మోదీ భారీ విజయానికి ఐదు కారణాలు! | Five Reasons For Vote to Narendra Modi | Sakshi
Sakshi News home page

మోదీ భారీ విజయానికి ఐదు కారణాలు!

Published Tue, May 21 2019 5:59 PM | Last Updated on Tue, May 21 2019 6:19 PM

Five Reasons For Vote to  Narendra Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ అనుకూల పవనాలు వీచినప్పుడు బీజేపీకి 282 లోక్‌సభ సీట్లురాగా, ఈసారి అనుకూల పవనాలు లేనప్పటికీ, పలు రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేకత ఉన్నప్పటికీ వచ్చే సీట్లు 287 దాటుతాయని అన్ని సర్వేలు సూచించడానికి కారణాలు ఏమిటీ ? అన్న ప్రశ్నకు అందుకు ఐదు సమాధానాలు ఉన్నాయని సామాజిక, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

1. నరేంద్ర మోదీకున్న వ్యక్తిగత ప్రతిష్ట. నేడు నరేంద్ర మోదీ పేరు తెలియని వారు దేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. టీవీల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు పరిచయం. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికి ఓటేస్తారని ఎన్నికల ముందు ప్రశ్నించగా, మోదీకని సమాధానం ఇచ్చారట. ఏ పార్టీకి ఓటేస్తారంటే మోదీ పార్టీకి అని సమాధానం ఇచ్చారట. అంటే పార్టీకన్నా ఆయనకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. అందుకనే ఈసారి కూడా బీజేపీ మోదీ కేంద్రంగానే ఎన్నికల ప్రచారాన్ని సాగించింది.
 ఆయన పట్ల ప్రజలు ఆకర్షితులవడానికి ప్రధాన కారణం ఆయన మాటలే. ప్రసంగంలో ఆయన నొక్కి నొక్కి చెప్పే మాటలు ముక్కుసూటిగా మాట్లాడుతున్నట్లు ఉంటాయట. ఆయన చెప్పే మాట నోటి నుంచి కాకుండా హదయం నుంచి వచ్చినట్లు ఉంటుందట. దేశం కోసం, దేశ ప్రజల కోసం ఎంతటి కఠినమైన నిర్ణయమైన తీసుకునే మనస్తత్వం కూడా ఆయన పట్ల ప్రజాదరణ పెంచిందట. పెద్ద నోట్ల రద్దే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలకు నష్టమే జరిగినప్పటికీ దేశం కోసం నిర్ణయం తీసుకున్నందున దాన్ని పట్టించుకోవడం లేదట. మరో అవకాశం ఇచ్చి చూద్దాం అంటున్నారట.

2. పాకిస్థాన్‌పై భారత వైమానిక దాడులు: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు పాకిస్థాన్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయి బాలకోట్‌లోని ఉగ్రవాదుల స్థావరాన్ని ధ్వంసం చేయడం మోదీకి ఓటు వేయడానికి రెండో కారణం అట. కాంగ్రెస్‌ పార్టీకి కూడా అలాంటి దాడులు ఇంతకుముందు జరిపిందనే విషయాన్ని ప్రజల దష్టికి తీసుకెళ్లినప్పుడు ‘కాంగ్రెస్‌ వారు ఆ విషయాన్ని అప్పుడే ప్రకటించి ఉండాల్సింది. అయినా వారు చిన్న చిన్న దాడులు జరిపి ఉంటారు. మోదీ తరహాలో ‘గుస్‌ గుస్‌ కే మారా’ జరిపి ఉండరు’ అని వారన్నారట. మోదీ నోటి నుంచి వచ్చిందంటే అది నూటికి నూరుపాళ్లు నిజమై ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారట.

3. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు పక్కా ఇళ్లు నిర్మించడం, స్వచ్ఛ భారత్‌ స్కీమ్‌ కింద వెనకబడిన రాష్ట్రాల్లో మరుగుదొడ్లు నిర్మించడం, ఉజ్వల యోజన కింద పేద మహిళలకు వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వడం వల్ల కూడా మోదీ ప్రతిష్టను గణనీయంగా పెంచాయట.

4. మెజారిటీ జాతీయ వాదం. దేశంలోని ముస్లింలకు వ్యతిరేకంగా జాతీయవాదం పేరిట హిందువులు ఒక్కటయ్యారట. బీజేపీయే కాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హిందూత్వను ప్రచారం చేయడం, ఆయన దేశంలోని హిందూ పుణ్య క్షేత్రాలు తిరిగి రావడం హిందువులను ఎంతో ఆకర్షించిందట.

5. సరైన ప్రత్యామయ నాయకుడు లేకపోవడం. ప్రతిపక్షంలో మోదీకి సరితూగే ప్రత్యామ్నాయ నాయకుడు కనిపించక పోవడం. మోదీ ముందు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇంకా చిన్న కుమారిడిగానే కనిపించారట. పైగా ఆయన ప్రచారంలోగానీ ఆయన ఆలోచనల్లోగానీ కొత్తదనమేదీ కనిపించలేదట. అదే బీహార్‌లోని బేగుసరాయ్‌ నుంచి సీబీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కన్హయ్య కుమార్‌ తాను ‘నేత నహీ బేటా’ అంటూ ప్రచారం చేయడం ప్రజలకు ఎక్కువ నచ్చినదట. అలాంటి ఆకర్షణీయమైన ప్రచారం రాహుల్‌ గాంధీ చేయక పోవడమూ ఆ పార్టీ ఓటమికి ఓ కారణమే అని సామాజిక, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఐదు కారణాల వల్ల గతంకంటే బీజేపీకి ఈసారి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందన్నది వారి వాదన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement