సాక్షి, న్యూఢిల్లీ : తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66)ని పార్టీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీ సోమవారం పరామర్శించారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఈ నెల 9న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. జైట్లీ ఇంకా కోలుకోకపోవడంతో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు ఆయనను పరామర్శిస్తున్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, జితేంద్ర సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఎయిమ్స్‌లో జైట్లీని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు ఈనెల 10 నుంచి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడంతో పలువురు ప్రముఖ నేతలు ఆయన ఆరోగ్య పరస్థితిని వాకబు చేసేందుకు ఎయిమ్స్‌కు తరలివస్తున్నారు. కాగా, నరేంద్ర మోదీ తొలి సర్కార్‌లో ఆర్థికమంత్రిగా ఉన్నపుడే అరుణ్ జైట్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో అమెరికాలో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన అనంతరం, అనారోగ్యం కారణంగా తనను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment