డిస్కో డాన్సర్
ట్రెండ్ సెట్టర్
అయామ్ ఏ డిస్కో డాన్సర్.... పాట భారత దేశంలోనే కాదు మొత్తం ఆసియాలోని పెద్ద పెద్ద దేశాల్లో కూడా మార్మోగింది. సోవియెట్ యూనియన్, ఆఫ్రికా, టర్కీ.... ఏ దేశంలో అయినా ఈ సినిమా పెద్ద హిట్టే. దానికి కారణం పాటలు మాత్రమే కాదు. మిథున్ చక్రవర్తి కూడా. ప్రతిభ ఉంటే ఒక పేదవాడు కూడా పైస్థాయికి చేరుకోగలడు అని చెప్పిన ఈ కథ అందరికీ నచ్చింది. మిథున్ చక్రవర్తి 1970లలో ‘మృగయా’ సినిమా ద్వారా సినిమాల్లోకి వచ్చాడు. అంతకుముందు అతడు నక్సలైట్ ఉద్యమంలో పని చేశాడు. సొంత తమ్ముడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తనను కూడా పోలీసులు చంపేస్తారనే వార్తలందడంతో పార్టీ నుంచి బయటికొచ్చి సినిమాల్లో భవిష్యత్తు వెతుక్కున్నాడు. మృణాల్‌సేన్ మొదటి అవకాశం ఇచ్చినా దేశానికి పరిచయం కావడానికి మరో పదేళ్ల తర్వాత 1980లో ‘డిస్కో డాన్సర్’ కావాల్సి వచ్చింది.
బి.సుభాష్ దర్శకత్వం వహించిన సినిమా మనం ఈనాడు అనుకుంటున్న వంద కోట్ల క్లబ్ లాంటి కలెక్షన్లతో సమానంగా వసూలు చేసింది. నిజానికి డిస్కో డాన్సర్ మొదలయ్యే సమయానికి కథ గాని, అలాంటి ఆలోచన కాని ఏమీ లేదు. అంతకు ముందు మిథున్ నటించిన ‘వన్నీస్ బీస్’ సినిమా ఫ్లాప్ అయ్యింది. మిథున్ డిప్రెషన్‌లో ఉండటం చూసి మిత్రుడు బి.సుభాష్ నేనో సినిమా తీస్తాలే అని ధైర్యం చెప్పాడు. మిథున్ అది నిజమనుకుని వెంట పడటంతో తియ్యక తప్పలేదు. మిథున్‌కు డాన్స్ బాగా వచ్చని కనిపెట్టిన సుభాష్ అందుకు తగ్గట్టుగా స్క్రిప్ట్ రాసుకోవడంతో సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. మిథున్‌తో మరికొన్నాళ్ల తర్వాత సుభాష్ తీసిన ‘డాన్స్ డాన్స్’ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇందులో స్మితా పాటిల్ మిథున్‌కు అక్కగా నటించింది. అమితాబ్ దూసుకుపోతున్న ఆ కాలంలో ఆయనను నిలువరించడానికి చాలామంది కలిసి మిథున్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే అమితాబ్ అమితాబే మిథున్ మిథునే.
డిస్కో డాన్సర్ ఘన విజయం సౌత్ మీద పడింది. హాస్యనటుడు నగేష్ కుమారుడైన ఆనంద్‌బాబుతో ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేశారు. తెలుగులో బాలకృష్ణతో ‘డిస్కోకింగ్’ పేరుతో తీశారు. ప్రేక్షకులను తెలుగు వర్షన్ నిరాశ పరిచింది.