Mithun Chakraborty: బీజేపీలోకి మిథున్‌ చక్రవర్తి | Actor Mithun Chakraborty joins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి మిథున్‌ చక్రవర్తి

Published Mon, Mar 8 2021 6:30 AM | Last Updated on Mon, Mar 8 2021 4:35 PM

Actor Mithun Chakraborty joins BJP - Sakshi

సభలో మాట్లాడుతున్న మిథున్‌ చక్రవర్తి

కోల్‌కతా: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు మిథున్‌ చక్రవర్తి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆదివారం కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వర్గీయా, పార్టీ బెంగాల్‌ శాఖ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం పని చేయాలని తాను కోరుకుంటున్నట్లు మిథున్‌ చక్రవర్తి చెప్పారు. తన ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు బీజేపీ ఒక వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. బెంగాలీని అని చెప్పుకోవడం తనకెంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు తాను నటించిన బెంగాలీ సినిమాలోని ఒక డైలాగ్‌ చెప్పి అలరించారు. అమీ జోల్దోరవో నోయి, బెలె బొరావో నోయి.. అమీ ఏక్తా కోబ్రా, ఏక్‌ చోబోల్‌–యి చోబి (నేను హాని చేయని పామును అనుకొని పొరపాటు పడొద్దు. నేను నాగుపామును. ఒక్క కాటుతో చంపేస్తా జాగ్రత్త) అనే డైలాగ్‌ చెప్పారు. తాను గతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశానని మిథున్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని తెలిపారు. బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారన్నది పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందన్నారు.

బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌ సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. ఈరోజు బంగ్లార్‌ చెలే(బెంగాలీ బిడ్డ) మిథున్‌ చక్రవర్తి మనతో ఉన్నారని చెప్పారు. ఆయన జీవితం, సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.  మిథున్‌ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో గతంలో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన 2014లో టీఎంసీ తరపున రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలతో 2016లో రాజీనామా చేశారు. శారదా కుంభకోణంలో మిథున్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ఆయన అవకాశవాది అని టీఎంసీ, కమ్యూనిస్టు పార్టీలు విమర్శించాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement