సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధిస్తుందని వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ బీజేపీలో నూతనోత్తేజం నింపాయి. కుటుంబం నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి గాంధీ, నెహ్రూ కుటుంబ కార్డు ఎంతోకాలం పనిచేయదని తేటతెల్లమైందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి ఆ కుటుంబం లేకపోతే వారి సభలకు జనాలు కరువవుతారని, ఆ కుటుంబాన్ని ముందు నిలిపితే మాత్రం ఓట్లు రావని జైట్లీ ఎద్దేవా చేశారు. ఎగ్జిట్ పోల్స్ ప్రజల ఆలోచనాసరళికి అద్దం పడతాయని, మే 23న వెల్లడయ్యే ఫలితాలు ఇదేవిధంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
2014లో వెల్లడైన ఫలితాలే 2019లోనూ పునరావృతం కానున్నాయని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. హంగ్ పార్లమెంట్ వచ్చే అవకాశం లేదని, ప్రజలు విస్పష్ట తీర్పు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. అనైతిక కూటములతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నది వారికి తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రజలు సామర్ధ్యం చూసి ఓటేస్తారని, కుటుంబ పేర్లను చూసి కాదని అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార సరళిని సమర్ధిస్తూ జైట్లీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment