
రజత్ శర్మ(ఫైల్‌ఫోటో)
న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్ష పదవికి సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ ఉన్నపళంగా రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే రజత్ శర్మ రాజీనామాను తాము ఇంకా ఆమోదించలేదని డీడీసీఏ డైరెక్టర్ ఆర్పీసింగ్ స్పష్టం చేశారు. రజత్ శర్మ రాజీనామాను తాము వెంటనే ఆమోదించేసినట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇంకా ఆయన రాజీనామా అంశం చర్చల దశలోనే ఉందన్నారు. రజత్ రాజీనామాపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. డీడీసీఏలో అధిక ఒత్తిళ్లు ఎదురవుతున్న కారణంగానే రాజీనామా చేసినట్లు శనివారం తన పదవికి గుడ్‌బై చెప్పిన తర్వాత రజత్ శర్మ తెలిపారు. కొంత మంది క్రికెట్ సమగ్ర అభివృద్ది కోసం కాకుండా స్వార్థ పూరిత విధానాలకు పాల్పడుతున్నారన్నారు.
డీడీసీఏలో తారాస్థాయిలో అంతర్యుద్దం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా ముఖ్య కార్యదర్శి వినోద్ తిహారాతో రజత్ శర్మకు పొసగటం లేదు. అరుణ్ జైట్లీ మరణం తర్వాత డీడీసీఏ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు రావడం అంతేకాకుండా రజత్ శర్మపై అన్ని వైపులా ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా తమ నిర్ణయాలకు అధ్యక్షుడు వ్యతిరేకించడంతో సంఘం సభ్యులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.