తదితర అంశాలను పర్యవేక్షిస్తారు.. కానీ, గత ఏడాది నుంచి డీఎస్‌ఏ వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. 2014 జనవరి మొదటివారంలో పైకా గ్రామీణ జాతీయ క్రీడలు జరిగినప్పటి నుంచి డీఎస్‌ఏకు అన్నీ ఆటంకాలే ఎదరవుతున్నాయి.
గత ఏడాది జనవరిలో నిర్వహించిన పైకా రాష్ట్రస్థాయి క్రీడల నాటి నుంచి డీఎస్‌ఏ కార్యకలాపాలకు గ్రహణం పట్టింది. డీఎస్‌డీఓ నిర్వహించిన పైకా క్రీడల రికార్డులు సక్రమంగా లేవని, వాటి తీరును పరిశీలించాలని జిల్లా అదనపు జేసీ రాజారాంను అప్పటి కలెక్టర్ ఆదేశించారు. దీంతో అందుకు సంబంధించిన ఫైళ్లు సీజ్ చేశారు. దీనికి తోడు సార్వత్రిక ఎన్నికల సమయంలో విధులు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించారన్న కారణంగా ఏప్రిల్‌లో డీఎస్‌డీఓ శ్రీధర్‌రావును జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ చేశారు.
ఆయన స్థానంలో సెట్మా సీఈఓ సోమశేఖర్‌రెడ్డిని ఇన్‌చార్జిగా నియమించారు. శ్రీధర్‌రావు తమకు సమాచారం ఇచ్చి సెలవుపై వెళ్లినట్లు (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ) శాట్ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్‌కు లేఖ పంపడంతో మళ్లీ ఆయనను ఈ నెల 16న డీఎస్‌డీఓగావిధుల్లోకి తీసుకున్నారు, కానీ, మళ్లీ శ్రీధర్‌రావును శాట్‌కు సరేండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
పైకా క్రీడల నిధులపై విజిలెన్స్‌కు ఫిర్యాదు...
పైకా జాతీయ క్రీడల నిర్వహణకు వసూలు చేసిన నిధుల తాలూకు లెక్కలపై తెలంగాణ నవనిర్మాణ సేన రాష్ట్ర విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు సోమవారం విజిలెన్స్ అధికారులు దీనిపై విచారణ జరిపినట్లు సమాచారం. జిల్లా యంత్రాంగం నుంచి పూర్తిస్థాయిలో నివేదికను తెప్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.
నిలిచిపోయిన వేసవి శిబిరాలు
డీఎస్‌ఏ ఆధ్వర్యంలో మే 1 నుంచి నెల రోజులపాటు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 20 అంశాల్లో వేసవి శిబిరాలు నిర్వహించాలి. కానీ, గత ఏడాది నుంచి శి బిరాలను నిర్వహించడం లేదు. ఈసారి ఇప్పటివరకు ఆయా క్రీడా సంఘాలతో డీఎస్‌ఏ అధికారులు సమావేశం నిర్వహించలేదు. దీంతో వేసవి శిబిరాలు వెనక్కివెళ్లినట్లు పలువురు క్రీడాకారులు ఆరోపిస్తున్నారు.