join in BJP
-
బీజేపీలో చేరిన చంపయ్ సోరెన్
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్(67) బీజేపీలో చేరారు. జేఎంఎం ప్రస్తుత పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు పార్టీలో తనను అవమానించారని ఆరోపిస్తూ రెండు రోజుల క్రితం ఆయన ఆ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం రాంచీలోలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చంపయ్ సోరెన్‌కు కండువా కప్పి, బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంపయ్ సోరెన్‌ను ‘టైగర్ జిందా హై’అంటూ చౌహాన్ అభివర్ణించారు. జార్ఖండ్ ఉద్యమంలో కొల్హన్ ప్రాంతంలో కీలకంగా ఉన్న చంపయ్‌ను అక్కడి వారు ‘కొల్హన్ టైగర్’గా పిలుచుకుంటారు. చంపయ్ మాట్లాడుతూ..ఢిల్లీ, కోల్‌కతాలలో ఉన్న సమయంలో తనపై హేమంత్ సోరెన్ ప్రభుత్వం నిఘా పెట్టిందని, దీన్ని జీర్ణించుకోలేకే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరాల్సి వచ్చిందన్నారు. -
Lok sabha elections 2024: బీజేపీలో చేరిన రోహన్ గుప్తా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి రోహన్ గుప్తా బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఐఏఎస్ మాజీ అధికారి పరంపల్ కౌర్, ఆమె భర్త, శిరోమణి అకాలీదళ్ సీనియర్ నేత సికందర్ బీజేపీలో చేరారు. జాతీయవాదం, సనాతన ధర్మం వంటి అంశాలపై సంప్రదాయ వైఖరి నుంచి వైదొలిగిన కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను కోల్పోయిందని గుప్తా పేర్కొన్నారు. -
బీజేపీపైనా చర్యలు తీసుకోండి
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ ఆరోపణలపై బీజేపీ నేతలపైనా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మంత్రి అతిశి శనివారం ఎన్నికల కమిషన్(ఈసీ)ని డిమాండ్ చేశారు. బీజేపీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోందని శనివారం ఆమె మీడియా సమావేశంలో ఆరోపించారు. బీజేపీలో చేరడమో, ఈడీ అరెస్ట్‌ను ఎదుర్కోవడమో తేల్చుకోవాలంటూ ఆ పార్టీ నేత ఒకరు తనను బెదిరించారంటూ అతిశి చేసిన ఆరోపణలపై ఈసీ ఆమెకు శుక్రవారం నోటీసులిచి్చన విషయం తెలిసిందే. ‘మద్యం కుంభకోణంలో డబ్బు చేతులు మారిందనేందుకు ఎలాంటి ఆధారాలు దొరకనప్పటికీ కేవలం అనుమానంతోనే ఆప్ నేతలు సంజయ్ సింగ్, మనీశ్ సిసోడియా, సీఎం కేజ్రీవాల్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో నిందితుడొకరు బీజేపీకి కోట్లాది రూపాయలను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందజేసినట్లు ఆధారాలున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు’అని ఆమె ప్రశ్నించారు. -
Lok Sabha elections 2024: బీజేపీలో చేరిన గంగోపాధ్యాయ్
కోల్‌కతా: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ గురువారం కాషాయ కండువా కప్పుకున్నారు. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యాలయం వద్ద గంగోపాధ్యాయ్‌కు ఘన స్వాగతం లభించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆయనకు బీజేపీ జెండా అందజేశారు. రాష్ట్రంలో టీఎంసీ పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని అభిజిత్ ఈ సందర్భంగా అన్నారు. -
బిహార్‌లో ఆగని ఫిరాయింపుల పర్వం
పట్నా: బిహార్‌లోని మహాఘఠ్బంధన్ కూటమిలో ఫిరాయింపుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆర్జేడీకి చెందిన మరో ఎమ్మెల్యే భరత్ బిండ్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన శుక్రవారం ఎన్డీఏ పక్షంలోకి మారారు. కాంగ్రెస్‌కు చెందిన మహిళా ఎమ్మెల్యే నీతూ కుమారి పార్టీ లోక్‌సభ టిక్కెట్ ఇస్తే సరేసరి లేకుంటే బీజేపీలో చేరడం ఖాయమని ప్రకటించారు. ఇప్పటికే ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవధ్ బిహారీ చౌధరిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా అదే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటేయడం, నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం తెలిసిందే. తాజా పరిణామాలతో 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఎన్డీఏ బలం 135కు చేరుకుంది. -
బీజేపీ గూటికి మనీశ్ తివారీ?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ బీజేపీ కండువా కప్పుకుంటారని, ఆ పార్టీ తరఫున పంజాబ్‌లోని లూధియానా లోక్‌సభ స్థానం బరిలో దిగుతారని ఆదివారం వార్తలొచ్చాయి. అయితే ఇవన్నీ పుకార్లంటూ తివారీ కార్యాలయం ఖండించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుౖడు కమల్‌నాథ్ తన కుమారుడు, ఎంపీ నకుల్‌తో పాటు బీజేపీ గూటికి చేరనున్నారంటూ కూడా వార్తలొస్తుండటం తెలిసిందే. ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై ప్రశ్నించగా ‘ఏమైనా ఉంటే మీకే మొదట చెబుతా’నంటూ దాటవేశారు! -
బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్
కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పార్టీకి గుడ్ బై.. గుడ్ లక్ అంటూ కామెంట్స్ చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాకర్ మరో ట్విస్ట్ ఇచ్చారు. జాకర్.. గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జాకర్.. బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సునీల్ జాకర్ మాట్లాడుతూ.. పంజాబ్‌లో కొంతమంది కాంగ్రెస్ నేతలు తనపై అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించారని అన్నారు. అందుకు గానూ తనపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చర్యలు తీసుకున్నందుకు చాలా బాధపడ్డానని చెప్పారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంచి వ్యక్తి అంటూ జాకర్ ప్రశంసించారు. భజనపరుల్ని దూరం పెట్టి శత్రువులెవరో, మిత్రులెవరో ఆయన తెలుసుకోవాలని హితవు పలికారు. అంతుకు ముందు జాకర్.. ‘‘నా గుండె బద్దలైంది. అందుకే పార్టీలో 50 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నాను. కాంగ్రెస్‌కు నేను చెప్పే ఆఖరి మాటలివే. గుడ్ లక్. అండ్ గుడ్‌బై కాంగ్రెస్’’ అని శనివారం ఫేస్బుక్ లైవ్‌లో ప్రకటించారు. చింతన్ శిబిర్కు బదులు కాంగ్రెస్ ‘చింతా’ శిబిర్ నిర్వహించాలన్నారు. కొందరు ఢిల్లీలో కూర్చొని పంజాబ్‌ను నాశనం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత అంబికా సోనిపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా.. బుధవారం గుజరాత్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ హార్ధిక్ పటేల్ కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన కూడా పార్టీ నేతల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్‌కు ఊహించని షాక్ -
బీజేపీలో చేరిన యూపీ కాంగ్రెస్ పోస్టర్‌గాళ్
లక్నో: డాక్టర్ ప్రియాంక మౌర్య... యూపీలో ప్రియాంకా గాంధీ వాద్రా రూపొందించిన ‘నేను అమ్మాయిని... పోరాడగలను’ నినాదపు గొంతుక. యూపీలో మహిళా సాధికారతకు ముఖచిత్రం. ప్రియాంకా గాంధీకి కుడిభుజంగా మెలిగిన ఆమె... గురువారం బీజేపీలో చేరారు. ఎన్నికల నేపథ్యంలో యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ. ప్రియాంక మౌర్య... హోమియోపతి డాక్టర్. సామాజిక ఉద్యమకారిణి. అజాంగఢ్‌లో పుట్టి పెరిగారు. గ్వాలియర్ యూనివర్సిటీలో ఉన్నతవిద్యనభ్యసించారు. 2008లో స్పైస్‌జెట్‌లో చేరి ఎగ్జిక్యూటివ్‌గా రెండేళ్లపాటు పనిచేశారు. 2012లో తిరిగి డాక్టర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అది మొదలు... ‘నేకీ కి దివార్’, ‘రోటీ బ్యాంక్’ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. కరోనా పాండమిక్ సమయంలోనూ సేవకుగాను పలు అవార్డులు సైతం అందుకున్నారు. 2020 డిసెంబర్లో ఆమె కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఆ తరువాత 2021 నవంబర్‌లో పార్టీ ఆమెను మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. ప్రియాంక మౌర్య... మంచి వక్త. తన మాటలతో యువతను ఇట్టే ఆకట్టుకునే గుణం. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. లక్షల మంది అభిమానులున్నారు. ఐదు కోట్ల మంది మహిళా ఓటర్లున్న యూపీ రాజకీయాల్లో వారి పాత్ర కీలకం. దాంతో ప్రియాంక గాంధీ... . 2021 డిసెంబర్ 8న మహిళా మేనిఫెస్టో ‘శక్తి విధాన్’ను విడుదల చేశారు. మహిళా సాధికారతకు గుర్తుగా ‘మై లడకీ హూ... లడ్ సక్తీ హూ’ స్లోగన్‌కు ప్రియాంక మౌర్యను ప్రచారకర్తగా ఎంచుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తూనే... లక్నోలోని సరోజిని నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రియాంకమౌర్య సీట్ ఆశించారు. అందుకనుగుణంగానే తన కార్యకలాపాలను విస్తరించారు. తీరా సీట్ల కేటాయింపుల్లో కాంగ్రెస్‌పార్టీ ప్రియాంకను పక్కన పెట్టింది. ఆమె పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ సీటును రుద్రదామన్ సింగ్‌కు కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ప్రియాంక బీజేపీలో చేరారు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ ‘‘నా నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందనుకున్నాను. కానీ కాంగ్రెస్‌పార్టీ మోసం చేసింది. వాళ్లు ముందే అనుకున్నట్టుగా మరో వ్యక్తికి సీటిచ్చారు. మహిళలు, మౌర్య, కుష్వాహ, శాక్య, సైనీ కులాల ఓట్లను రాబట్టుకోవడానికి నన్ను వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంకోసం నన్ను, సోషల్‌మీడియాలో నాకున్న లక్షల మంది అభిమానులను ఉపయోగించుకున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందినదాన్ని, లంచం ఇవ్వలేను కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ. ‘లడకీ హూ... లడ్ సక్తీ హూ’ అనే నినాదమిచ్చారు. నినాదాలు, మాటలతోనే పనవ్వదు. అవకాశాలు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోరాడటానికి నాకు అవకాశమే ఇవ్వలేదు. ప్రియాంకగాంధీతో సైతం నేను పోరాడగలను అని ఇప్పుడు నిరూపించుకుంటాను. శక్తి, సమయం వెచ్చించి నేను పనిచేసిన ఆ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టే బీజేపీలో చేరాను. నేను హోమియోపతి డాక్టర్‌ను... తీయటి మందులివ్వడమే కాదు.. తీయగా మాట్లాడటమూ వచ్చు. ఇప్పుడా పని బీజేపీ కోసం చేస్తాను. నిత్యం సమాజ సేవలోనే ఉంటా.’’ -
బీజేపీలోకి జితిన్ ప్రసాద
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యూపీ కాంగ్రెస్‌లో కీలక నాయకుడు, రాహుల్ గాంధీకి సన్నిహితుడైన జితిన్ ప్రసాద కమలదళంలో చేరిపోయారు. బుధవారం ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ జితిన్ ప్రసాదకు పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను వారి నివాసాల్లో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. జాతీయ పార్టీ అంటూ దేశంలో ఏదైనా పార్టీ ఉంటే అది కేవలం బీజేపీ ఒక్కటేనని, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ మాత్రమే దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న పార్టీ అని జితిన్ ప్రసాద వ్యాఖ్యానించారు. నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాషాయ కండువా కప్పుకున్న తరువాత జితిన్ ప్రసాద మీడియాతో మాట్లాడుతూ ‘బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర నాయకులందరికీ కృతజ్ఞతలు. ఈ రోజు నా రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మూడు తరాలుగా కాంగ్రెస్‌తో మా అనుబంధం కొనసాగుతోంది. ఈ ముఖ్యమైన నిర్ణయం కూలంకషంగా చర్చించిన తర్వాత తీసుకున్నా. నేను ఏ పార్టీని వీడుతున్నానన్నది ప్రశ్న కాదు. నేను ఏ పార్టీకి వెళుతున్నాను, ఎందుకు వెళ్తున్నాననేది అసలు ప్రశ్న. ఈ రోజు దేశంలో నిజమైన రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీయే అని కొన్నేళ్లుగా అందరూ భావించే పరిస్థితి ఏర్పడింది’ అని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో కీలకనేత యూపీ రాజకీయాల్లో, రాహుల్ కోటరీలో కీలకనేత జితిన్ ప్రసాద. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. కానీ అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్‌పైనే పోటీ చేసి ఓడిపోయారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రిగా పనిచేసిన ఆయన పార్టీ బాధ్యతల్లోనూ కీలకంగా పనిచేశారు. అయితే యూపీ ఇన్చార్జ్గా ప్రియాంక గాంధీ వచ్చిన తరువాత జితిన్ ప్రసాదను పక్కన పెట్టారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. జ్యోతిరాదిత్య సిందియా తర్వాత కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరిన రాహుల్ సన్నిహితుల్లో రెండో నాయకుడు జితిన్. పశ్చిమ యూపీలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జితిన్ ప్రసాద రాకతో ఆ ప్రాంతంలో బీజేపీ బలం పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
బీజేపీలోకి ‘రాముడు’
న్యూఢిల్లీ: రామాయణం సీరియల్లో రాముడి పాత్రధారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు అరుణ్ గోవిల్(63) గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ జనరల్ సెక్రటరీ దేవశ్రీ చౌదరి సమక్షంలో అరుణ్ గోవిల్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైశ్రీరామ్ అనేది రాజకీయ నినాదం కాదన్నారు. భారతీయులకు అదొక జీవన విధానమని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలను జైశ్రీరామ్ నినాదం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. -
Mithun Chakraborty: బీజేపీలోకి మిథున్ చక్రవర్తి
కోల్‌కతా: బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆదివారం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గీయా, పార్టీ బెంగాల్ శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం పని చేయాలని తాను కోరుకుంటున్నట్లు మిథున్ చక్రవర్తి చెప్పారు. తన ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు బీజేపీ ఒక వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. బెంగాలీని అని చెప్పుకోవడం తనకెంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు తాను నటించిన బెంగాలీ సినిమాలోని ఒక డైలాగ్ చెప్పి అలరించారు. అమీ జోల్దోరవో నోయి, బెలె బొరావో నోయి.. అమీ ఏక్తా కోబ్రా, ఏక్ చోబోల్–యి చోబి (నేను హాని చేయని పామును అనుకొని పొరపాటు పడొద్దు. నేను నాగుపామును. ఒక్క కాటుతో చంపేస్తా జాగ్రత్త) అనే డైలాగ్ చెప్పారు. తాను గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశానని మిథున్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని తెలిపారు. బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారన్నది పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందన్నారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. ఈరోజు బంగ్లార్ చెలే(బెంగాలీ బిడ్డ) మిథున్ చక్రవర్తి మనతో ఉన్నారని చెప్పారు. ఆయన జీవితం, సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మిథున్ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో గతంలో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన 2014లో టీఎంసీ తరపున రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలతో 2016లో రాజీనామా చేశారు. శారదా కుంభకోణంలో మిథున్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆయన అవకాశవాది అని టీఎంసీ, కమ్యూనిస్టు పార్టీలు విమర్శించాయి. -
బీజేపీ గూటికి చేరిన దినేశ్ త్రివేది
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రానికి చెందిన మరో కీలక నాయకుడు బీజేపీలో చేరారు. తృణమూల్ మాజీ ఎంపీ, పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడైన దినేశ్ త్రివేది శనివారం బీజేపీలో చేరారు. మమత ప్రభుత్వంలో అవినీతి, హింస రాజ్యమేలుతున్నాయని ఆరోపించిన దినేశ్ అందుకే తాను పార్టీ వీడినట్టుగా చెప్పారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వారం రోజుల్లోనే ఆయన బీజేపీ గూటికి చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ తదితరుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా త్రివేదిపై నడ్డా ప్రశంసల వర్షం కురిపించారు. ఇన్నాళ్లూ రాంగ్ పార్టీలో రైట్ మ్యాన్ ఉన్నారని, ఇప్పుడు రైట్ పార్టీలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. అనంతరం దినేశ్ త్రివేది విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడే అసలైన మార్పు చూస్తారని అన్నారు. జీవితంలో ఇలాంటి బంగారు క్షణాల కోసమే తాను ఎదురు చూశానని వ్యాఖ్యానించారు. కొన్ని పార్టీల్లో కుటుంబమే సుప్రీంగా ఉంటుందని, కానీ బీజేపీలో ప్రజలే సుప్రీం అని కితాబునిచ్చారు. ఆట మొదలైంది అన్న తృణమూల్ కాంగ్రెస్ నినాదాన్ని ఎద్దేవా చేసిన త్రివేది రాజకీయాలంటే సీరియస్‌గా పని చేయాలని, కానీ మమత రాజకీయాన్ని ఆటని చేశారని ధ్వజమెత్తారు. మరోవైపు దినేశ్ త్రివేది పార్టీ మారడాన్ని తృణమూల్ తప్పు పట్టింది. ఎన్నికల వేళ పార్టీని వెన్ను పోటు పొడిచారంది ఒకప్పుడు దీదీకి కుడి భుజం దినేశ్ త్రివేది తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించారు. ఆ తర్వాత జనతాదళ్‌లో చేరారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్‌లో 20 ఏళ్ల పాటు ఉన్నారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత కాలంలో విభేదాలు తలెత్తడంతో మమత ఆయనని కేబినెట్ నుంచి తొలగించారు. మళ్లీ 2019లో ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. ఆయనని రాజ్యసభకు పంపింది. ఇలా ఉండగా, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలు, నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన సొనాలి గుహ కూడా బీజేపీలో చేరనున్నట్టుగా సూచనప్రాయంగా వెల్లడించారు. -
బీజేపీలోకి కుష్బూ
సాక్షి, చెన్నై/ న్యూఢిల్లీ: సినీ నటి కుష్బూ సుందర్ సోమవారం బీజేపీలో చేరారు. పార్టీ ప్రతినిధిగా ఉన్న కుష్బూను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించిన కొద్దిసేపటికే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కుష్బూ వెల్లడించారు. తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ సోనియాకు పంపించారు. పార్టీలోని కొందరు తనను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం బీజేపీ ప్రధాన కార్యదర్శి రవి, పార్టీ తమిళనాడు అధ్యక్షుడు మురుగన్ నేతృత్వంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. తనకు బీజేపీ నాయకత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేపట్టేందుకు సిద్ధమని కుష్బూ అన్నారు. కుష్బూతోపాటు జర్నలిస్ట్ మదన్ రవిచంద్రన్, ఐఆర్ఎస్ మాజీ అధికారి శరవణన్ కుమరన్ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఏడాదిలోనే తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కుష్బూ వంటి వారి చేరికతో కాషాయ దళానికి కలిసి వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. కుష్బూ 2014లో డీఎంకే నుంచి కాంగ్రెస్‌లో చేరారు. -
కాషాయ ‘కుటుంబం’లోకి సింధియా
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి బుధవారం కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, గ్వాలియర్ రాజవంశ వారసుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలో బీజేపీలో చేరారు. వెంటనే ఆయనను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దాంతో, ఆయన మరోమారు కేంద్ర మంత్రి పదవి చేపట్టే దిశగా తొలి అడుగు పడినట్లైంది. సింధియా అనుయాయులైన 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో పతనం అంచుల్లో ఊగిసలాడుతున్న మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం.. రాజీనామాలు చేయగా మిగిలిన తమ ఎమ్మెల్యేలను రాజస్తాన్‌లోని జైపూర్‌కు తరలించింది. బీజేపీ ముందుజాగ్రత్త చర్యగా తమ ఎమ్మెల్యేలను గురుగ్రామ్‌లోని ఒక హోటల్లో ఉంచింది. తమ రాజీనామాలను ఒక బీజేపీ సీనియర్ నేత ద్వారా మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌కు పంపించిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు శిబిరంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ సభ్యులు ఉన్న రాజస్తాన్(జైపూర్)లో కాంగ్రెస్.. బీజేపీ ఎమ్మెల్యేలున్న హరియాణా(గురుగ్రామ్)లో, కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలున్న కర్నాటక(బెంగళూరు)లో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 230 కాగా, ప్రస్తుతం 228 మంది సభ్యులున్నారు. వారిలో కాంగ్రెస్ రెబెల్స్ అయిన 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే, ఆ సంఖ్య 206కి చేరుతుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 104 అవుతుంది. ఆ పరిస్థితుల్లో.. 107 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కానుంది. ఇప్పటివరకు కమల్‌నాథ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిచ్చే వీలుంది. ప్రభుత్వాన్ని కాపాడుకుంటాం అయితే, విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ‘మాతో 95 మంది పార్టీ ఎమ్మెల్యేలున్నారు. స్వతంత్రులు, బీఎస్పీ, ఎస్పీ సభ్యులు మాకే మద్దతిస్తారు’ అని రాష్ట్ర మంత్రి ప్రియవ్రత్ సింగ్ తెలిపారు. ‘22 మంది రెబెల్ ఎమ్మెల్యేల్లో 13 మంది కాంగ్రెస్‌ను వీడిపోమని చెప్పారు. జ్యోతిరాదిత్యకు రాజ్యసభ సీటు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చేందుకే ఈ పని చేశాం అని వారు చెప్పారు. సింధియా పార్టీని వదిలి వెళ్తారని మేం ఊహించలేదు’ అని పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ అన్నారు. ‘మేం సింధియాను రాజ్యసభకు పంపించగలం కానీ.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మాత్రమే ఆయనను కేంద్రమంత్రిని చేయగలరు’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 2018 ఎన్నికల్లో విజయం అనంతరం జ్యోతిరాదిత్యకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశామని, అయితే, ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించి, తన మద్దతుదారుకు ఆ పదవి ఇవ్వాలని కోరారని దిగ్విజయ్ వెల్లడించారు. ఈ సంక్షోభం వెనుక బీజేపీ ఉందని, ఈ ఆపరేషన్‌కు ఆ పార్టీనే నిధులను సమకూరుస్తోందని ఆరోపించారు. ‘‘2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూలుస్తానని మోదీ, షాలకు సింధియా ప్రతిపాదన పంపారు. కానీ బీజేపీ రాష్ట్ర నాయకులు దాన్ని అడ్డుకున్నారు. ఆ పనికి సింధియా ఎందుకు? మేమే ఆ పని చేయగలం అని షాకు చెప్పారు. కానీ, వారి ప్రయత్నాన్ని మేం సాగనివ్వలేదు. దాంతో, ఇప్పుడు షా స్థానిక నాయకులను పిలిచి, మీరంతా పనికిరానివారు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే పనిని ఇప్పుడు సింధియాకు అప్పగిస్తున్నా అని వారికి చెప్పారు’’ అని దిగ్విజయ్ మధ్యప్రదేశ్ సంక్షోభాన్ని వివరించారు. ప్రజా ప్రభుత్వాలను కూల్చే కుట్ర మధ్యప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ‘ప్రజా ప్రభుత్వాలను కూల్చే పనిలో బిజీగా ఉన్న మీకు చమురు ధరలు 35% తగ్గిన విషయం బహుశా దృష్టికి రాలేదనుకుంటా. ఆ తగ్గుదల ప్రయోజనాలను ప్రజలకు కల్పించండి’ అని ట్వీట్ చేశారు. రాజమాత గుర్తొచ్చారు సింధియా బీజేపీలో చేరిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సింధియా నానమ్మ, గ్వాలియర్ రాజమాత, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన విజయరాజె సింధియాను గుర్తు చేసుకున్నారు. ఆమె మనవడు బీజేపీలోకి రావడం తనకు అత్యంత సంతోషకరమైన విషయమన్నారు. మహారాజ్, శివరాజ్ ఇప్పుడు ఒకే పార్టీలో జ్యోతిరాదిత్య బీజేపీలో చేరడాన్ని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ నేత శివరాజ్ సింగ్ స్వాగతించారు. 2018 ఎన్నికల సమయంలో బీజేపీ నినాదమైన ‘మాఫ్ కరో మహారాజ్.. హమారా నేతాతో శివరాజ్ (క్షమించండి మహారాజ్.. మా నాయకుడు శివరాజ్)’ను విలేకరులు గుర్తు చేయగా.. ఇప్పుడు, మహారాజ్, శివరాజ్ ఒకే పార్టీలో ఉన్నారని చమత్కరించారు. జ్యోతిరాదిత్య స్థానికుల్లో మహారాజ్‌గా చిరపరిచితుడు. 9 మంది అభ్యర్థులు మార్చి 26న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి తమ అభ్యర్థిగా జ్యోతిరాదిత్యను బీజేపీ ప్రకటించింది. సింధియాతోపాటు గుజరాత్ నుంచి ఇద్దరిని, అస్సాం, బిహార్, మహారాష్ట్ర, రాజస్తాన్, జార్ఖండ్, మణిపూర్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున.. మొత్తం 9 మంది అభ్యర్థులతో ఒక జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. మిత్రపక్షాలు ఆర్పీఐ, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్లకు ఒక్కో సీటును కేటాయించింది. ఆర్పీఐ తరఫున కేంద్ర మంత్రి రామ్‌దాస్ అఠవాలే మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశముంది. వాస్తవాలను అంగీకరించే పరిస్థితిలో లేదు బీజేపీలో చేరిన సందర్భంగా జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌పై లోతైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఒకప్పటి పార్టీ కాదని, ఇప్పుడు ఆ పార్టీ వాస్తవాలను అంగీకరించే పరిస్థితిలో లేదని విమర్శించారు. కొత్త ఆలోచనలను, నూతన నాయకత్వాలను ఆమోదించలేకపోతోందన్నారు. మోదీపై సింధియా ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ సమర్ధుడైన నేత అని, దేశ సేవ కోసం సంపూర్ణంగా అంకితమైన వ్యక్తి అని పొగిడారు. ఆయన చేతుల్లో దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుందన్నారు. దేశ ప్రతిష్టను మోదీ విశ్వవ్యాప్తం చేశారన్నారు. 2018లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కలలు కన్నానని, ఈ 18 నెలల్లో అవన్నీ కల్లలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, రైతులు, యువత నిస్పృహలో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఉంటే ప్రజలకు సేవ చేయాలన్న తన ఆకాంక్ష నెరవేరదని అర్థమైందన్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై మాత్రం ఆయన ఏ వ్యాఖ్యలు చేయలేదు. ఇంటికి ఎప్పుడైనా రావొచ్చు: రాహుల్ తనకు అత్యంత సన్నిహితుడైన సింధియా పార్టీని విడిచి పెట్టడంతో రాహుల్‌గాంధీ కాస్త కలత చెందినట్టు కనిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్‌లతో కలిసి ఉన్న ఫోటోకి లియో టాల్‌స్టాయ్ ప్రఖ్యాత కొటేషన్ పోరాటయోధులు అంటే ఎవరో కాదు సహనం, సమయం అంటూ తాను చేసిన ట్వీట్‌ని మళ్లీ రాహుల్ రీ ట్వీట్ చేశారు. ఆయన ఎందుకు దీనిని రీట్వీట్ చేశారో ఎవరికీ అర్థం కాలేదు కానీ ‘‘నా ఇంటికి ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా హాయిగా వచ్చే నాయకుడెవరైనా ఉన్నారంటే జ్యోతిరాదిత్య సింధియాయే, ఆయన నాకు కాలేజీ రోజుల నుంచి బెస్ట్ ఫ్రెండ్‘‘అన్న రాహుల్ వ్యాఖ్యలతో వారిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో తెలుస్తోంది. భోపాల్ నుంచి జైపూర్‌కు ప్రత్యేక విమానంలో బయల్దేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు -
బీజేపీలో చేరిన వీరప్పన్ కూతురు
హోసూరు: ఒకప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్ కూతురు విద్య తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని ప్రైవేట్ కళ్యాణ మంటపంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పార్టీ తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రన్, పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి మురళీధరన్, మాజీ కేంద్ర మంత్రి పొన్ రాధాక్రిష్ణన్‌ల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. 2 వేల మంది ఆమె మిత్రులు, అనుచరులు పార్టీలో చేరారు. -
బీజేపీలోకి నమిత, రాధారవి
సాక్షి, చెన్నై: సినీ నటులు నమిత, రాధారవి బీజేపీలో చేరారు. శనివారం చెన్నైకి వచ్చిన బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో వీరు కాషాయం కండువా కప్పుకున్నారు. రాధారవికి బీజేపీ నేత, సినీ నటుడు ఎస్వీ శేఖర్ అభినందనలు తెలియజేశారు. అయితే సినీ నేపథ్య గాయని చిన్మయి మాత్రం తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహిళలను కించ పరిచే రీతిలో స్పందించే రాధారవిని పార్టీలో చేర్చుకోవడంతో నష్టం తప్పదని అన్నారు. -
బీజేపీలోకి రెజ్లర్ బబిత
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం, పలు అంతర్జాతీయ పోటీల్లో విజ యాలు సాధించి సత్తా చాటిన రెజ్లర్ బబితా ఫొగాట్, ఆమెకు శిక్షణ నిచ్చిన ఆమె తండ్రి మహవీర్‌సింగ్ ఫొగాట్‌లు సోమవారం బీజేపీలో చేరారు. వీరిద్దరి విజయాలు స్ఫూర్తిగా ‘దంగల్’ పేరుతో ఆమిర్‌ఖాన్ హీరోగా బాలీవుడ్లో ఓ సినిమా కూడా రూపొందిన విషయం తెలిసిందే. కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజుజు, హరియాణా రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అనిల్ జైన్ సమక్షంలో వారు బీజేపీ తీర్థం పుచ్చుకు న్నారు. యువశక్తికి బబిత నిదర్శనంగా నిలిచిం దని కిరణ్ రిజిజు ప్రశంసించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఫొగాట్‌ల చేరిక పార్టీకి కొత్త శక్తినిస్తుందని బీజేపీ పేర్కొంది. బబిత చేరిక హరియాణా బీజేపీకి మంచిరోజు అని అనిల్ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రధాని మోదీ చరిత్రను తిరగరాశారని బబిత ప్రశంసించారు. -
బీజేపీలోకి 107 మంది ఎమ్మెల్యేలు
కోల్‌కతా: బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), కాంగ్రెస్, సీపీఎంలకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేత ముకుల్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని పలువురు టీఎంసీ నేతలు మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీపై నమ్మకాన్ని కోల్పోయారని, ఆ పార్టీ విధానాలతో వారు విసుగుచెందారని శనివారం ఆయన విలేకరులకు తెలిపారు. పలువురు టీఎంసీ కౌన్సిలర్లు బీజేపీలోకి వచ్చి, వెంటనే తిరిగి టీఎంసీలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో ముకుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు చొప్పున బీజేపీలో చేరారు. -
గోవాలో మొదలైంది
పణజీ: కర్ణాటకలోని రాజకీయ అస్థిరత గోవానూ తాకింది. ఇప్పటివరకు గోవాలో కాంగ్రెస్‌కు మొత్తం 15 మంది ఎమ్మెల్యేలుండగా, బుధవారం 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. మూడింట రెండొంతుల మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో వారి చేరిక చట్టబద్ధమైంది. ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ నేతృత్వంలోని మొత్తం 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. గోవా అసెంబ్లీ స్పీకర్ రాజేశ్ పట్నేకర్‌ను సాయంత్రం పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి, తాము కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు ఓ లేఖను ఆయనకు అందిం చారు. నీలకంఠ హలార్న్‌కర్, అటనాసియో మాన్సెరట్ట్, జెన్నిఫర్ మాన్సెరట్ట్, ఫ్రాన్సిస్ సిల్వీరా, ఫిలిప్ నెరీ రోడ్రిగుస్ తదితరులు వారిలో ఉన్నారు. పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ భవనానికి వచ్చినప్పుడు గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ ఇక నుంచి ఆ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ వారేనని అన్నారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలుండగా, ఇప్పటివరకు 17 సీట్లతో బీజేపీ పెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్‌కు 15 మంది సభ్యులున్నా, ఇప్పుడు 10 మంది బీజేపీలో చేరడంతో బీజేపీ బలం 27కి పెరిగింది. గోవా ఫార్వర్డ్ పార్టీకి ముగ్గురు, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ, ఎన్సీపీలకు చెరొక ఎమ్మెల్యే ఉన్నారు. మిగిలిన ముగ్గురూ స్వతంత్ర ఎమ్మెల్యేలు. -
బీజేపీలోకి ప్రముఖ సింగర్ దలేర్ మెహందీ
న్యూఢిల్లీ: ప్రముఖ పంజాబీ సింగర్ దలేర్ మెహందీ శుక్రవారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి విజయ్ గోయల్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వాయవ్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న హన్స్‌రాజ్ హన్స్తదితరులు పాల్గొన్నారు. హన్స్‌రాజ్ కుమారుడితో మెహందీ కుమార్తె వివాహం జరిగిన విషయం తెలిసిందే. -
బీజేపీలోకి సాధ్వి ప్రజ్ఞా
భోపాల్/న్యూఢిల్లీ: మాలెగావ్ బాంబు పేలుడు కేసులో నిందితురాలైన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బుధవారం బీజేపీలో చేరారు. భోపాల్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌తో పోటీ పడనున్నారు. అతివాద భావాలున్న సాధ్విని మాలెగావ్ బాంబు పేలుడు కేసులో మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక స్క్వాడ్ 2008లో అరెస్టు చేసింది. కాగా, ఇటీవలే ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. బీజేపీకి కంచుకోటలా భావించే భోపాల్‌లో గట్టి పోటీ ఇవ్వగల అభ్యర్థిని బరిలోకి దింపాలని బీజేపీ భావించింది. 4.5 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో హిందూత్వ భావాలున్న నేత సాధ్విని కాంగ్రెస్‌పై పోటీకి దింపింది. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో జన్మించిన ప్రగ్యా ఆర్ఎస్ఎస్లో సుదీర్ఘ కాలంగా సేవలు అందించారు. సాధ్వి పోటీపై పీడీపీ అధ్యక్షురాలు, కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా స్పందిస్తూ.. ‘నేను ఒకవేళ ఉగ్రవాద నిందితుడిని పోటీలో దింపితే ఎలాంటి ఆగ్రవేశాలు వెల్లడవుతాయో ఊహించండి. టీవీ చానెళ్లు మెహబూబా టెర్రరిస్ట్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో వార్తలు ఇస్తాయి. వారిమటుకు కాషాయం ప్రస్తావన వస్తే మతం ప్రస్తావన రాదు. ముస్లింల విషయమొచ్చే సరికి ఉగ్రవాదులు అంటారు’ అని అన్నారు. -
గోవాలో మరో అర్ధరాత్రి డ్రామా
పణజీ: గోవాలో వారం తిరిగేలోపే మరోసారి అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు తమ పార్టీ శాసనసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను ఎంజీపీ ఎమ్మెల్యేలు మనోహర్ అజ్గావోంకర్, దీపక్ పావస్కర్‌లు గోవా అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్ మైఖేల్ లోబోకు మంగళవారం అర్ధరాత్రి 1.45 గంటలకు అందజేశారు. అనంతరం ఉపముఖ్యమంత్రిగా ఉన్న మరో ఎంజీపీ ఎమ్మెల్యే సుదీన్ ధవలికర్‌ను ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంత్రివర్గం నుంచి తొలగించారు. తమ పార్టీ శాసనసభాపక్ష వ్యవహారాల్లో బీజేపీ తలదూరుస్తోందనీ, ఆ పార్టీ కుట్రకు పాల్పడుతున్నందున సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటామంటూ ఎంజీపీ అధ్యక్షుడు దీపక్ ధవలికర్ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. బీజేపీతో కలిసే పార్టీలకు ఇదే గతి: కాంగ్రెస్ గోవాలో తాజా పరిణామాలపై కాంగ్రెస్ స్పందిస్తూ బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీలకన్నింటికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించింది. ‘తన మిత్రపక్షాలకు తానే ప్రమాదకారినని బీజేపీ నిరూపించింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తమ పార్టీ మనుగడే ప్రమాదకరమవుతుందన్న విషయాన్ని ఎన్డీయేలోని పార్టీలు గుర్తించాలి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదో గట్టి హెచ్చరిక’ అని గోవా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సునీల్ కవఠాంకర్ అన్నారు. -
బీజేపీలోకి జితేందర్‌రెడ్డి?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో మోదీ పాల్గొనే బహిరంగసభలో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. గత కొద్ది నెలలుగా జితేందర్‌రెడ్డి పార్టీ మారుతారన్న చర్చ జరుగుతోంది. గతంలో బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన ఆయనకు జాతీయ నేతలతో సంబంధాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రులు ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనికి జితేందర్‌రెడ్డి కారణమన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ జాతీయ నేతలతో సంబంధాలు ఉండటంతో పాటు మంత్రుల ఓటమికి జితేందర్‌రెడ్డి కారణమన్న ఉద్దేశంతో లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదని టీఆర్ఎస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఆయనకు టికెట్ రాకపోవడంతో బీజేపీలోకి రావాలని ఆ పార్టీ నేతలు కోరారు. ఈ సమయంలోనే డీకే అరుణ బీజేపీలో చేరడం, ఆమెకు మహబూబ్‌నగర్ టికెట్ ప్రకటించారు. అయితే బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపి రాజకీయ భవిష్యత్‌పై భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా విముఖత వ్యక్తం చేసినా.. తర్వాత పార్టీలో చేరడానికి అంగీకరించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరులో మహబూబ్‌నగర్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అదే రోజు జితేందర్‌రెడ్డి బీజేపీలో చేరుతారని సమాచారం. -
బీజేపీలో చేరిన జయప్రద
సాక్షి, న్యూఢిల్లీ: సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేత ఉపేంద్ర యాదవ్ ఆమెను పార్టీలోకి ఆహ్వానించి ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ.. బీజేపీలో చేరడం తన జీవితంలోనే ప్రధానమైన ఘట్టం అని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నప్పుడు జయప్రద ఆ పార్టీ సీనియర్ నేత అమర్‌సింగ్ శిష్యురాలిగా ఉన్నారు. అనంతరం పార్టీ పగ్గాలు అఖిలేష్ యాదవ్ చేతికి అందడం, సొంతపార్టీకి చెందిన సీనియర్ నేత ఆజంఖాన్ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం వంటి కారణాల వల్ల కొంత కాలంగా ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాంపూర్ నుంచే బరిలోకి.. తెలుగుదేశం పార్టీ నుంచి 1994లో రాజకీయ అరంగేట్రం చేసిన జయప్రద.. రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2004, 2009 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈసారి కూడా ఆమె అదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో దిగనున్నారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ తరఫున రాంపూర్ నుంచి ఆజంఖాన్ పోటీలో ఉండటం గమనార్హం. గతంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక గతంలో ఒకే పార్టీకి చెందిన ఈ ఇద్దరు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. -
మహాకూటమికి మహిళా నేత షాక్..
రాంచీ : లోక్‌సభ ఎన్నికలకు జార్ఖండ్‌లో మహాకూటమి పార్టీలు సీట్ల సర్ధుబాటును ప్రకటించిన మరుసటి రోజే కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీ రాష్ట్ర శాఖ చీఫ్ అన్నపూర్ణదేవి పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సంసిద్ధమయ్యారు. జార్ఖండ్‌లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటును ఆదివారం పార్టీ నేతలు ప్రకటించారు. కాంగ్రెస్, జేఎంఎం, జేవీఎంలు వరసగా ఏడు, నాలుగు, రెండు స్ధానాల్లో పోటీ చేయనుండగా, ఆర్జేడీకి ఒక స్ధానం కేటాయించారు. సీట్ల సర్ధుబాటును ప్రకటించిన మరుసటి రోజే సోమవారం ఆర్జేడీ జార్ఖండ్ చీఫ్ అన్నపూర్ణదేవి సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లడం కలకలం రేపింది. దేశ రాజధానిలో ఆమె బీజేపీ అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది. కాగా ఆదివారం రాత్రి జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్, ఇతర బీజేపీ నేతలతో అన్నపూర్ణదేవి భేటీ కావడంతో ఆమెను పార్టీ నుంచి ఆర్జేడీ సస్పెండ్ చేసింది. మరోవైపు చత్ర లేదా కొడెర్మా స్ధానాల్లో ఏదో ఒక చోట నుంచి ఆమెను బీజేపీ బరిలో దింపుతుందని భావిస్తున్నారు.