ఇదేం తీరు? | Negligence Of Authorities On Collecting Water Tax Dues | Sakshi
Sakshi News home page

ఇదేం తీరు?

Published Sun, Sep 8 2019 9:58 AM | Last Updated on Sun, Sep 8 2019 9:59 AM

Negligence Of Authorities On Collecting Water Tax Dues - Sakshi

పంట పొలాలకు వెళుతున్న తోటపల్లి ప్రాజెక్టు నీరు

సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సర్కారుపై ఆర్థిక భారం దండిగానే ఉంటోంది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాల్సిన అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ఖజానాపై పెనుభారం పడుతోంది. నీటి వనరుల మరమ్మతు... ఆధునికీకరణవంటి పనులకు ఆసరాగా  నిలుస్తుందని నిర్దేశించిన నీటితీరువా వసూలుపై అధికారులు నిర్లక్ష్యధోరణి చూపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో  రూ. 30కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. వాటిని వసూలు  చేస్తే కాస్తయినా ప్రభుత్వానికి  తోడ్పాటునందించినట్టే.

సాక్షి, విజయనగరం గంటస్తంభం: నీటి తీరువా బకాయిలు జిల్లాలో పేరుకుపోయాయి. కోట్లాది రూపాయలు రైతులు చెల్లించాల్సి ఉన్నా... వసూలు చేయడానికి అధికారులు చొరవ చూపడంలేదు. అంత మొత్తం ఒకేసారి వసూలు చేయకపోయినా రైతులకు ఇబ్బంది లేకుండా దశల వారీగానైనా వసూలు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వచ్చి తిరిగి నీటి వనరులు బాగు చేసేందుకు ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని మరచి అధికారులు వసూలుపై దృష్టిసారించపోవడం విశేషం.  సాగునీటి వనరుల నుంచి నీటిని పంటలకు వినియోగించుకునేందుకు రైతులు ఏటా నీటి తీరువా(పన్ను) చెల్లించాల్సి ఉంది. శాశ్వత సాగునీటి వనరులైన ప్రాజెక్టుల కింద ఏడాదికి ఎకరాకు రూ.200లు, సాధారణ సాగునీటి వనరులైన చెరువులు, కాలువ కింద ఎకరాకు రూ.100లు పన్నుగా చెల్లించాలి. ఖరీఫ్, రబీ ముగిసిన తర్వాత గ్రామ రెవెన్యూ అధికారులు ఈ పన్ను వసూలు చేస్తుంటారు.

పేరుకుపోయిన బాకాయిలు..
నీటి తీరువా వసూలుపై అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు. పంటలు పండని ఏడాది మానేసి పండిన ఏడాది తప్పక వసూలు చేయాల్సి ఉంది. జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో నాలుగు మండలాలు, రబీలో 25మండలాల్లో కరువు ఉండగా మిగతా మండలాల్లో పంటలు పండాయి. అంతకుముందు ఏడాది జిల్లాలో కాస్తా దిగుబడి తగ్గినా పంటలు మాత్రం బాగానే పండాయి. కానీ అధికారులు నీటితీరువా సకా లంలో వసూలుకు వెళ్లక బకాయిలు జిల్లాలో పేరుకుపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.30.74 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా అందులో రూ.28.10కోట్లు గతేడాది వరకు వసూలు కాని బకాయిలే. ఈ ఏడాది రూ.2.63కోట్లు టార్గెట్‌ ఇచ్చారు. పాత బకాయిలు ఎక్కువగా ఉండడంతో మొత్తం ఒకే ఏడాది వసూలు చేయాల్సి వస్తోంది.

వసూలు అంతంతమాత్రమే..
రైతుల నుంచి అంత మొత్తం వసూలు చేయడం కష్టమనే చెప్పాలి. ఇప్పటివరకు ఈ ఏడాదిలో కేవలం రూ.10.81 లక్షలు మాత్రమే వసూలైంది. కోట్లాది రూపాయిలు బకాయిలుండగా వసూలు నామమాత్రంగా ఉండటం ఆలో చించదగ్గ విషయం. జిల్లాలో గతంలో కూడా పెద్దగా వసూలు చేసిన సందర్భం లేదు. నోట్లు రద్దు చేసిన సంవత్స రం మాత్రం జిల్లాలో రూ. 1.80కోట్లు వసూలు జరిగింది. ఆ తర్వాతగానీ, ముందుగానీ రూ.కోటి దాటి లేదు. గతేడాది ఆ మాత్రం కూడా వసూలు కాలేదు. ఈ నేపథ్యంలో ఎంతగా ప్రయత్నించినా మరో రూ.2కోట్లు వరకు వసూలవుతుందని అధికారుల అంచనా.

వసూలుపై దృష్టిసారించని అధికారులు..
జిల్లాలో బకాయిలు రూ.కోట్లల్లో ఉన్నా వసూలు విషయం మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. వసూలు చేయాలంటే ముందుగా జమాబందీ జరిగి పన్ను నిర్ణయించాలి. తర్వాత వసూలుకు వీఆర్వోలు వెళ్లాలి. కానీ జమాబందీ ప్రక్రియ జిల్లాలో మొక్కుబడిగా జరుగుతోంది. 
ఇక వసూలు విషయమే అధికారులు మరిచిపోయా రు. గత ఆర్థిక సంవత్సరంలో నామమాత్రంగా వసూలు చేసిన అధికారులు ఈ ఏడాది పూర్తిగా దృష్టిసారించలేదు. కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడిచినా రూ.30కోట్లు లక్ష్యంలో కేవలం రూ.10.81లక్షలు వసూలు చేశారు. అంటే కేవలం 0.4 శాతం మాత్రమే. నీటి తీరువా వసూలు ఇంత ఘోరంగా ఉన్నా ఒక్క అధికారీ దీనిపై పట్టించుకోవడం లేదు. వాస్తవానికి నీటి తీరువా ద్వారా వచ్చిన ని ధులను ప్రభుత్వం తిరిగి సాగునీటి వనరుల అభివృద్ధికి వెచ్చిస్తుంది. దీని వల్ల రైతులకే లబ్ధి కలుగుతుంది. కానీ అధికారులు వసూలు చేయకపోవడం వల్ల ఈ భారం ప్రభుత్వంపై పడి నీటి వనరుల అధునికీకరణ, మరమ్మతులకు నిధులు వెచ్చించాల్సి వస్తోంది.

ఎన్నికల వల్ల ఆలస్యమైంది..
నీటి తీరువా వసూలు రెగ్యులర్‌గా జరుగుతుంది. ప్రతి ఏడాది వందశాతం రైతులు చెల్లించరు. అందువల్ల కొంత బకాయి ఉండడం సహజం. గతేడాది వరకు బకాయిలు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నవి. ఈ ఏడాది వసూలు తక్కువగానే ఉంది. ఎన్నికల నేపథ్యంలో మొదట్లో ఆలస్యమైంది. తర్వాత వీఆర్వోలు, ఇతర రెవెన్యూ అధికారులు ఇతర పనులపై బీజీగా ఉన్నారు. నీటితీరువా వసూలుపై దృష్టిపెట్టాం. సమావేశం ఏర్పాటు చేసి డ్రైవ్‌ తీసుకునేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 
– బి.శ్రీకాంత్, సెక్షన్‌ పర్యవేక్షకులు, కలెక్టరేట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement