న్యూఢిల్లీ: నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ఫ్లాట్లపై జీఎస్‌టీని 5 శాతానికి పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనపై జీఎస్‌టీ కౌన్సిల్ ఈ నెల 10న జరిగే భేటీలో నిర్ణయం తీసుకుంటుందని విశ్వసనీయంగా తెలిసింది. డిసెంబర్ 22న జరిగిన చివరి సమావేశంలో కౌన్సిల్ 23 రకాల వస్తు, సేవలపై పన్ను భారాన్ని తగ్గించటం తెలిసిందే. జీఎస్‌టీ కౌన్సిల్ 32వ భేటీ ఈ నెల 10న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరగనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. నివాసిత గృహాలపై పన్ను క్రమబద్ధీకరణను తదుపరి సమావేశంలో పరిశీలించనున్నట్టు జైట్లీ గతంలోనే చెప్పారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లు లేదా నిర్మాణం పూర్తయి వినియోగానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్స్‌పై.... వాటి నిర్మాణం పూర్తయినట్టు సర్టిఫికెట్ జారీ కాకపోతే 12 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. పూర్తయినట్టు సర్టిఫికెట్ తీసుకుంటే, కొనుగోలుదారులపై ప్రస్తుతం జీఎస్‌టీ లేదు.
అయితే, భవన నిర్మాణంలో భాగంగా వినియోగించిన ఉత్పత్తులపై బిల్డర్లు అప్పటికే పన్నులు చెల్లించి ఉంటారు కనుక ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటే వాస్తవ పన్ను 5–6 శాతం మధ్యే ఉంటుంది. అయితే, బిల్డర్లు ఈ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను వినియోగదారులకు బదిలీ చేయడం లేదు. దీంతో కొనుగోలు దారులపై అధిక పన్ను పడుతోంది. ఈ నేపథ్యంలో... బిల్డర్లు నమోదిత డీలర్ల నుంచి భవన నిర్మాణం కోసం 80% ఉత్పత్తులు కొనుగోలు చేసి ఉంటే, వాటిపై 5% జీఎస్‌టీనే విధించాలన్నది తాజా ప్రతిపాదనగా అధికార వర్గాలు తెలిపాయి.
చిన్న వ్యాపారులకు ఊరట లభించేనా?
ప్రస్తుతం జీఎస్టీ జీఎస్‌టీ విధానం కింద వార్షికంగా రూ.20 లక్షల టర్నోవర్ కలిగిన వ్యాపారులకు పన్ను మినహాయింపు ఉంది. దీన్ని రూ.75 లక్షలకు పెం చాలన్న ప్రతిపాదనపైనా జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. విపత్తు సెస్సుతోపాటు చిన్న సరఫరాదారులకు కాంపోజిషన్ స్కీమ్‌ను కౌన్సిల్ పరిశీలించనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే లాటరీలపై 12% జీఎస్‌టీ, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుతో నడిచే లాటరీలపై 28% జీఎస్‌టీ అమలవుతోంది. వీటిని యథావిధిగా కొనసాగించడం లేదా మార్చడం చేయవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment