మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల అవస్థలు
సగం కూడా పూర్తికాని వంట షెడ్ల నిర్మాణం
మంజూరైనవి 1043...నిర్మాణం పూర్తయినవి 405
అసలు పనులు ప్రారంభించనవి 232 షెడ్లు
మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ నిమిత్తం సర్వశిక్ష అభియాన్ కింద 1043 వంటషెడ్లు మంజూరైనా అందులో సగం కూడా నిర్మాణం పూర్తి చేసుకోలేదు. దీంతో పథకం నిర్వాహక ఏజెన్సీ మహిళలు అవస్థలు పడుతున్నారు. ఎండైనా...వానైనా.. ఆరు బయటే వంటలు చేసి సమయానికి అందజేయాల్సిన బాధ్యతను మోయలేకపోతున్నారు.
కొవ్వూరు : సర్వశిక్షా అభియాన్ కింద జిల్లాకు 1043 వంటషెడ్లు మంజూరు కాగా వీటి నిర్మాణ బాధ్యతలను తొమ్మిది ప్రభుత్వ ఏజెన్సీలకు అప్పగించారు. ఒక్కో వంట షెడ్డుకి రూ.1.50 లక్షలు చొప్పున 2012-13 ఆర్థిక సంవత్సరంలో సర్వశిక్షాభియాన్ నుంచి జిల్లాకు రూ.15.64 కోట్లు మంజూరు చేశారు. వీటిలో మొదటి విడతగా జిల్లాకు రూ.9.62 కోట్లు విడుదల చేశారు. ఇంకా రూ.6.02 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. జిల్లాకు కేటాయించిన వంట షెడ్ల నిర్మాణ బాధ్యతలను గృహానిర్మాణ శాఖ, రాజీవ్ విద్యామిషన్ (ఆర్‌వీఎం), ఐటీడీఏ, భీమవరం, ఏలూరు, నరసాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మునిసిపాలిటీలకు అప్పగించారు. మంజూరైన వంట షెడ్లల్లో ఇప్పటి వరకు 405 షెడ్లు పూర్తిచేయగా 232 షెడ్లు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. 276 షెడ్లు రూఫ్‌లెవల్‌లోనూ, 38 లెంటల్ లెవెల్, 65 బేస్‌మెంట్ లెవెల్ ఉండగా, 27 షెడ్ల పనులు ఇటీవలే ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటివరకు రూ. 8 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. చాలా పాఠశాలల్లో మధ్యాహ్నా భోజనం పథకం నిర్వహణకు కనీసం నిలువ నీడ లేదు. దీంతో కొన్నిచోట్ల తాటాకు పాకల్లోను, మరికొన్నిచోట్ల సైకిల్ షెడ్లలో, ఆరుబయట, పాఠశాల అరుగులపైన వంటలు చేస్తూ మహిళలు నానా అవస్థలు పడుతున్నారు.
పురోగతి లేని వంటషెడ్ల నిర్మాణం
గృహనిర్మాణ శాఖకు 449 షెడ్ల నిర్మాణం కేటాయించారు. నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో పూర్తికాకపోవడంతో వీటిలో 125 షెడ్లను రాజీవ్ విద్యామిషన్‌కు అప్పగించారు. వీటిలో కేవలం 44 షెడ్లే పూర్తయ్యాయి. 67 షెడ్లు ప్రారంభానికి నోచుకోలేదు. ఐటీడీఏకు 33 కేటాయించగా 28 పూర్తిచేశారు. మరో 5 ప్రారంభం కాలేదు. ఆర్‌వీఎంకు 634 కేటాయించగా 324 షెడ్లు పూర్తిచేశారు. మరో 125 షెడ్లు ప్రారంభం కాలేదు. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. భీమవరం, పాలకొల్లు మునిసిపాలిటీలకు 12 వంట షెడ్లు చొప్పున కేటాయించగా రెండుచోట్ల ఏ ఒక్కటీ ప్రారంభించలేదు. ఏలూరు కార్పొరేషన్‌కు ఏడు కేటాయించగా ఆరు పూర్తి చేశారు. మరొకటి నిర్మించాల్సి ఉంది. నిడదవోలు పురపాలక సంఘానికి ఐదు కేటాయించగా నాలుగు షెడ్లు నేటికీ ప్రారంభించలేదు. తాడేపల్లిగూడెం మునిసిపాలిటీకి 11 కేటాయించగా అతి కష్టం మీద 3 పూర్తిచేశారు. ఒక షెడ్డు ఇప్పటికీ ప్రారంభించకపోగా మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. నరసాపురం మునిసిపాలిటీకి ఐదు కేటాయించగా ఒక షెడ్డు పనులు ప్రారంభించలేదు.
ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తాం
అసంపూర్తిగా ఉన్న వంటషెడ్లను ఈనె ల 15వ తేదీ నాటికి పూర్తి చేస్తాం. ఇప్పటికే దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. పనులు అప్పగించిన ఏజెన్సీలు నెలరోజులు గడువు అడుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వారంలో అన్ని షెడ్ల నిర్మాణం పూర్తి చేయిస్తాం.
డి.మధుసూదనరావు, జిల్లా విద్యాశాఖాధికారి
వెతల నడుమ కుతకుతలు
Published Sun, Aug 9 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM
Advertisement
Advertisement