PM Narendra Modi Appreciates The Kashmir Files Movie Special Story: బాలీవుడ్ దిగ్గజ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషిలు కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ సినిమాకు ప్రముఖ బీటౌన్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. ఆయన ఇదివరకూ 'ది తాష్కెంట్ ఫైల్స్' అనే సినిమాతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించడంలో వివేక్ అగ్నిహోత్రి అస్సలు వెనుకాడరు. అలా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించిందే 'ది కశ్మీర్ ఫైల్స్'.
మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు హరియానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా తమవంతు సాయంగా పన్ను రాయితీని ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. మరీ ఇంతలా ఆకట్టుకుంటున్నా 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాలో ఏముంది ? ఈ మూవీ కథేంటీ ? అనే సందేహం రాకుండా ఉండదు. ఆ సందేహం వచ్చిన ప్రేక్షకుల కోసమే 'సాక్షి' స్పెషల్ స్టోరీ.
కశ్మీర్ పండిట్‌లపై సాముహిక హత్యాకాండ..
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా కథ 1990లో కశ్మీర్ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండకు అద్దం పడుతుంది. కశ్మీర్ లోయలోని ఓ వర్గంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణ మారణ కాండకు పాల్పడ్డారు. కశ్మీరీ మహిళలను వివస్త్రలుగా చేసి, సాముహిక మానభంగానికి ఒడిగట్టారు. ఆ లోయలో ఉండాలంటే మతం మారాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. అడ్డుకున్న వారిని అడ్డుతొలగించుకుంటారు. వారి ఆస్తులను దోచుకున్నారు. ఎదురు తిరిగినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించారు.
తుపాకులు, కత్తులతో దారుణంగా దాడి చేశారు. పాకిస్తాన్ జిహాదీ మూకతో చేతులు కలిపి ఆకృత్యాలకు పాల్పడటం వారిని కలచివేసింది. ఈ దారుణమైన ఉదంతానికి పర్యవసానంగా సుమారు 5 లక్షల మంది కశ్మీరీ పండిట్‌లు స్వదేశంలోనే శరణార్థులుగా మారారు. దీంతో వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. ఢిల్లీ పురవీధుల ఫుట్‌పాత్స్‌పై ఏళ్ల తరబడి జీవితాన్ని గడిపారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి.
బాధ్యతాయుత పౌరుడిగా తీశాను..
నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేందుకు, సినిమా రూపంలో తెరకెక్కిచ్చేందుకు ఎంతో గుండె ధైర్యం ఉండాలి. వాస్తవ గాథలను చిత్రీకరిస్తున్నామని చెప్పి అనేకమంది దర్శకనిర్మాతలు వసూళ్ల కోసం కక్కుర్తితో రాజీ పడి రూపొందిస్తుంటారు. కానీ ఎలాంటి రాజీ లేకుండా తెరకెక్కించారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ‘‘కశ్మీర్‌లో 1990వ దశకంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే విషయాలను ‘కశ్మీర్ ఫైల్స్’లో చూపించాం. కశ్మీర్‌లో జరిగిన అసలు సిసలైన వాస్తవాలు బయటకు రాలేదు. అందుకే బాధ్యతాయుత పౌరుడిగా నేను ఈ సినిమా తీశాను.. నాలుగేళ్లపాటు చాలా కష్టనష్టాలు అనుభవించాను. మా చిత్రం చూసి నిజాలు తెలుసుకోండి.’’ అని హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. ‘‘గడిచిన 30 ఏళ్లల్లో ‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి కథను ఎవరూ తీయలేదు’’ అని నిర్మాత అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు.
సినిమా చూసి కంటతడి పెట్టిన మహిళ..
అయితే మన దేశంలోని కశ్మీర్ ప్రాంతంలో జరిగిన ఈ అత్యంత భయానకమైన ఘటనను వెండితెరపై ఆవిష్కరించడం అంత సులువుకాదు. దర్శకనిర్మాతలకు ఈ సినిమా రూపొందించడం నల్లేరుపై నడకల జరగలేదు. 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ఈ చిత్రాన్ని ఆపేయమని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఈ మూవీని అడ్డుకోవడానికి కోర్టులో వ్యాజ్యాలు సైతం వేశారు. ఇలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి 'ది కశ్మీర్ ఫైల్స్'ను ఉన్నది ఉన్నట్లుగా నటీనటుల సహకారంతో వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో ప్రతీ సన్నివేశం, నటీనటుల భావోద్వేగపు యాక్టింగ్ ప్రేక్షకులను కదిలించేలా ఉన్నాయని చెబుతున్నారు.
ఈ సినిమా చూసిన అనేక మంది ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయి కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెటర్ సురేష్ రైనా తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక మహిళ వివేక్ పాదాలు తాకడం, సినిమా గురించి తన భావాన్ని వ్యక్తపరుస్తూ బిగ్గరగా ఏడవడం మనం చూడొచ్చు. అనంతరం డైరెక్టర్ వివేక్, నటుడు దర్శన్ కుమార్ ఆ మహిళను ఓదార్చారు. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి డైరెక్టర్, దర్శన్ కుమార్ సైతం కంటతడి పెట్టుకున్నారు. ప్రేక్షకుల నీరాజానలు అందుకుంటున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదలు కాగా మన దేశంలో 561 థియేటర్లలో, ఓవర్సీస్‌లో 113 స్క్రీన్స్‌లలో ప్రదర్శించబడుతోంది.
Presenting #TheKashmirFiles
— Suresh Raina🇮🇳 (@ImRaina) March 11, 2022
It’s your film now. If the film touches your heart, I’d request you to raise your voice for the #RightToJustice and heal the victims of Kashmir Genocide.@vivekagnihotri @AnupamPKher @AdityaRajKaul pic.twitter.com/Gnwg0wlPKU
Comments
Please login to add a commentAdd a comment