లక్నో: డాక్టర్ ప్రియాంక మౌర్య... యూపీలో ప్రియాంకా గాంధీ వాద్రా రూపొందించిన ‘నేను అమ్మాయిని... పోరాడగలను’ నినాదపు గొంతుక. యూపీలో మహిళా సాధికారతకు ముఖచిత్రం. ప్రియాంకా గాంధీకి కుడిభుజంగా మెలిగిన ఆమె... గురువారం బీజేపీలో చేరారు. ఎన్నికల నేపథ్యంలో యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ.
ప్రియాంక మౌర్య... హోమియోపతి డాక్టర్. సామాజిక ఉద్యమకారిణి. అజాంగఢ్‌లో పుట్టి పెరిగారు. గ్వాలియర్ యూనివర్సిటీలో ఉన్నతవిద్యనభ్యసించారు. 2008లో స్పైస్‌జెట్‌లో చేరి ఎగ్జిక్యూటివ్‌గా రెండేళ్లపాటు పనిచేశారు. 2012లో తిరిగి డాక్టర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అది మొదలు... ‘నేకీ కి దివార్’, ‘రోటీ బ్యాంక్’ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. కరోనా పాండమిక్ సమయంలోనూ సేవకుగాను పలు అవార్డులు సైతం అందుకున్నారు.
2020 డిసెంబర్‌లో ఆమె కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఆ తరువాత 2021 నవంబర్‌లో పార్టీ ఆమెను మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. ప్రియాంక మౌర్య... మంచి వక్త. తన మాటలతో యువతను ఇట్టే ఆకట్టుకునే గుణం. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. లక్షల మంది అభిమానులున్నారు. ఐదు కోట్ల మంది మహిళా ఓటర్లున్న యూపీ రాజకీయాల్లో వారి పాత్ర కీలకం. దాంతో ప్రియాంక గాంధీ... . 2021 డిసెంబర్ 8న మహిళా మేనిఫెస్టో ‘శక్తి విధాన్’ను విడుదల చేశారు.
మహిళా సాధికారతకు గుర్తుగా ‘మై లడకీ హూ... లడ్ సక్తీ హూ’ స్లోగన్‌కు ప్రియాంక మౌర్యను ప్రచారకర్తగా ఎంచుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తూనే... లక్నోలోని సరోజిని నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రియాంకమౌర్య సీట్ ఆశించారు. అందుకనుగుణంగానే తన కార్యకలాపాలను విస్తరించారు. తీరా సీట్ల కేటాయింపుల్లో కాంగ్రెస్‌పార్టీ ప్రియాంకను పక్కన పెట్టింది. ఆమె పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ సీటును రుద్రదామన్ సింగ్‌కు కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ప్రియాంక బీజేపీలో చేరారు.
కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ
‘‘నా నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందనుకున్నాను. కానీ కాంగ్రెస్‌పార్టీ మోసం చేసింది. వాళ్లు ముందే అనుకున్నట్టుగా మరో వ్యక్తికి సీటిచ్చారు. మహిళలు, మౌర్య, కుష్వాహ, శాక్య, సైనీ కులాల ఓట్లను రాబట్టుకోవడానికి నన్ను వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంకోసం నన్ను, సోషల్‌మీడియాలో నాకున్న లక్షల మంది అభిమానులను ఉపయోగించుకున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందినదాన్ని, లంచం ఇవ్వలేను కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ.
‘లడకీ హూ... లడ్ సక్తీ హూ’ అనే నినాదమిచ్చారు. నినాదాలు, మాటలతోనే పనవ్వదు. అవకాశాలు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోరాడటానికి నాకు అవకాశమే ఇవ్వలేదు. ప్రియాంకగాంధీతో సైతం నేను పోరాడగలను అని ఇప్పుడు నిరూపించుకుంటాను. శక్తి, సమయం వెచ్చించి నేను పనిచేసిన ఆ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టే బీజేపీలో చేరాను. నేను హోమియోపతి డాక్టర్‌ను... తీయటి మందులివ్వడమే కాదు.. తీయగా మాట్లాడటమూ వచ్చు. ఇప్పుడా పని బీజేపీ కోసం చేస్తాను. నిత్యం సమాజ సేవలోనే ఉంటా.’’
Comments
Please login to add a commentAdd a comment