రాంచీ : లోక్‌సభ ఎన్నికలకు జార్ఖండ్‌లో మహాకూటమి పార్టీలు సీట్ల సర్ధుబాటును ప్రకటించిన మరుసటి రోజే కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీ రాష్ట్ర శాఖ చీఫ్ అన్నపూర్ణదేవి పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సంసిద్ధమయ్యారు. జార్ఖండ్‌లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటును ఆదివారం పార్టీ నేతలు ప్రకటించారు. కాంగ్రెస్, జేఎంఎం, జేవీఎంలు వరసగా ఏడు, నాలుగు, రెండు స్ధానాల్లో పోటీ చేయనుండగా, ఆర్జేడీకి ఒక స్ధానం కేటాయించారు.
సీట్ల సర్ధుబాటును ప్రకటించిన మరుసటి రోజే సోమవారం ఆర్జేడీ జార్ఖండ్ చీఫ్ అన్నపూర్ణదేవి సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లడం కలకలం రేపింది. దేశ రాజధానిలో ఆమె బీజేపీ అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది. కాగా ఆదివారం రాత్రి జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్, ఇతర బీజేపీ నేతలతో అన్నపూర్ణదేవి భేటీ కావడంతో ఆమెను పార్టీ నుంచి ఆర్జేడీ సస్పెండ్ చేసింది. మరోవైపు చత్ర లేదా కొడెర్మా స్ధానాల్లో ఏదో ఒక చోట నుంచి ఆమెను బీజేపీ బరిలో దింపుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment