
సాక్షి, చెన్నై/ న్యూఢిల్లీ: సినీ నటి కుష్బూ సుందర్ సోమవారం బీజేపీలో చేరారు. పార్టీ ప్రతినిధిగా ఉన్న కుష్బూను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించిన కొద్దిసేపటికే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కుష్బూ వెల్లడించారు. తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ సోనియాకు పంపించారు. పార్టీలోని కొందరు తనను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం బీజేపీ ప్రధాన కార్యదర్శి రవి, పార్టీ తమిళనాడు అధ్యక్షుడు మురుగన్ నేతృత్వంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
అనంతరం బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. తనకు బీజేపీ నాయకత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేపట్టేందుకు సిద్ధమని కుష్బూ అన్నారు. కుష్బూతోపాటు జర్నలిస్ట్ మదన్ రవిచంద్రన్, ఐఆర్‌ఎస్ మాజీ అధికారి శరవణన్ కుమరన్ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఏడాదిలోనే తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కుష్బూ వంటి వారి చేరికతో కాషాయ దళానికి కలిసి వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. కుష్బూ 2014లో డీఎంకే నుంచి కాంగ్రెస్‌లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment