
రాజకీయ వేధింపులు ఆపాలి
విజయనగరం కంటోన్మెంట్ : మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులపై రాజకీయ వేధింపులు ఆపాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. జయలక్ష్మి, బి. సుధారాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తే, ఇప్పుడు ఆ పార్టీ నాయకులే వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నెండేళ్ల నుంచి మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో 5 వేల మంది నిర్వాహకులు పని చేస్తున్నారన్నారు. వీరికి గౌరవ వేతనం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారన్నారు.
బిల్లులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నెల్లిమర్ల రెల్లివీధి స్కూల్, గాజుల రేగ రాళ్లమాలపల్లి స్కూల్, గుర్ల మండలం తెట్టంగి, చీపురుపల్లి మండలం చిననడిపల్లి, పెదనడిపల్లి పాఠశాలల్లో నిర్వాహకులపై వేధింపులు ఎక్కువగా ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి డీఈఓ హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. ఎట్టకేలకు అధికారులు స్పందించి మంగళవారం చర్చలు జరుపుతామని చెప్పడంతో నిర్వాహకులు వెనుదిరిగారు. కార్యక్రమంలో ఉమామహేశ్వరి, జి తులసి, చల్లా జగన్, డి. అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.