సచిన్ టెండుల్కర్ (PC: BCCI)
సచిన్ టెండుల్కర్.. ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అరుదైన ఘనతలెన్నో సాధించి క్రికెట్ దేవుడిగా నేటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు. నభూతో న భవిష్యతి అన్న రీతిలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా వంద సెంచరీలు సాధించి శిఖరాగ్రాన నిలిచాడు.
అయితే, సచిన్ వ్యక్తిగతంగా లెక్కకు మిక్కిలి రికార్డులు కొల్లగొట్టినా ఒక్కటంటే ఒక్క వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడటానికి 22 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తాను భాగమైన భారత జట్టు 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడంతో సచిన్ టెండుల్కర్ చిరకాల కల నెరవేరింది.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సచిన్ టెండుల్కర్ అప్పట్లో తనలో స్ఫూర్తిని నింపాడంటూ తాజాగా గుర్తుచేసుకున్నాడు.. నాటి అరంగేట్ర, ‘యువ’ బౌలర్. ‘‘ఆరోజు మేము వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నాం. వికెట్ ఫ్లాట్‌గా ఉంది. వెస్టిండీస్ స్కోరు అప్పటి బహుశా 500/4 అనుకుంటా.
నాలో.. వికెట్ తీయలేకపోతున్నాననే అసహనం పెరిగిపోతోంది. అప్పటికి నా వయసు 21 ఏళ్లు. ఇరవై ఒక్క ఓవర్ల పాటు వికెట్ తీయలేకపోవడం అదే మొదటిసారి.
ఆ సమయంలో సచిన్ టెండుల్కర్ మిడాఫ్‌లో తన ఫీల్డింగ్ పొజిషన్‌లో నిలబడి ఉన్నాడు. నన్ను చూసి... ‘ఏమైంది అలా ఉన్నావు? ఎందుకంత నిరాశ?’ అని అడిగాడు.
అందుకు బదులిస్తూ.. ‘పాజజీ.. నా బౌలింగ్‌లో ఇప్పటివరకు 21 ఓవర్లు అయినా వికెట్ తీయకపోవడం ఇదే తొలిసారి తెలుసా?.. అలాంటిది అరంగేట్రంలో ఇలా జరుగుతుందని అనుకోలేదు’ అని వాపోయాను.
అప్పుడు వెంటనే.. ఓవర్ మధ్యలోనే.. నన్ను తన దగ్గరికి రమ్మని పిలిచి.. ‘నీకు తెలుసా.. నేను తొలి వరల్డ్‌కప్ అందుకోవడానికి 22 ఏళ్ల పాటు ఎదురుచూశాను. మరి నువ్వు నీ తొలి వికెట్ కోసం కనీసం 21 ఓవర్లపాటు వెయిట్ చేయలేవా?
అంతగా నిరాశపడొద్దు. గతంలో ఏం జరిగిందన్నది అప్రస్తుతం. ఇప్పుడు ఏం చేయగలవో ఆలోచించు’ అన్నాడు. అవును.. కదా పాజీ చెప్పింది నిజమే కదా అనిపించింది.
ఆ మరుసటి బంతికే నేను డారెన్ బ్రావో(166)ను అవుట్ చేసి తొలి వికెట్ అందుకున్నా. ఆ తర్వాత కార్ల్‌టన్, డారెన్ సామీ వికెట్లు తీశాను. నా అరంగేట్రం అలా ప్రత్యేకంగా మారిపోయింది’’ అని హర్షం వ్యక్తం చేశాడు.
ఈ మేరకు.. బీసీసీఐ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలు పంచుకుంటూ.. మన ఆలోచనా విధానాన్ని, అంతకు ముందున్న పరిస్థితులను మార్చడానికి ఒక్క మాట చాలని తనకు ఆరోజు తెలిసిందన్నాడు. సచిన్ టెండుల్కర్ చెప్పిన ఆ స్పూర్తిదాయక మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని పేర్కొన్నాడు. ఇంతకీ ఆ బౌలర్ పేరు చెప్పలేదు కదూ!
వరుణ్ ఆరోన్.. జంషెడ్‌పూర్‌కు చెందిన 34 ఏళ్ల రైటార్మ్ పేసర్. 2011లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 9 టెస్టులు, 9 వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 18, 11 వికెట్లు తీశాడు.
చదవండి: IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే..
Comments
Please login to add a commentAdd a comment