బీజేపీ చీఫ్ అమిత్ షాతో గంభీర్ కరచాలనం
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (37) రాజకీయాల్లోకి ప్రవేశించారు. శుక్రవారం కేంద్ర మంత్రులు జైట్లీ, రవిశంకర్‌ల సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ నాయకత్వం నచ్చి బీజేపీలో చేరుతున్నానని, పార్టీ సభ్యుడిగా దేశ సంక్షేమం కోసం కృషి చేస్తానని గంభీర్ తెలిపారు. దేశానికి మంచి చేయడానికి, పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఇది మంచి వేదిక అని వెల్లడించారు. అనంతరం గంభీర్ బీజేపీ పార్టీ అధినేత అమిత్ షాను కలుసుకున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన గంభీర్ బీజేపీలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరనుందని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీ కేడర్ విస్తరించిందని, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిని పార్టీలో చేర్చుకున్నామని తెలిపారు. గంభీర్, 2011 ప్రపంచ కప్, 2007 టీ–20 ప్రపంచ కప్‌లను భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు.
బిహార్‌లో మహాకూటమి సీట్ల ఖరారు
పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికలకుగాను బిహార్‌లో మహాకూటమి సీట్ల పంపిణీ ఖరారైంది. ఇందులోభాగంగా లోక్‌తాంత్రిక్ జనతాదళ్ (ఎల్‌జేడీ) అధ్యక్షుడు శరద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) గుర్తుపై పోటీ చేయనున్నారు. బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు గాను 20 చోట్ల లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్‌జేడీ, 9 స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను పోటీకి ఉంచనున్నాయి. మహా కూటమిలోకి కొత్తగా వచ్చి చేరిన ఉపేంద్ర కుష్వాహాకు చెందిన లోక్ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్‌పీ) 5, ముకేశ్ సాహ్నికి చెందిన వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) 3 స్థానాల్లో పోటీ చేస్తాయి.
మాజీ సీఎం జితేన్ రామ్ మాంఝికి చెందిన హిందుస్తా ఆవాల్ మోర్చా(హెచ్‌ఏఎం) మూడు చోట్ల నుంచి బరిలోకి దిగనుంది. ఆర్జేడీ తనకు దక్కిన 20 చోట్లలో ఒక సీటును సీపీఐ(ఎంఎల్)లిబరేషన్‌కు ఇచ్చేందుకు అంగీకరించింది. అదేవిధంగా, 11 సీట్లు ఇవ్వాలంటూ మొదట్నుంచీ పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ కూడా రాజ్యసభ సీటు ఇచ్చే ఒప్పందంపై 9 స్థానాలకు దిగివచ్చింది. ఆర్‌ఎల్‌ఎస్‌పీకి మహాకూటమిలో చేరడంతో 5 సీట్లు దక్కాయి.
బీఎస్‌పీ తొలి జాబితా
లక్నో: బీఎస్పీ 11 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో జేడీఎస్ మాజీ నేత డేనిష్ అలీ పేరు ఉంది. జేడీఎస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అలీ గత వారమే బీఎస్‌పీలో చేరారు. రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లకుగాను ఎస్‌పీ– బీఎస్‌పీ– ఆర్‌ఎల్‌డీ కూటమిలో బీఎస్‌పీ 38 చోట్ల, ఎస్‌పీ 37, ఆర్‌ఎల్‌డీ 3 చోట్ల తమ అభ్యర్థులను పోటీకి ఉంచనున్నాయి.
శుక్రవారం బెంగళూరు సెంట్రల్ ఎంపీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కుటుంబంతో వచ్చి నామినేషన్ వేస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్
మధురై నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వస్తున్న ట్రాన్‌జెండర్ భారతి కన్నమ్మ
Comments
Please login to add a commentAdd a comment