Mithun chakravarthi
-
ప్రధాని మోదీ మెచ్చిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'.. సినిమాలో ఏముంది ?
PM Narendra Modi Appreciates The Kashmir Files Movie Special Story: బాలీవుడ్ దిగ్గజ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషిలు కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ సినిమాకు ప్రముఖ బీటౌన్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. ఆయన ఇదివరకూ 'ది తాష్కెంట్ ఫైల్స్' అనే సినిమాతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించడంలో వివేక్ అగ్నిహోత్రి అస్సలు వెనుకాడరు. అలా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించిందే 'ది కశ్మీర్ ఫైల్స్'. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు హరియానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా తమవంతు సాయంగా పన్ను రాయితీని ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. మరీ ఇంతలా ఆకట్టుకుంటున్నా 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాలో ఏముంది ? ఈ మూవీ కథేంటీ ? అనే సందేహం రాకుండా ఉండదు. ఆ సందేహం వచ్చిన ప్రేక్షకుల కోసమే 'సాక్షి' స్పెషల్ స్టోరీ. కశ్మీర్ పండిట్లపై సాముహిక హత్యాకాండ.. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా కథ 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండకు అద్దం పడుతుంది. కశ్మీర్ లోయలోని ఓ వర్గంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణ మారణ కాండకు పాల్పడ్డారు. కశ్మీరీ మహిళలను వివస్త్రలుగా చేసి, సాముహిక మానభంగానికి ఒడిగట్టారు. ఆ లోయలో ఉండాలంటే మతం మారాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. అడ్డుకున్న వారిని అడ్డుతొలగించుకుంటారు. వారి ఆస్తులను దోచుకున్నారు. ఎదురు తిరిగినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. తుపాకులు, కత్తులతో దారుణంగా దాడి చేశారు. పాకిస్తాన్ జిహాదీ మూకతో చేతులు కలిపి ఆకృత్యాలకు పాల్పడటం వారిని కలచివేసింది. ఈ దారుణమైన ఉదంతానికి పర్యవసానంగా సుమారు 5 లక్షల మంది కశ్మీరీ పండిట్లు స్వదేశంలోనే శరణార్థులుగా మారారు. దీంతో వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. ఢిల్లీ పురవీధుల ఫుట్పాత్స్పై ఏళ్ల తరబడి జీవితాన్ని గడిపారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. బాధ్యతాయుత పౌరుడిగా తీశాను.. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేందుకు, సినిమా రూపంలో తెరకెక్కిచ్చేందుకు ఎంతో గుండె ధైర్యం ఉండాలి. వాస్తవ గాథలను చిత్రీకరిస్తున్నామని చెప్పి అనేకమంది దర్శకనిర్మాతలు వసూళ్ల కోసం కక్కుర్తితో రాజీ పడి రూపొందిస్తుంటారు. కానీ ఎలాంటి రాజీ లేకుండా తెరకెక్కించారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ‘‘కశ్మీర్లో 1990వ దశకంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే విషయాలను ‘కశ్మీర్ ఫైల్స్’లో చూపించాం. కశ్మీర్లో జరిగిన అసలు సిసలైన వాస్తవాలు బయటకు రాలేదు. అందుకే బాధ్యతాయుత పౌరుడిగా నేను ఈ సినిమా తీశాను.. నాలుగేళ్లపాటు చాలా కష్టనష్టాలు అనుభవించాను. మా చిత్రం చూసి నిజాలు తెలుసుకోండి.’’ అని హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. ‘‘గడిచిన 30 ఏళ్లల్లో ‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి కథను ఎవరూ తీయలేదు’’ అని నిర్మాత అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. సినిమా చూసి కంటతడి పెట్టిన మహిళ.. అయితే మన దేశంలోని కశ్మీర్ ప్రాంతంలో జరిగిన ఈ అత్యంత భయానకమైన ఘటనను వెండితెరపై ఆవిష్కరించడం అంత సులువుకాదు. దర్శకనిర్మాతలకు ఈ సినిమా రూపొందించడం నల్లేరుపై నడకల జరగలేదు. 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ఈ చిత్రాన్ని ఆపేయమని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఈ మూవీని అడ్డుకోవడానికి కోర్టులో వ్యాజ్యాలు సైతం వేశారు. ఇలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి 'ది కశ్మీర్ ఫైల్స్'ను ఉన్నది ఉన్నట్లుగా నటీనటుల సహకారంతో వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో ప్రతీ సన్నివేశం, నటీనటుల భావోద్వేగపు యాక్టింగ్ ప్రేక్షకులను కదిలించేలా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సినిమా చూసిన అనేక మంది ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయి కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెటర్ సురేష్ రైనా తన ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక మహిళ వివేక్ పాదాలు తాకడం, సినిమా గురించి తన భావాన్ని వ్యక్తపరుస్తూ బిగ్గరగా ఏడవడం మనం చూడొచ్చు. అనంతరం డైరెక్టర్ వివేక్, నటుడు దర్శన్ కుమార్ ఆ మహిళను ఓదార్చారు. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి డైరెక్టర్, దర్శన్ కుమార్ సైతం కంటతడి పెట్టుకున్నారు. ప్రేక్షకుల నీరాజానలు అందుకుంటున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదలు కాగా మన దేశంలో 561 థియేటర్లలో, ఓవర్సీస్లో 113 స్క్రీన్స్‌లలో ప్రదర్శించబడుతోంది. Presenting #TheKashmirFiles It’s your film now. If the film touches your heart, I’d request you to raise your voice for the #RightToJustice and heal the victims of Kashmir Genocide.@vivekagnihotri @AnupamPKher @AdityaRajKaul pic.twitter.com/Gnwg0wlPKU — Suresh Raina🇮🇳 (@ImRaina) March 11, 2022 -
నిజ సంఘటనల ఆధారంగా ‘కశ్మీర్ ఫైల్స్’
‘‘కశ్మీర్లో 1990వ దశకంలో హిందూ పండితులను టార్గెట్ చేసి టెర్రరిస్టులు ఊచకోత కోశారు. అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే విషయాలను ‘కశ్మీర్ ఫైల్స్’లో చూపించాం. మా చిత్రం చూసి నిజాలు తెలుసుకోండి’’ అని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అన్నారు. దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ నటించిన చిత్రం ‘కశ్మీర్ ఫైల్స్’. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి నిర్మించిన ఈ హిందీ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..‘‘కశ్మీర్లో జరిగిన అసలు సిసలైన వాస్తవాలు బయటకు రాలేదు. అందుకే బాధ్యతాయుత పౌరుడిగా నేను ఈ సినిమా తీశాను.. నాలుగేళ్లపాటు చాలా కష్టనష్టాలు అనుభవించాను’’ అన్నారు. ‘‘గడచిన 30 ఏళ్లల్లో ‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి కథను ఎవరూ తీయలేదు’’ అన్నారు అభిషేక్ అగర్వాల్. ‘‘మాపై నమ్మకంతో సినిమా విడుదలకు సహకరిస్తున్న తేజ్ నారాయణ్, అభిషేక్‌లకు థ్యాంక్స్’’ అన్నారు పల్లవి జోషి. నటుడు దర్శన్ కుమార్, బీజేపీ నాయకుడు రామచంద్రరావు, పరిపూర్ణానంద స్వామి తదితరులు మాట్లాడారు. -
భావోద్వేగంగా 'ది కశ్మీర్ ఫైల్స్' ట్రైలర్.. కంగనా ప్రశంసలు
The Kashmir Files Movie Trailer Out And Released In March: అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలకపాత్రల్లో నటించిన హిందీ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. 90వ దశకంలో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా. 'ది తాష్కెంట్ ఫైల్స్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ సోమవారం (ఫిబ్రవరి 21) విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, భావోద్వేగంగా ఉంది మూవీ ట్రైలర్. 1990 సంవత్సరంలో కశ్మీర్‌లోని ఒక సామాజిక వర్గంపై జరిగిన హత్యలను డైరెక్టర్ వివేక్ భావోద్వేగంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌పై బాలీవుడ్ డేరింగ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది. సినిమాను చాలా బాగా తీశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోందని, ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తిపై పోలీసుల ప్రశ్నల వర్షం
కోల్‌కతా: బాలీవుడ్ సీనియర్ నటుడు, బెంగాల్ బీజేపీ నేత మిథున్ చక్రవర్తిని కోల్‌కతా పోలీసులు ప్రశ్నించారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిథున్ చేసిన ఓ ప్రసంగంపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బుధవారం మిథున్‌ను 45 నిమిషాలపాటు పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, 71 ఏళ్ల మిథున్ చక్రవర్తి.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు బహిరంగ సభల్లో, ర్యాలీల్లో ఆవేశపూరితంగా ప్రసంగించారు. కాగా, బెంగాల్ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ హింసపై మిథున్ ప్రసంగాల ప్రభావం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ‘ఎగిరి తంతే.. శవం శ్మశానంలో పడుతుంది’ అంటూ తన సినిమాలోని డైలాగును ఉపయోగించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాను ఆవేశంగా డైలాగులు చెప్పానే తప్ప.. ఉద్దేశపూర్వక ప్రసంగాలు చేయలేదని మిథున్ కోల్‌కతా కోర్టుకు విన్నపించాడు. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోర్టును కోరాడు కూడా. అయితే కోర్టు మాత్రం ఆయన్ని వర్చువల్‌గా ప్రశ్నించాలని పోలీసులను ఆదేశించింది. ఇక మరో బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘నేనేం ఉత్త పామును కాను. నల్లత్రాచుని. కాటేస్తే.. నీ ఫొటోకి దండ పడాల్సిందే’ అని అర్థం వచ్చేలా కామెంట్లు చేశాడు. అన్నట్లు.. ఈ డిస్కో డ్యాన్సర్ పుట్టినరోజు ఇవాళే. చదవండి: మిథున్ కొడుకుపై రేప్ కేస్ -
Mithun Chakraborty: బీజేపీలోకి మిథున్ చక్రవర్తి
కోల్‌కతా: బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆదివారం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గీయా, పార్టీ బెంగాల్ శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం పని చేయాలని తాను కోరుకుంటున్నట్లు మిథున్ చక్రవర్తి చెప్పారు. తన ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు బీజేపీ ఒక వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. బెంగాలీని అని చెప్పుకోవడం తనకెంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు తాను నటించిన బెంగాలీ సినిమాలోని ఒక డైలాగ్ చెప్పి అలరించారు. అమీ జోల్దోరవో నోయి, బెలె బొరావో నోయి.. అమీ ఏక్తా కోబ్రా, ఏక్ చోబోల్–యి చోబి (నేను హాని చేయని పామును అనుకొని పొరపాటు పడొద్దు. నేను నాగుపామును. ఒక్క కాటుతో చంపేస్తా జాగ్రత్త) అనే డైలాగ్ చెప్పారు. తాను గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశానని మిథున్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని తెలిపారు. బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారన్నది పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందన్నారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. ఈరోజు బంగ్లార్ చెలే(బెంగాలీ బిడ్డ) మిథున్ చక్రవర్తి మనతో ఉన్నారని చెప్పారు. ఆయన జీవితం, సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మిథున్ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో గతంలో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన 2014లో టీఎంసీ తరపున రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలతో 2016లో రాజీనామా చేశారు. శారదా కుంభకోణంలో మిథున్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆయన అవకాశవాది అని టీఎంసీ, కమ్యూనిస్టు పార్టీలు విమర్శించాయి. -
డ్యాన్సర్‌తో శ్రీదేవి బ్రేకప్ స్టోరీ
శ్రీదేవి.. ఏ తరానికైనా ఆరాధ్య తారే. మిథున్ చక్రవర్తి.. ఎప్పటికీ డాన్స్ గురునే! ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు దాదాపుగా హిట్టే! తెర మీద ఈ జంట సూపర్ హిట్! మూడుముళ్లతో జీవితంలోనూ కలిసి నడవాలనుకున్నారు.. తమ ప్రేమను కలకాలం నిలుపుకోవాలనుకున్నారు. అదే జరిగి ఉంటే ఇక్కడ ‘మొహబ్బతే’లో వాళ్ల గురించి ప్రస్తావన వచ్చి ఉండేది కాదు. ‘సప్తపది’ తెలుగు సినిమాను హిందీలో ‘జాగ్ ఉఠా ఇన్సాన్’గా ( దీనికీ కె. విశ్వనాథే దర్శకుడు) తీశారు. నాయికానాయకులు శ్రీదేవి, మిథున్ చక్రవర్తి. ఆ సినిమా సెట్స్ మీదే ఆ ఇద్దరికీ స్నేహం కుదిరింది. తన పని పట్ల మాత్రమే శ్రద్ధ పెట్టే శ్రీదేవి మనస్తత్వం మిథున్‌కు నచ్చింది. ఆమె మొహంలోని అమాయకత్వం అతణ్ణి ఆకర్షించింది. దాంతో ఆ స్నేహాన్ని ఆమె మీద ప్రేమగా మార్చుకున్నాడు. తనను ప్రత్యేకంగా.. కావాల్సిన వ్యక్తిగా ఆత్మీయంగా చూడసాగాడు. అతని కళ్లల్లోని ఆ ఆప్యాయత శ్రీదేవి శ్రద్ధను చెదరగొట్టింది. మనసు మిథున్ వైపు పోయేలా చేసింది. అలా వాళ్ల ప్రేమ ప్రయాణం మొదలైంది. ఇది 1984 నాటి ముచ్చట. ఆ ఇద్దరూ జంటగా బయట ఎక్కడా పెద్దగా కనిపించకపోయినా.. సోర్స్ ద్వారా పేజ్ త్రీ ఆ నిప్పు అందుకుంది.. రూమర్స్, గాసిప్స్ పొగను వదిలింది. ఆ సమయంలోనే... శ్రీదేవిని సైలెంట్‌గా, సీక్రేట్‌గా ఆరాధించసాగాడు నిర్మాత బోనీ కపూర్. అప్పటికే మిథున్, బోనీ మంచి ఫ్రెండ్స్. శ్రీదేవి పరిచయం నాటికే ఇటు మిథున్‌కు యోగితా బాలితో, అటు బోనీకి మోనాతో పెళ్లిళ్లయ్యాయి. రెండు జంటలూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌లోనే ఉన్నాయి. రాఖీ రోజులు గడుస్తున్నాయి. మిథున్, శ్రీదేవిల మధ్య అనుబంధం పెరుగుతోంది.. బంధం బలపడుతోంది. ఆమె లేకుండా అతను ఉండలేని పరిస్థితి. ‘పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాడు శ్రీదేవితో. ఆమె ఆనందానికి అవధుల్లేవు. శ్రీదేవితో తన ప్రేమను వెలిబుచ్చినప్పుడే ‘యోగితాకు విడాకులిస్తున్నాను’అనీ చెప్పాడు. అందుకే మిథున్ నోటెంట పెళ్లి ప్రస్తావన రాగానే విడాకులు మంజూరయ్యాయేమో అనుకుంది. ఇంకొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు అడిగింది శ్రీదేవి.. మిథున్‌ను ‘మీ లైఫ్‌లో రెండో స్త్రీగా ఉండలేను. విడాకులు ఎంతవరకు వచ్చాయి?’ అని. అతణ్ణించి స్పష్టమైన జవాబు రాలేదు కాని ఓ అనుమానం బయటకు వచ్చింది. బోనీకీ శ్రీదేవి అంటే ఇష్టం అన్న సంగతి మిథున్‌కి అర్థమైంది. శ్రీదేవీకీ ఆ విషయం తెలుసేమో.. తెలిసీ తేల్చట్లేదేమో అన్నదే ఆ శంక. శ్రీదేవి ముందు అనేశాడు. ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. ఆమెకు బోనీ కపూర్ కుటుంబంతో ఉన్న చనువుతో మిథున్ అనుమానాన్ని తీర్చేయాలనుకుంది. ఆ రాఖీ పౌర్ణిమ రోజు బోనీ కపూర్ వాళ్లింటికి వెళ్లి బోనీ చేతికి రాఖీ కట్టేసింది. మిథున్ చింతను దూరం చేసింది శ్రీదేవి. ఆత్మహత్య.. ఈలోపు పేజ్ త్రీ .. మిథున్, శ్రీదేవీ రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వార్తను (అది వదంతే అని శ్రీదేవి, మిథున్ ఇద్దరూ కూడా కొట్టిపారేశారు) ప్రచారం చేసింది. ఇది యోగితాకు తెలిసి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దాంతో మిథున్ భయపడ్డాడు యోగితా ముందు విడాకుల విషయం తేవడానికి. ఇటు శ్రీదేవినీ వదులుకోదల్చుకోలేదతను. శ్రీదేవికి ఆ తాత్సారం అర్థం కాలేదు. మళ్లీ అడిగింది. ‘నేను కావాలో.. నీ భార్య కావాలో తేల్చుకో’ అని అల్టిమేటమూ ఇచ్చింది. యోగితాకు దూరమయ్యే ధైర్యం చేయలేకపోయాడు. అర్థం చేసుకుంది శ్రీదేవి. నెమ్మదిగా మిథున్ జీవితంలోంచి పక్కకు తప్పుకుంది. దాదాపు అయిదేళ్ల ఆ ప్రేమ అలా విషాదాంతమైంది. మానసిక క్షోభకు చాలానే గురైంది శ్రీదేవి. ఆ తర్వాత ఆమె కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు బోనీ కపూరే అండగా నిలబడ్డాడనీ అలా బోనీలో శ్రీదేవి ఓదార్పు వెదుక్కుందని, అతని ప్రేమను అంగీకరించి భర్తగా చేసుకుందని బోనీ, శ్రీదేవీల పెళ్లికి నేపథ్యం చెప్తారు ఇండస్ట్రీలో వాళ్లు. తాను కల కన్న పెద్ద కూతురు జాన్వీ కెరీర్ చూడకుండానే అర్థంతరంగా 54 ఏళ్లకే ఈ లోకానికి వీడ్కోలు చెప్పింది శ్రీదేవి. మిథున్ ఇష్టాన్ని నేనేప్పుడూ కాదనలేదు. ఒకవేళ అతను రెండో పెళ్లి చేసుకొని వచ్చినా నేను ఒప్పుకునేదాన్ని. – యోగితా బాలి (స్టార్ అండ్ స్టైల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో). తనకు, బోనీకి మధ్య ఏమీ లేదని మిథున్‌కు నిరూపించడానికే బోనీకి రాఖీ కట్టింది శ్రీదేవి. – బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ (సావీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో) - ఎస్సార్ -
రాముడా? రావణుడా?
రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి కన్నడలో ‘ది విలన్’ సినిమా షూటింగ్‌కు కొబ్బరికాయ కొట్టి. ఇప్పుడు గుమ్మడికాయ కొట్టే టైమ్ వచ్చింది. ఆల్రెడీ టాకీపార్ట్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టీమ్ ప్రజెంట్ సాంగ్స్‌ను షూట్ చేసే పనిలో పడింది. శివరాజ్‌కుమార్, సుదీప్, అమీజాక్సన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘ది విలన్’. రామ్ ఆర్ రావణ్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు మిధున్ చక్రవర్తి కీలక పాత్రలు చేస్తున్నారు. రీసెంట్గా హీరో శివరాజ్ కుమార్‌పై ఓ మాస్ సాంగ్‌ను షూట్ చేశారు. ఈ సాంగ్‌తో ఈ సినిమాలో శివరాజ్‌కుమార్ వంతు చిత్రీకరణ పూర్తయ్యింది. ‘‘శివన్న డ్యాన్సింగ్ ఎనర్జీ సూపర్. నగేశ్ మాస్టర్ కంపోజ్ చేశారు’’ అన్నారు దర్శకుడు ప్రేమ్. ఆల్రెడీ హీరోల లుక్స్ రిలీజ్ అయ్యాయి. ఈ నెల 28న టీజర్‌ను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. -
డిస్కో డాన్సర్
ట్రెండ్ సెట్టర్ అయామ్ ఏ డిస్కో డాన్సర్.... పాట భారత దేశంలోనే కాదు మొత్తం ఆసియాలోని పెద్ద పెద్ద దేశాల్లో కూడా మార్మోగింది. సోవియెట్ యూనియన్, ఆఫ్రికా, టర్కీ.... ఏ దేశంలో అయినా ఈ సినిమా పెద్ద హిట్టే. దానికి కారణం పాటలు మాత్రమే కాదు. మిథున్ చక్రవర్తి కూడా. ప్రతిభ ఉంటే ఒక పేదవాడు కూడా పైస్థాయికి చేరుకోగలడు అని చెప్పిన ఈ కథ అందరికీ నచ్చింది. మిథున్ చక్రవర్తి 1970లలో ‘మృగయా’ సినిమా ద్వారా సినిమాల్లోకి వచ్చాడు. అంతకుముందు అతడు నక్సలైట్ ఉద్యమంలో పని చేశాడు. సొంత తమ్ముడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తనను కూడా పోలీసులు చంపేస్తారనే వార్తలందడంతో పార్టీ నుంచి బయటికొచ్చి సినిమాల్లో భవిష్యత్తు వెతుక్కున్నాడు. మృణాల్‌సేన్ మొదటి అవకాశం ఇచ్చినా దేశానికి పరిచయం కావడానికి మరో పదేళ్ల తర్వాత 1980లో ‘డిస్కో డాన్సర్’ కావాల్సి వచ్చింది. బి.సుభాష్ దర్శకత్వం వహించిన సినిమా మనం ఈనాడు అనుకుంటున్న వంద కోట్ల క్లబ్ లాంటి కలెక్షన్లతో సమానంగా వసూలు చేసింది. నిజానికి డిస్కో డాన్సర్ మొదలయ్యే సమయానికి కథ గాని, అలాంటి ఆలోచన కాని ఏమీ లేదు. అంతకు ముందు మిథున్ నటించిన ‘వన్నీస్ బీస్’ సినిమా ఫ్లాప్ అయ్యింది. మిథున్ డిప్రెషన్లో ఉండటం చూసి మిత్రుడు బి.సుభాష్ నేనో సినిమా తీస్తాలే అని ధైర్యం చెప్పాడు. మిథున్ అది నిజమనుకుని వెంట పడటంతో తియ్యక తప్పలేదు. మిథున్‌కు డాన్స్ బాగా వచ్చని కనిపెట్టిన సుభాష్ అందుకు తగ్గట్టుగా స్క్రిప్ట్ రాసుకోవడంతో సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. మిథున్‌తో మరికొన్నాళ్ల తర్వాత సుభాష్ తీసిన ‘డాన్స్ డాన్స్’ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇందులో స్మితా పాటిల్ మిథున్‌కు అక్కగా నటించింది. అమితాబ్ దూసుకుపోతున్న ఆ కాలంలో ఆయనను నిలువరించడానికి చాలామంది కలిసి మిథున్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే అమితాబ్ అమితాబే మిథున్ మిథునే. డిస్కో డాన్సర్ ఘన విజయం సౌత్ మీద పడింది. హాస్యనటుడు నగేష్ కుమారుడైన ఆనంద్‌బాబుతో ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేశారు. తెలుగులో బాలకృష్ణతో ‘డిస్కోకింగ్’ పేరుతో తీశారు. ప్రేక్షకులను తెలుగు వర్షన్ నిరాశ పరిచింది. -
తెలుగు రీమేక్‌లో మిథున్ చక్రవర్తి!
‘ఐయామ్ ఎ డిస్కో డాన్సర్’... పాట వినగానే, హిందీ చిత్రాల్లో పేరు తెచ్చుకున్న బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి గుర్తుకొస్తారు. దాదాపు 30 ఏళ్ల క్రితం మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన ‘డిస్కో డాన్సర్’లోని ఈ పాట ఇప్పటికీ పాపులరే. ముఖ్యంగా ఈ పాటకు స్టయిల్‌గా మిథున్ వేసిన స్టెప్పులను మర్చిపోవడం అంత సులువు కాదు. ఆ స్టెప్పులకే మనసు పారేసుకున్న అమ్మాయిలు ఉన్నారు. దక్షిణాదిన మిథున్ సినిమాలు చేయకపోయినప్పటికీ, తను చేసిన హిందీ చిత్రాల ద్వారా ఇక్కడివారికి కూడా సుపరిచితులయ్యారు. కాగా, ఈ ఏడాది మిథున్ చక్రవర్తి తెలుగు తెరపై కనిపిస్తారని చెప్పొచ్చు. అది కూడా రెండు తెలుగు సినిమాల్లో కావడం విశేషం. రవిరాజా పినిశెట్టి కుమారుడు సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఆయన కీలక పాత్ర చేస్తున్నారు. తాజాగా, హిందీ చిత్రం ‘ఓ మై గాడ్’ తెలుగు రీమేక్‌లోనూ ఆయన నటించనున్నారని సమాచారం. హిందీ వెర్షన్లో ధరించిన లీలాధర్ స్వామీజీ పాత్రను తెలుగులో కూడా మిథునే చేయనున్నారట. హిందీలో పరేష్ రావల్ చేసిన పాత్రను వెంకటేశ్, అక్షయ్‌కుమార్ పోషించిన శ్రీకృష్ణుని పాత్రను పవన్ కల్యాణ్ చేయనున్నారు. వెంకీ సరసన శ్రీయ నాయిక. డాలీ దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.