poster girl
-
బీజేపీలో చేరిన యూపీ కాంగ్రెస్ పోస్టర్‌గాళ్
లక్నో: డాక్టర్ ప్రియాంక మౌర్య... యూపీలో ప్రియాంకా గాంధీ వాద్రా రూపొందించిన ‘నేను అమ్మాయిని... పోరాడగలను’ నినాదపు గొంతుక. యూపీలో మహిళా సాధికారతకు ముఖచిత్రం. ప్రియాంకా గాంధీకి కుడిభుజంగా మెలిగిన ఆమె... గురువారం బీజేపీలో చేరారు. ఎన్నికల నేపథ్యంలో యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ. ప్రియాంక మౌర్య... హోమియోపతి డాక్టర్. సామాజిక ఉద్యమకారిణి. అజాంగఢ్‌లో పుట్టి పెరిగారు. గ్వాలియర్ యూనివర్సిటీలో ఉన్నతవిద్యనభ్యసించారు. 2008లో స్పైస్‌జెట్‌లో చేరి ఎగ్జిక్యూటివ్‌గా రెండేళ్లపాటు పనిచేశారు. 2012లో తిరిగి డాక్టర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అది మొదలు... ‘నేకీ కి దివార్’, ‘రోటీ బ్యాంక్’ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. కరోనా పాండమిక్ సమయంలోనూ సేవకుగాను పలు అవార్డులు సైతం అందుకున్నారు. 2020 డిసెంబర్లో ఆమె కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఆ తరువాత 2021 నవంబర్‌లో పార్టీ ఆమెను మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. ప్రియాంక మౌర్య... మంచి వక్త. తన మాటలతో యువతను ఇట్టే ఆకట్టుకునే గుణం. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. లక్షల మంది అభిమానులున్నారు. ఐదు కోట్ల మంది మహిళా ఓటర్లున్న యూపీ రాజకీయాల్లో వారి పాత్ర కీలకం. దాంతో ప్రియాంక గాంధీ... . 2021 డిసెంబర్ 8న మహిళా మేనిఫెస్టో ‘శక్తి విధాన్’ను విడుదల చేశారు. మహిళా సాధికారతకు గుర్తుగా ‘మై లడకీ హూ... లడ్ సక్తీ హూ’ స్లోగన్‌కు ప్రియాంక మౌర్యను ప్రచారకర్తగా ఎంచుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తూనే... లక్నోలోని సరోజిని నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రియాంకమౌర్య సీట్ ఆశించారు. అందుకనుగుణంగానే తన కార్యకలాపాలను విస్తరించారు. తీరా సీట్ల కేటాయింపుల్లో కాంగ్రెస్‌పార్టీ ప్రియాంకను పక్కన పెట్టింది. ఆమె పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ సీటును రుద్రదామన్ సింగ్‌కు కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ప్రియాంక బీజేపీలో చేరారు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ ‘‘నా నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందనుకున్నాను. కానీ కాంగ్రెస్‌పార్టీ మోసం చేసింది. వాళ్లు ముందే అనుకున్నట్టుగా మరో వ్యక్తికి సీటిచ్చారు. మహిళలు, మౌర్య, కుష్వాహ, శాక్య, సైనీ కులాల ఓట్లను రాబట్టుకోవడానికి నన్ను వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంకోసం నన్ను, సోషల్‌మీడియాలో నాకున్న లక్షల మంది అభిమానులను ఉపయోగించుకున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందినదాన్ని, లంచం ఇవ్వలేను కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ. ‘లడకీ హూ... లడ్ సక్తీ హూ’ అనే నినాదమిచ్చారు. నినాదాలు, మాటలతోనే పనవ్వదు. అవకాశాలు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోరాడటానికి నాకు అవకాశమే ఇవ్వలేదు. ప్రియాంకగాంధీతో సైతం నేను పోరాడగలను అని ఇప్పుడు నిరూపించుకుంటాను. శక్తి, సమయం వెచ్చించి నేను పనిచేసిన ఆ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టే బీజేపీలో చేరాను. నేను హోమియోపతి డాక్టర్‌ను... తీయటి మందులివ్వడమే కాదు.. తీయగా మాట్లాడటమూ వచ్చు. ఇప్పుడా పని బీజేపీ కోసం చేస్తాను. నిత్యం సమాజ సేవలోనే ఉంటా.’’ -
'ఆ రాక్షసికి తల్లయినందుకు బాధగా ఉంది'
'నాకో రాక్షసి పుట్టింది... జిహాదీతో ఆమె పెళ్లి ఆపేందుకు చైన్లతో కట్టేసి కూడ ప్రయత్నించాను. కానీ ఆపలేకపోయాను. చివరికి ఆమె అనుకున్నట్టుగానే సిరియా చేరిపోయింది' అంటూ ఐసిస్ పోస్టర్ గర్ల్ తల్లి తీవ్ర ఆవేదన చెందుతోంది. ఇరవై ఏళ్ళ ఫాతిమా ధర్ఫరోవా సిరియా ప్రయాణాన్ని ఆపేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని చెప్పింది. ఫాతిమా సోషల్ మీడియాలో ఐఎస్ఐఎస్ కు మద్దతుగా పోస్టులు చేసేదని తల్లి శాఖ్లా బోఖరోవా వెల్లడించింది. పారిస్ లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులను, రష్యన్ పర్యాటక విమానం కూల్చిన వారిని ఫాతిమా కీర్తించడం రష్యన్లకు ఆగ్రహం తెప్పించిందని, అతివాద ఇస్లామిక్ నియామకుడి ఆకర్షణలో పడి, నాలుగో భార్యగా మారిన కూతురి పై ఆ తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ తల్లీ ఇటువంటి రాక్షసులకు జన్మనివ్వాలని అనుకోదని, నిజంగా ఇటువంటి భూతానికి తల్లినైనందుకు చింతిస్తున్నానని బొఖరోవా అంది. ఒక ఉగ్రవాదికి తల్లిగా జీవించడం కంటే మరణించడం మేలని ఆవేదన వ్యక్తం చేసింది. 2014 లో సిరియాకు చేరిన 17 ఏళ్ళ సామ్రా కేసినోవిక్, ఆమె స్నేహితురాలు సబీనా సెలిమోవిక్ ఐఎస్ఐఎస్ పోస్టర్ గర్ల్స్ గా మారారు. ఆ తర్వాత జిహాదీల చేతిలో తీవ్రంగా హింసకు గురై హతమయ్యారు. ఇప్పుడు తన కూతురికీ అదే దుస్థితి దాపురిస్తుందని ఆ తల్లి తీవ్రంగా రోదిస్తోంది. ఫాతిమా చిన్నతనం నుంచి తనతో ఎంతో సన్నిహితంగా, ప్రేమగా ఉండేదని చెప్పింది. అయితే సైబీరియా విశ్వవిద్యాలయానికి వెళ్ళిన తర్వాతే ఆమెలో ఎంతో మార్పు వచ్చిందని, సిరియా పారిపోయిన తన పెద్ద కూతుర్ని తిరిగి చూడగలనా అంటూ శాఖ్లా బోఖరోవా ఆవేదన చెందుతోంది. 'అక్కడ ఫాతిమా నిజంగానే ఓ రిక్రూటర్ గా ఉంటే... తూటాలకు బలవ్వక తప్పదు. ఉగ్రవాదులు ఆమెను ఎప్పటికీ వదిలి పెట్టరు. ఆమె జీవితం ఇలా మారిపోతుందని ఎప్పుడూ ఊహించలేదు. యూనివర్శిటీకి వెళ్ళిన తర్వాతే ఫాతిమాలో పూర్తిగా మార్పు చోటు చేసుకుంది. కనీసం కుటుంబంతో కలసి పండుగ చేసుకోవడానికి కూడ నిరాకరించేది. ఆమెలో రోజురోజుకూ వచ్చిన మార్పు చివరికి జిహాదీల వద్దకు చేర్చింది' అంటూ ఫాతిమా తల్లి రోదించింది. 'ఓసారి అబ్దుల్లా మా కుమార్తెను పెళ్ఙ చేసుకుంటానని పర్మిషన్ అడిగాడు. అప్పటికే ముగ్గురు భార్యలున్నారని, ఒక్కొక్కరికీ ముగ్గురు చొప్పున పిల్లలు కూడ ఉన్నారని చెప్పాడు. దాంతో నేను అస్సలు ఒప్పుకోలేదు. ఫాతిమా తనను ప్రేమిస్తోందని, తాను కూడ ఫాతిమాను ఇష్టపడ్డానని అబ్దుల్లా చెప్పాడు. నా కూతురితో మాట్లాడి ఆమె పెళ్లి నిర్ణయాన్ని మార్చాలని ఎంతో ప్రయత్నించాను. ఆమె ఉగ్రవాది కాకుండా కాపాడేందుకు ప్రయత్నించినా నా మాట వినలేదు. ఇక నా కూతుర్ని ఈ జన్మలో చూడలేను' అంటూ ఫాతిమా తల్లి కన్నీరుమున్నీరయ్యింది. -
ఐఎస్ఐఎస్ 'పోస్టర్ గర్ల్'ను చంపేశారు!
లండన్: ఐఎస్ఐఎస్ 'పోస్టర్ గర్ల్'గా పేరొందిన 17 ఏళ్ల సమ్రా కెసినోవిక్ను ఆ ఉగ్రవాద గ్రూపే హతమార్చినట్టు తెలుస్తున్నది. సమ్రా కెసినోవిక్ గత ఏడాది ఆస్ట్రియా రాజధాని వియాన్నాలోని తన ఇంటి నుంచి పారిపోయి.. స్నేహితురాలు సబినా సెలిమోవిక్ (15)తో కలిసి సిరియా వచ్చింది. అక్కడ ఐఎస్ఎఐస్లో చేరి.. ఆ గ్రూపు సాయుధులతో కలిసి ఫొటోలు దిగింది. కలాష్నికోవ్ తుపాకులు పట్టుకొని ఆమె దిగిన ఫొటోలు సోషల్ మీడియా వెబ్సైట్లో హల్చల్ చేశాయి. కొంతకాలానికే సమ్రా ఐఎస్ఐఎస్ గ్రూప్ ప్రతినిధిగా సోషల్ మీడియాలో ప్రచారమైంది. అయితే ఐఎస్ఐఎస్ అరాచకాలతో విసిగిపోయిన సమ్రా గ్రూపు నుంచి తప్పించుకొని తిరిగి ఇంటికి వచ్చేందుకు ప్రయత్నించిందని, దీంతో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే ఆమెను చంపేశారని ఆస్ట్రియా మీడియా సంస్థలు తెలిపాయి. ఐఎస్ఐఎస్ ప్రాబల్య ప్రాంతమైన రఖ్కాలో ఆ గ్రూపు చేస్తున్న బహిరంగ హత్యలను చూసి బెదిరిపోయిన సమ్రా తప్పించుకోవడానికి ప్రయత్నించిందని, దీంతో ఉగ్రవాదులు ఆమెను పట్టుకొని హత్య చేశారని తమ కథనాల్లో పేర్కొన్నాయి. సమ్రా లాగే ట్యూనిషియా నుంచి పారిపోయి ఐఎస్ఐఎస్లో చేరిన ఓ మహిళ ఈ వివరాలు తెలిపిందని, ఐఎస్ఐఎస్లో సమ్రాతోపాటు పనిచేసిన ఆ మహిళ తర్వాత ఆ గ్రూపు నుంచి తప్పించుకొని ఇంటికి చేరిందని తెలిపాయి.