ఫైల్ ఫోటో
అంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు టీమిండియా ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించి మైదానంలోకి దిగారు. కేంద్ర మాజీ మంత్రి, మాజీ డీడీసీఏ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ మరణానికి సంతాపంగా ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. కేంద్ర మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు చేసిన జైట్లీకి క్రికెట్‌తోనూ మంచి అనుబంధం ఉంది.
ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం(1999-2013) పని చేసిన జైట్లీ.. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా తన సేవలందించారు. ఢిల్లీ క్రికెట్ అభివృద్ధికి కృషి చేశారు. ఆటగాళ్ల సమస్యలను, వారికి మౌలిక వసతులను కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు. జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఢిల్లీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, తదితరులు టీమిండియా తరుపున ఆడారు. ఇప్పటికే అరుణ్ జైట్లీ మృతి పట్ల తాజా, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment