నెట్‌వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించని ప్రభుత్వం
బుధవారం అర్ధరాత్రి వరకు సీఈవోతో కొనసాగిన చర్చలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పథకం ఊసే లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో పథకం నిర్వహణకు డబ్బులు లేవు.. కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్నే ప్రజలు వినియోగించుకోవాలంటూ టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉచిత సలహా ఇచ్చారు. మరోవైపు పథకం స్థానంలో బీమా ప్రవేశ పెట్టడానికి సిద్ధమైన బాబు సర్కార్.. నెట్‌వర్క్ ఆస్పత్రులకు బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తోంది. దీంతో ఆస్పత్రుల నిర్వహణ సాధ్యం కావడం లేదని, సిబ్బందికి జీతాల చెల్లింపు, మందులు, కన్జుమబుల్స్ కొనుగోలుకు కూడా డబ్బులు లేవని నెట్‌వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేశాయి.
గురువారం నుంచి పథకం సేవలను నిలిపి వేయడానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) సిద్ధమైంది. బకాయిలు చెల్లిస్తే గానీ సేవలు కొనసాగించలేమని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో లక్ష్మిషాకు బుధవారం అసోసియేషన్ ప్రతినిధులు తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల యాజమాన్య అసోసియేషన్ ప్రతినిధులతో సీఈవో అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ప్రస్తుతం రూ.200 కోట్లు విడుదల చేశామని, త్వరలో మరో రూ.300 కోట్లు ఇస్తామని సీఈవో వెల్లడించినట్టు తెలిసింది. ఇలా అరకొర నిధులతో ఆస్పత్రులను నడపలేమని వారు తేల్చి చెప్పినట్లు సమాచారం.
బకాయిలు రూ.2500 కోట్లు వెంటనే విడుదల చేయాలని లేదంటే ఆగస్టు 15 నుంచి సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి నెట్‌వర్క్ ఆస్పత్రులు గత నెల 30వ తేదీనే అల్టిమేటం ఇచ్చాయి. తొలుత ఈ నెల 10వ తేదీలోగా కొంత మొత్తం విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. రెండు వారాల తర్వాత బుధవారం రాత్రి కేవలం రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేసిన ప్రభుత్వం.. సేవలు కొనసాగించాలని కోరింది. ఈ మేరకు సీఈవో లక్షిషా ఆస్పత్రుల యాజమాన్యాలను కోరగా, వారు ససేమిరా అన్నట్లు సమాచారం. దీంతో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఈవో హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంతో కేవలం అత్యవసర కేసులు మాత్రమే చూసేందుకు యాజమాన్య అసోసియేషన్ ప్రతినిధులు సమ్మతించారు. మొత్తం బకాయిలు చెల్లించే వరకు పూర్తి స్థాయిలో సేవలు అందించలేమని స్పష్టం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన పథకానికి నిధులు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తుండటం పట్ల ఆస్పత్రుల యాజమానులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment