పట్నా: దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) దానికి కారణాలను అన్వేషిస్తోంది. మొత్తం 17 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపిన ఆర్జేడీ కనీసం ఒక్కస్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. పార్టీ చరిత్రలో గడిచిన ఇరవై ఏళ్లలో ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి. దీంతో ఆర్జేడీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలావుండగా ఇంత ఘోరమైన ఫలితాలు రావడానికి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమే అని ఆపార్టీలో ఓవర్గం నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీచగా.. అది బిహార్‌లోనూ ప్రభావం చూపిందని విశ్లేషిస్తున్నారు. మరో రెండేళ్లలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కీలక నిర్ణయాలు తీసుకోకపోతే రాణించలేమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో బంధాన్ని తెంచుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి విజయం సాధించినప్పటికీ.. సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. తాజాగా ఫలితాలపై మాజీ మంత్రి జగ్ధానంద్ మాట్లాడుతూ.. గత ఏడాది జరిగిన ఆరారియా ఉప ఎన్నికల్లో ఆర్జేడీ అద్బుత విజయాన్ని సొంతం చేసుకుందని.. కాంగ్రెస్‌తో సరైన అవగనహన లేకపోవడం కారణంగానే ఈసారి ఓటమి చెందాని అసహనం వ్యక్తం చేశారు. సొంతంగానే 11-12 సీట్లు సాధించే సత్తా కలిగి ఉన్న తమ పార్టీకి ఇంత ఘోరమైన ఫలితాలు ఎన్నడూ రాలేదని, ఈవీఎంల్లో అక్రమాలను కొట్టి పారేయలేమని చెప్పారు. కాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించేందుకు ఈనెల 28న తేజస్వీ నేతృత్వంలోని ఆపార్టీ భేటీ కానుంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌తో కటీఫ్ చేప్పాలని ఆపార్టీ నేతలు చేస్తున్న డిమాండ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment