కాలేజీల్లో ‘మధ్యాహ్నం’
డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: పేద విద్యార్థులకు పట్టెడన్నం పెట్టాలనే సంకల్పానికి జిల్లా యంత్రాంగం కార్యరూపం ఇచ్చింది. ఇప్పటికే పాఠశాల విద్యార్థులకే పరిమితమైన మధ్యాహ్న భోజనాన్ని డిగ్రీ విద్యార్థులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆకలి కడుపుతో కళాశాలలకు వస్తున్న విద్యార్థులకు అక్కడే ఆహారా న్ని వడ్డించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. శనివారం కూకట్‌పల్లి, మల్కాజిగిరి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, తాండూ రు, వికారాబాద్‌లోని డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది.
కటిక దారిధ్యం అనుభవిస్తున్న విద్యార్థులే సర్కారు కాలేజీల్లో చదువుతున్నారని భావించిన కలెక్టర్ రఘునందన్‌రావు డిగ్రీ తృతీయ ఏడాది విద్యార్థుల కడుపు నింపాలని నిర్ణయించారు. ఒక పూట భోజనం పెట్టడం ద్వారా చదువుపై శ్రద్ధ పెరిగి, ఉత్తీర్ణతాశాతం పెరుగుతుందని అంచనా వేశారు.
ఈ మేరకు నిర్వహించిన సర్వేలో కూడా ఈ విషయం స్పష్టం కావడంతో ప్రయోగాత్మకంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నభోజ నం వడ్డించాలనే ఆలోచనకు వచ్చారు. తన విచక్షణాధికారంతో ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించారు. వంట సామగ్రి, కూరగాయలు, ప్లేట్లను సమకూర్చుకోవడానికి నిధులు కేటాయించారు. ఈ క్రమంలోనే జిల్లావ్యాప్తంగా డిగ్రీ మూడో ఏడాది చదివే 1200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తెచ్చారు. దశలవారీగా ఈ పథకాన్ని ఇంటర్మీడియట్, డిగ్రీ ఒకటి, రెండో సంవత్సరం విద్యార్థులకు కూడా అమలు చేయాలని నిర్ణయించారు. చాలాచోట్ల డిగ్రీ, జూనియర్ కాలేజీలు ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్నాయి. దీంతో ఉదయం పూట అ ల్పాహారం తీసుకోకుండానే కళాశాలకు హాజరవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. అదేసమయంలో మధ్యాహ్న వేళల్లో నడిచే విద్యార్థులకు ఆహారం తీసుకున్న తర్వాతే క్లాసులు ప్రారంభం కానున్నాయి.
ఫ్యాకల్టీకి కూడా అక్కడే!
డిగ్రీ కాలేజీల్లోని ఫ్యాకల్టీ కూడా అక్కడే భోజనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చాలా కాలేజీల్లో అధ్యాపకుల కొరత వేధిస్తుండడం.. అరకొరగా బోధనలు సాగుతుం డడం కూడా సర్కారు కాలేజీల్లో విద్యాప్రమాణాలు తగ్గిపోవడానికి కారణమని అంచనాకొచ్చిన ఆయన.. మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిన కళాశాలల్లో వార్షిక పరీక్షల వరకు అదనంగా మూడు తరగుతులు బోధించాలని లెక్చరర్లకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థు లు కడుపునిండా తిని.. మెదడుకు పనిపెడితే ఉత్తీర్ణతాశాతం అదంతట అదే పెరుగుతుంద ని భావిస్తున్నారు. ఈ ప్రయోగం సఫలమైతే జూనియర్ కాలేజీల్లో చదివే 4,140 మంది విద్యార్థులకు కూడా మధ్యాహ్నభోజనం పెట్టేలా నిర్ణయం తీసుకోనున్నారు.