
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం కన్నుమూయడంతో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్. కే లక్ష్మణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీకి, దేశానికి, న్యాయ వ్యవస్థకు అరుణ్ జైట్లీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తి ఉద్యమంలో జైట్లీ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. అంతేకాక తెలంగాణ ఉద్యమంలో పార్టీ, ప్రజల తరపున ప్రతిపక్ష నాయకుడిగా తన గళాన్ని గట్టిగా వినిపించారని, రాజ్యసభలో తెలంగాణ విభజన బిల్లు పాస్ అయ్యేందుకు కృషి చేశారన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు పలు విలువైన సూచనలు, సలహాలు జైట్లీ ఇచ్చారని లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ మృతి పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న జైట్లీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.