తొమ్మిదిన్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, నిత్యావసరాల ధరల పెంపును చూసిన దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందరూ నరేంద్ర మోడీ వైపే చూస్తున్నారని బీజేపీ నాయకుడు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు.
మొయినాబాద్, న్యూస్‌లైన్: తొమ్మిదిన్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, నిత్యావసరాల ధరల పెంపును చూసిన దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందరూ నరేంద్ర మోడీ వైపే చూస్తున్నారని బీజేపీ నాయకుడు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. మొయినాబాద్ మండలం కనకమామిడిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు క్యామ పద్మనాభం సుమారు 200 మంది కార్యకర్తలతో ఆదివారం రాత్రి నాగం జనార్దన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాగం మాట్లాడుతూ.. ప్రస్తుతం యూపీఏ ప్రభుత్వం మైనార్టీలో పడిందని, బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్రం రాదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కేవలం బీజేపీకే సాధ్యమని స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కుంభకోణాలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ అవినీతిని అంతమొందించి నీతిమంతమైన పాలన అందించే సత్తా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకే ఉందన్నారు. అందుకే దేశంలోని 80 శాతం మంది నరేంద్ర మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారన్నారు. బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని రక్షించాలంటే అభినవ సర్దార్ నరేంద్ర మోడీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు.
గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్‌పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటీవలే మోడీ శంకుస్థాపన చేశారని, దేశంలోని ప్రతి గ్రామం నుంచి ఆ విగ్రహానికి ఇనుప ముక్కలు పంపించాలన్నారు. ఇనుపముక్కలు సేకరించే కార్యక్రమం వచ్చే నెలనుంచి ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి కంజర్ల ప్రకాష్, మండల అధ్యక్షుడు గున్నాల గోపాల్‌రెడ్డి, శ్రీరాంనగర్ సర్పంచ్ ఎస్.ప్రభాకర్‌రెడ్డి, నాయకులు జంగారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మగ్బుల్, నర్సింహ్మరెడ్డి, మోహన్‌రెడ్డి, మల్లేష్, రాంరెడ్డి పాల్గొన్నారు.