సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్రమాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతితో బీజేపీ శ్రేణులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ ఆగస్ట్ 9న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి.. చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. న్యాయవాది వృత్తిలో దిట్టగా పేరొందిన జైట్లీ అనేక సందర్భాల్లో బీజేపీకి న్యాయ సలహాదారుడిగా వ్యవహరించారు. ముఖ్యంగా తొలిసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహించారు. ఆయన మృతిపట్ల బీజేపీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని నరేంద్రమోదీకి నమ్మిన బంటు..
విపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షాలను ముప్పతిప్పలు పెట్టగల సమర్థమైన నాయకుడు అరుణ్ జైట్లీ. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా అందరికి సుపరిచితులైన జైట్లీ.. కీలకమైన అనేక కేసులను వాదించిన చరిత్ర గల న్యాయకోవిదుడు. బీజేపీలో అత్యంత కీలకమైన నాయకుల్లో ఒకరైన అరుణ్ జైట్లీ.. మోదీ ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వర్తించారు. ప్రధాని నరేంద్ర మోదీకి నమ్మిన బంటు. మోదీ కేబినెట్‌లో అత్యంత కీలకమైన శాఖలు చేపట్టిన సమర్థుడైన నేత. న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. కేంద్రమంత్రి, రాజ్యసభ ప్రతిపక్షనేత, క్యాబినెట్ హోదా వంటి అనేక అత్యున్నత పదవులను అధిరోహించారు.
1991లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జైట్లీ.. అనతికాలంలోనే బీజేపీలో ముఖ్యనేతగా ఎదిగారు. మాజీ ప్రధాని వాజపేయి మంత్రివర్గంలో తొలిసారి కేంద్రమంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీకి న్యాయవాద వృత్తిలో విశేష అనుభవం ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో జైట్లీ తొలుత రక్షణ శాఖ, ఆ తరువాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.
ఎన్నికల్లో ఓటమితో రాజ్యసభ నుంచి ప్రాతినిథ్యం వ్యవహించారు. కేంద్రమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షాలపై విమర్శనాస్ర్తాలు సంధించడంలో జైట్లీ దిట్ట. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా విశేష అనుభవం ఉండడంతో పార్టీ లీగల్ సెల్‌కు వ్యూహకర్తగా కూడా వ్యవహరించారు. 2009 నుంచి 2014 మధ్య కాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను జైట్లీ సమర్థవంతంగా పోషించారు. విపక్ష హోదాలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ఇరకాటం పెట్టడంలో జైట్లీ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఎదిగారు. ప్రత్యర్థిపై వ్యూహాలు రచించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన జైట్లీ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.
రాజకీయ ప్రస్థానం..
విద్యార్థి దశలోనే అరుణ్ జైట్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అనేక పోరాటాలకు ఆయన నాయకత్వం వహించారు. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ) లో చేరారు. న్యాయవాదిగా అనుభవం ఉండటంతో మాజీ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ హయంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో తొలిసారి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సమాచార శాఖమంత్రిగా ఆయన సేవలందించారు. పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు.
2014 సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి పోటీపడి.. కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్‌కు చైర్మన్‌కు ఉన్న సమయంలో జైట్లీ అవినీతికి పాల్పడ్డారంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు అప్పట్లో పెద్ద దుమారం చెలరేగాయి. దీంతో కేజ్రీవాల్‌పై జైట్లీ ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావావేసి కోర్టుముందు నిల్చోబెట్టారు.. ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచ్చర్‌పై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేసి సంచలనం సృష్టించారు. కొచ్చర్ వీడియోకాన్ సంస్థకు అక్రమంగా నిధులను మళ్లించారని జైట్లీ ఆరోపించారు.
కుటుంబ నేపథ్యం..
అరుణ్ జైట్లీ నవంబర్ 28, 1952న కొత్త ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం గుజరాత్‌లో స్థిరపడ్డారు. ఇతని తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ ప్రముఖ న్యాయవాది. జమ్మూ కశ్మీర్ మాజీ ఆర్థిక మంత్రి గిరిదాల్ లాల్ కుమార్తె సంగీతను 1982లో వివాహం చేసుకున్నారు. పిల్లలు సోనాలీ జైట్లీ, రోహన్ జైట్లీ. ఇద్దరూ కూడా లాయర్లే కావడం విశేషం. కిడ్నీ సంబందిత వ్యాధితో బాధపడుతున్న జైట్లీ అమెరికాలో శస్త్ర చికిత్స కూడా తీసుకున్నారు. దాని కారణంగానే 2019 ఓటాన్ ఎకౌంట్ బడ్జెన్‌ను ప్రవేశపెట్టలేక పోయారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ, పార్టీ కార్యాకలపాలకు జైట్లీ దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్య సమస్య కారణంగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment