సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కుష్బూ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతోందంటూ ఆమెను తొలుత జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి అధిష్టానం తొలగించింది. అనంతరం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కుష్బూ ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సోమవారం మధ్యాహ్నం ఆమె కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. దీనికోసం ఆదివారం రాత్రినే హస్తినకు చేరుకోని బీజేపీ పెద్దలతో మంతనాలు సైతం చేశారు. వారి ఆహ్వానం మేరకే పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.
2010లో అప్పటి అధికార పార్టీ డీఎంకేలో చేరిన కుష్బూ 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గూటికి చేరారు. రాష్ట్రంలో, కేంద్రంలోనూ అధికారానికి దూరంగా ఉండటంతో ఆమెకు ఎలాంటి పదవీ దక్కలేదు. ఈ క్రమంలోనే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుపట్టారు. కానీ డీఎంకే-కాంగ్రెస్ పొత్తు నేపథ్యంలో సీట్లు సర్దుబాటు కారణంగా ఆమెకు ఎంపీ టికెట్ దక్కలేదు. అయితే ఆ తరువాత రాజ్యసభకు పంపుతామని అనేకసార్లు హామీ ఇచ్చినప్పటికీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. పురుషాధిక్యత కలిగిన కాంగ్రెస్‌లో ఆత్మాభిమానం మెండుగా కలిగిన కుష్బూ పార్టీలో ఇమడలేని పరిస్థితులు చుట్టుముట్టాయి. అధిష్టానంలో రాహుల్‌గాంధీ ఆశీస్సులు ఉన్నా గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ పొందలేక పోటీచేయలేక పోయారు. కాంగ్రెస్, డీఎంకే కూటమిగా కొనసాగడం, గతంలో డీఎంకేతో విభేదించి కాంగ్రెస్‌లో చేరడం వల్లనే డీఎంకే ముఖ్యనేత ఒకరు కుష్బూకు అడ్డుతగిలినట్లు సమాచారం.
దీంతో తీవ్ర మనస్థాపం చెందిన కుష్బు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు ఆమె అనుచరుల ద్వారా తెలిసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంపై సైతం ప్రశంసలు కురిపించారు. మోదీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. అయితే రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బలంచాటుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న కమళం పార్టీ సినీ నటులను పార్టీలో చేర్చుకోవాలని తొలినుంచీ భావిస్తోంది. దీనిలో భాగంగానే సూపర్ స్టార్ రజనీకాంత్‌ను సైతం ఇదివరకే బీజేపీలోకి ఆహ్వానించింది. దీని కొరకు ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న కుష్బూను చేర్చుకోవాలని తహతహలాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment