సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యూపీ కాంగ్రెస్‌లో కీలక నాయకుడు, రాహుల్ గాంధీకి సన్నిహితుడైన జితిన్ ప్రసాద కమలదళంలో చేరిపోయారు. బుధవారం ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ జితిన్ ప్రసాదకు పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను వారి నివాసాల్లో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. జాతీయ పార్టీ అంటూ దేశంలో ఏదైనా పార్టీ ఉంటే అది కేవలం బీజేపీ ఒక్కటేనని, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ మాత్రమే దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న పార్టీ అని జితిన్ ప్రసాద వ్యాఖ్యానించారు.
నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం
కాషాయ కండువా కప్పుకున్న తరువాత జితిన్ ప్రసాద మీడియాతో మాట్లాడుతూ ‘బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర నాయకులందరికీ కృతజ్ఞతలు. ఈ రోజు నా రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మూడు తరాలుగా కాంగ్రెస్‌తో మా అనుబంధం కొనసాగుతోంది. ఈ ముఖ్యమైన నిర్ణయం కూలంకషంగా చర్చించిన తర్వాత తీసుకున్నా. నేను ఏ పార్టీని వీడుతున్నానన్నది ప్రశ్న కాదు. నేను ఏ పార్టీకి వెళుతున్నాను, ఎందుకు వెళ్తున్నాననేది అసలు ప్రశ్న. ఈ రోజు దేశంలో నిజమైన రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీయే అని కొన్నేళ్లుగా అందరూ భావించే పరిస్థితి ఏర్పడింది’ అని అన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో కీలకనేత
యూపీ రాజకీయాల్లో, రాహుల్ కోటరీలో కీలకనేత జితిన్ ప్రసాద. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. కానీ అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్‌పైనే పోటీ చేసి ఓడిపోయారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రిగా పనిచేసిన ఆయన పార్టీ బాధ్యతల్లోనూ కీలకంగా పనిచేశారు. అయితే యూపీ ఇన్‌చార్జ్‌గా ప్రియాంక గాంధీ వచ్చిన తరువాత జితిన్ ప్రసాదను పక్కన పెట్టారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. జ్యోతిరాదిత్య సిందియా తర్వాత కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరిన రాహుల్ సన్నిహితుల్లో రెండో నాయకుడు జితిన్. పశ్చిమ యూపీలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జితిన్ ప్రసాద రాకతో ఆ ప్రాంతంలో బీజేపీ బలం పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీజేపీలోకి జితిన్ ప్రసాద
Published Thu, Jun 10 2021 6:31 AM | Last Updated on Thu, Jun 10 2021 6:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment