
ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్ బడ్జెట్ సెషన్‌కు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ‍్యంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 13వరకు కొనసాగుతాయి. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
మధ్యంతర బడ్జెట్ ఎందుకు?
ఎన్నికల సంవత్సరంలో ఏ ప్రభుత్వమైనా పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టదు. అందుకే ఈ సారి పార్లమెంట్ ఉభయసభల్లో మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి జైట్లీ ప్రవేశపెడతారు. అయితే మధ్యంతర బడ్జెట్ కూడా దాదాపు ఫుల్ బడ్జెట్‌లాగానే ఉంటుంది. ప్రస్తుత ఏడాది లెక్కలు, పద్దులతోపాటు, రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో మధ్యంతర బడ్జెట్‌లో వివరిస్తారు.
కాగా 2019 ఎన్నికల్లో కూడా అధికారాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఇది ఆరవది.. చివరి బడ్జెట్. ఈ ఏడాది ఏప్రిల్-మేలో ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రం వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు భారీ కసరత్తే చేస్తోంది. ఇప్పటికే చాలా కీలకమైన ప్రస్తుత బడ్జెట్ తాయిలాలపై కసరత్తును జైట్లీ ప్రారంభించారు. ఇందులో భాగంగా రహదారులు, ఉక్కు, రైల్వే, పవర్, పట్టణాభివృద్ధి లాంటి వివిధ మంత్రిత్వ శాఖలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈసారి కేంద్రం ఎలాంటి వరాలు కురిపించనుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment