ముంబై : రిజర్వేషన్లను ఎత్తివేయాలన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ మండిపడ్డారు. ఆయనది రాజ్యాంగ వ్యతిరేక మనస్తత్వమని విమర్శించారు. ఆదివారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కొందరు రాజ్యాంగ స్వరూపం గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో రాజ్యాంగంపై అందరికీ అవగాహన అత్యవసరం’’ అని రాహుల్‌ను ఉద్దేశించి అన్నారు.
‘‘రాజ్యాంగమున్నది డాంబికంగా ప్రదర్శించడానికి కాదు. దాన్ని గౌరవించాలి. అధ్యయనం చేయాలి. అర్థం చేసుకోవాలి. బాధ్యత కలిగిన, తెలివున్న, రాజ్యాంగాన్ని గౌరవించే ఏ వ్యక్తీ ఇలా ప్రవర్తించరు’’ అంటూ రాహుల్‌పై నిప్పులు చెరిగారు. ఇటువంటి దుస్సాహాలను తిప్పికొట్టాలని యువతకు పిలుపునిచ్చారు. ‘‘రాజ్యాంగ పదవిలో వ్యక్తి రిజర్వేషన్లను ఎత్తేయాలని విదేశీ గడ్డపై మాట్లాడటం రాజ్యాంగ వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం. ఇలాంటి రిజర్వేషన్ల వ్యతిరేక వైఖరి బహుశా ఆయనకు వారసత్వంగా అబ్బింది’’ అంటూ దుయ్యబట్టారు. రిజర్వేషన్లున్నది సమాజానికి మూలస్తంభాల్లాంటి సామాజిక వర్గాలకు చేయూతనిచ్చేందుకేనని ధన్‌ఖడ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment