♦ అమలుకాని ప్రభుత్వ ఆదేశాలు
♦ కొరవడిన అధికారుల పర్యవేక్షణ
♦ ఇబ్బందులు ఎదుర్కొంటున్న రేగోడ్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్స్‌ను తగ్గించి విద్యార్థు లకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం అభాసుపాలవుతోంది. సన్న బియ్యం సరఫరా మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ప్రభుత్వ ఆదేశాలు మచ్చుకైనా కానరావడం లేదు. పర్య వేక్షించాల్సిన అధికారులు పత్తా లేకపోవడంతో దొడ్డు బియ్యం.. పురుగుల అన్నం.. నీళ్లచారుతో విద్యార్థులు బక్కచిక్కిపోతున్నారు.
- రేగోడ్
సర్కారు బడుల్లో చదువుకునే పేద విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కానీ సన్నబియ్యం వంట మూన్నాళ్ల ముచ్చటగా మారింది. పాలకులకు.. అధికారులు పథకం ప్రారంభంలో చూపిన శ్రద్ధ ఇపుడు కనిపించడం లేదు. ఫలితంగా రేగోడ్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దొడ్డుబియ్యం.. పురుగుల అన్నం పెడుతున్న సంఘటన మంగళవారం వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదవతరగతి నుంచి పదోతరగతి వరకు 385 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
అయితే మంగళవారం అక్షయపాత్ర ద్వారా వచ్చిన వంటకాల ను వడ్డించారు. ఈ సమయంలో పాఠశాలను సందర్శించిన విలేకరులు విద్యార్థులకు పెట్టిన భోజనంలో పురుగులు ఉండడం, సన్నబియ్యం బదులు దొడ్డు బియ్యం ఉండడం కనిపించింది. అప్పటికే 300 మం దికి పైగా విద్యార్థులు, పలువురు ఉపాధ్యాయులు భోజనం చేశారు. మరికొంత మంది భోజనాన్ని బహిష్కరించి అరటిపళ్లతో సరిపెట్టుకున్నారు. విద్యార్థులకు బొడ్డుబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నా ఉపాధ్యాయులు అధికారుల దృష్టికి తీసుక వెళ్లకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆర్‌ఐ విచారణ
దొడ్డు బియ్యం.. పురుగుల అన్నం విషయం తెలుసుకున్న స్థానిక ఎంఆర్‌ఐ మర్రి ప్రదీప్, వీఆర్‌ఓ ఆదర్శ్ స్థానిక ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్షయపాత్ర ద్వారా విదార్థుల కోసం వండి తెచ్చిన అన్నాన్ని పరిశీలించారు. దొడ్డుబియ్యం.. అన్నంలో పురుగులు ఉండటాన్ని గమనించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు.
అన్నం తినలేదు
పురుగులు ఉన్నాయని అన్నం తినలేదు. అరటిపళ్లను తిని క్లాసుకు వెళ్లాను. రోజూ దొడ్డుబియ్యం అన్నం పెడుతున్నారు. సన్నబియ్యం అన్నమాటేగానీ కనిపించడం లేదు. కూరల్లో కూడా నాణ్యత ఉండడం లేదు.
- ప్రశాంత్, పదోతరగతి
పర్యవేక్షణ కరువైంది
సన్నబియ్యం పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. దొడ్డు బియ్యంతో విద్యార్థులకు భోజనం పెట్టడం దారుణం. కలెక్టర్ చొరవ చూపి ఈ ఘనటనపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- పూర్ణచందర్, నోబుల్‌యూత్ బాధ్యుడు
దొడ్డుబియ్యం.. పురుగుల అన్నం..
Published Wed, Jul 22 2015 1:48 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement