ఢిల్లీ: ఫిరోజ్ షా కోట్లాగా ఉన్న ఢిల్లీ మైదానానికి కొత్తగా అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మార్చారు. అలాగే ఒక స్టాండ్‌కు విరాట్ కోహ్లి పెవిలియన్ అని పేరు పెట్టారు. ఈ రెండు కార్యక్రమాలు గురువారం నెహ్రూ స్టేడియంలోని వెయిట్‌లిఫ్టింగ్ హాల్‌లో జరిగాయి. గురువారం నాటి కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన అతిరథులు ఇటీవల మరణించిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీకి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫిరోజ్ షా కోట్లా స్టేడియాన్ని అరుణ్ జైట్లీ స్టేడియంగా మారుస్తున్నట్టుగా డీడీసీఏ ప్రకటించింది. దీంతో కోట్లా మైదానం ఇకమీదట అరుణ్ జైట్లీ స్టేడియంగా కీర్తి గడించనుంది. కాగా క్రికెట్‌లో విశిష్ట సేవలందించినందుకుగానూ ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలోని స్పెషల్ స్టాండ్‌కు విరాట్ కోహ్లిగా నామకరణం చేశారు.
ఈ కార్యక్రమంలో డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ మాట్లాడుతూ.. విరాట్.. తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా దేశం కోసం ఆట ఆడటానికి సిద్ధమయ్యాడని.. అంతటి ధైర్యశాలి, గొప్ప మనిషి క్రికెట్ ప్రపంచంలో మరొకరు లేరని చెప్తూ అరుణ్ జైట్లీ అతన్ని కీర్తించేవారని పేర్కొన్నారు. దీంతో ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న విరూష్కలు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అనుష్క ఉబికి వస్తున్న కన్నీరును దిగమింగుకుంటూ విరాట్ గొప్పతనానికి అతని చేతిపై ముద్దుల వర్షం కురిపించింది. కాసేపటి వరకు అనుష్క శర్మ సాధారణ స్థితికి రాలేకపోయింది. దీంతో విరాట్ తనని నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమకు దిగులు కూడా దరి చేరకుండా పోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. (చదవండి: విరుష్కల ఫోటో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment