శ్రీదేవి, మిథున్ చక్రవర్తి
శ్రీదేవి.. ఏ తరానికైనా ఆరాధ్య తారే. మిథున్ చక్రవర్తి.. ఎప్పటికీ డాన్స్ గురునే! ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు దాదాపుగా హిట్టే! తెర మీద ఈ జంట సూపర్ హిట్!
మూడుముళ్లతో జీవితంలోనూ కలిసి నడవాలనుకున్నారు.. తమ ప్రేమను కలకాలం నిలుపుకోవాలనుకున్నారు. అదే జరిగి ఉంటే ఇక్కడ ‘మొహబ్బతే’లో వాళ్ల గురించి ప్రస్తావన వచ్చి ఉండేది కాదు.
‘సప్తపది’ తెలుగు సినిమాను హిందీలో ‘జాగ్ ఉఠా ఇన్సాన్’గా ( దీనికీ కె. విశ్వనాథే దర్శకుడు) తీశారు. నాయికానాయకులు శ్రీదేవి, మిథున్ చక్రవర్తి. ఆ సినిమా సెట్స్ మీదే ఆ ఇద్దరికీ స్నేహం కుదిరింది. తన పని పట్ల మాత్రమే శ్రద్ధ పెట్టే శ్రీదేవి మనస్తత్వం మిథున్‌కు నచ్చింది. ఆమె మొహంలోని అమాయకత్వం అతణ్ణి ఆకర్షించింది. దాంతో ఆ స్నేహాన్ని ఆమె మీద ప్రేమగా మార్చుకున్నాడు. తనను ప్రత్యేకంగా.. కావాల్సిన వ్యక్తిగా ఆత్మీయంగా చూడసాగాడు. అతని కళ్లల్లోని ఆ ఆప్యాయత శ్రీదేవి శ్రద్ధను చెదరగొట్టింది. మనసు మిథున్ వైపు పోయేలా చేసింది. అలా వాళ్ల ప్రేమ ప్రయాణం మొదలైంది. ఇది 1984 నాటి ముచ్చట. ఆ ఇద్దరూ జంటగా బయట ఎక్కడా పెద్దగా కనిపించకపోయినా.. సోర్స్ ద్వారా పేజ్ త్రీ ఆ నిప్పు అందుకుంది.. రూమర్స్, గాసిప్స్ పొగను వదిలింది.
ఆ సమయంలోనే...
శ్రీదేవిని సైలెంట్‌గా, సీక్రేట్‌గా ఆరాధించసాగాడు నిర్మాత బోనీ కపూర్. అప్పటికే మిథున్, బోనీ మంచి ఫ్రెండ్స్. శ్రీదేవి పరిచయం నాటికే ఇటు మిథున్‌కు యోగితా బాలితో, అటు బోనీకి మోనాతో పెళ్లిళ్లయ్యాయి. రెండు జంటలూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌లోనే ఉన్నాయి.
రాఖీ
రోజులు గడుస్తున్నాయి. మిథున్, శ్రీదేవిల మధ్య అనుబంధం పెరుగుతోంది.. బంధం బలపడుతోంది. ఆమె లేకుండా అతను ఉండలేని పరిస్థితి. ‘పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాడు శ్రీదేవితో. ఆమె ఆనందానికి అవధుల్లేవు. శ్రీదేవితో తన ప్రేమను వెలిబుచ్చినప్పుడే ‘యోగితాకు విడాకులిస్తున్నాను’అనీ చెప్పాడు. అందుకే మిథున్ నోటెంట పెళ్లి ప్రస్తావన రాగానే విడాకులు మంజూరయ్యాయేమో అనుకుంది. ఇంకొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు అడిగింది శ్రీదేవి.. మిథున్‌ను ‘మీ లైఫ్‌లో రెండో స్త్రీగా ఉండలేను. విడాకులు ఎంతవరకు వచ్చాయి?’ అని. అతణ్ణించి స్పష్టమైన జవాబు రాలేదు కాని ఓ అనుమానం బయటకు వచ్చింది. బోనీకీ శ్రీదేవి అంటే ఇష్టం అన్న సంగతి మిథున్‌కి అర్థమైంది. శ్రీదేవీకీ ఆ విషయం తెలుసేమో.. తెలిసీ తేల్చట్లేదేమో అన్నదే ఆ శంక. శ్రీదేవి ముందు అనేశాడు. ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. ఆమెకు బోనీ కపూర్ కుటుంబంతో ఉన్న చనువుతో మిథున్ అనుమానాన్ని తీర్చేయాలనుకుంది. ఆ రాఖీ పౌర్ణిమ రోజు బోనీ కపూర్ వాళ్లింటికి వెళ్లి బోనీ చేతికి రాఖీ కట్టేసింది. మిథున్ చింతను దూరం చేసింది శ్రీదేవి.
ఆత్మహత్య..
ఈలోపు పేజ్ త్రీ .. మిథున్, శ్రీదేవీ రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వార్తను (అది వదంతే అని శ్రీదేవి, మిథున్ ఇద్దరూ కూడా కొట్టిపారేశారు) ప్రచారం చేసింది. ఇది యోగితాకు తెలిసి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దాంతో మిథున్ భయపడ్డాడు యోగితా ముందు విడాకుల విషయం తేవడానికి. ఇటు శ్రీదేవినీ వదులుకోదల్చుకోలేదతను. శ్రీదేవికి ఆ తాత్సారం అర్థం కాలేదు. మళ్లీ అడిగింది. ‘నేను కావాలో.. నీ భార్య కావాలో తేల్చుకో’ అని అల్టిమేటమూ ఇచ్చింది. యోగితాకు దూరమయ్యే ధైర్యం చేయలేకపోయాడు. అర్థం చేసుకుంది శ్రీదేవి. నెమ్మదిగా మిథున్ జీవితంలోంచి పక్కకు తప్పుకుంది. దాదాపు అయిదేళ్ల ఆ ప్రేమ అలా విషాదాంతమైంది. మానసిక క్షోభకు చాలానే గురైంది శ్రీదేవి. ఆ తర్వాత ఆమె కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు బోనీ కపూరే అండగా నిలబడ్డాడనీ అలా బోనీలో శ్రీదేవి ఓదార్పు వెదుక్కుందని, అతని ప్రేమను అంగీకరించి భర్తగా చేసుకుందని బోనీ, శ్రీదేవీల పెళ్లికి నేపథ్యం చెప్తారు ఇండస్ట్రీలో వాళ్లు. తాను కల కన్న పెద్ద కూతురు జాన్వీ కెరీర్ చూడకుండానే అర్థంతరంగా 54 ఏళ్లకే ఈ లోకానికి వీడ్కోలు చెప్పింది శ్రీదేవి.
మిథున్ ఇష్టాన్ని నేనేప్పుడూ కాదనలేదు. ఒకవేళ అతను రెండో పెళ్లి చేసుకొని వచ్చినా నేను ఒప్పుకునేదాన్ని.
– యోగితా బాలి (స్టార్ అండ్ స్టైల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో).
తనకు, బోనీకి మధ్య ఏమీ లేదని మిథున్‌కు నిరూపించడానికే బోనీకి రాఖీ కట్టింది శ్రీదేవి.
– బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ (సావీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో)
- ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment